ఉదయం లేవగానే చాలామంది పక్క బట్టలు సర్దేస్తారు. ఇది క్రమశిక్షణకు మారుపేరుగా భావిస్తారు. అయితే, ఈ అలవాటు మంచిదే అయినా.. వాస్తవానికి నిద్ర పరిశుభ్రతకు విఘాతం కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. బదులుగా.. పడకను సర్దడం కాస్త ఆలస్యం చేయాలని సూచిస్తున్నారు. రాత్రంతా మన శరీరం నుంచి ఎంతో వేడి, చెమట విడుదలవుతుంది. చర్మం నుంచి మృతకణాలు, జుట్టులోని చుండ్రు, ముఖానికి వేసుకున్న మేకప్.. ఇవన్నీ బెడ్షీట్లు, పరుపుల్లోకే చేరుతాయి.
దాంతో, ఉదయాన్నే పడకను సర్దడం వల్ల.. ఈ అవశేషాలన్నీ బెడ్షీట్లు, పరుపు లోపలే చిక్కుకుపోతాయి. సూక్ష్మక్రిములు వృద్ధి చెందడానికి అనువైన వెచ్చని, తేమతో కూడిన వాతావరణాన్ని ఏర్పరుస్తాయి. అలా వృద్ధి చెందిన సూక్ష్మ క్రిములు.. మన చర్మ మృతకణాలనే ఆహారంగా తీసుకుంటాయి. తేమతో కూడిన వాతావరణంలో విరివిగా వృద్ధి చెందుతాయి.దీర్ఘకాలంలో అలెర్జీలు, శ్వాసకోశ సమస్యలను కలిగిస్తాయి. ఇలా కావొద్దంటే.. నిద్రలేచిన వెంటనే దుప్పట్లను సరిచేయడానికి బదులుగా, పడకకు గాలి తగిలేలా వదిలేయాలని నిపుణులు సిఫారసు చేస్తున్నారు.
సూర్యకాంతి లోపలికి రావడానికి కిటికీలు, తెరలను తెరిచి ఉంచాలనీ, 20-30 నిమిషాలు ఆగిన తర్వాత పక్క బట్టలు సర్దేసుకోవాలని చెబుతున్నారు. ఈ సాధారణ అలవాటు.. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. బెడ్షీట్లు, పరుపులకు బాగా గాలి ఆడటం వల్ల వేడి, తేమ లోపలికి ఇంకకుండా ఉంటాయి. ధూళి పురుగులు వృద్ధి చెందకుండా ఉంటాయి. నిజానికి చాలా ఇళ్లలో డస్ట్‌మైట్స్ సహజంగానే ఉన్నప్పటికీ.. వాటి పెరుగుదలకు పరుపుల్లోని తేమ, వెచ్చదనం, చర్మ మృతకణాలే ఆధారం. అవి లేకుంటే సూక్ష్మక్రిములు వృద్ధిచెందకుండా ఉంటాయి.