ఇమేజ్ చట్రంలో బందీ కావడం అంటే పంజరంలో పక్షిలా మిగిలిపోవడమే. హద్దుల సంకెళ్లు తెంచుకున్నప్పుడే గగనమంతా మనదే అంటూ స్వేచ్ఛా విహారం చేయొచ్చు. ఈ సూత్రాన్ని బలంగా విశ్వసిస్తారు హీరో రానా. మూసకు భిన్నంగా ప్రయాణం సాగించడం ఆయన నైజం. ‘ప్రేక్షకులకు కొత్త కథలు చెప్పాలన్నదే నా లక్ష్యం. రొటీన్ కమర్షియల్ చిత్రాలు నాకు ఏమాత్రం సరిపడవు’ అంటున్నారు రానా. ‘విరాటపర్వం’ చిత్రంలో ఆయన నక్సలైట్ నాయకుడి పాత్రలో నటించారు. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సందర్భంగా రానా తన మనోభావాల్ని పంచుకున్నారు.
‘అరణ్య’ నుంచి ‘విరాటపర్వం’ వరకు అడవి నేపథ్యంగా సాగే కథలతో ప్రయాణించడం ఎలా అనిపిస్తున్నది?
గత మూడేళ్లుగా అడవికి, నాకూ మధ్య ఏదో బంధం పెనవేసుకుపోయినట్టు అనిపిస్తున్నది. ‘విరాటపర్వం’ నక్సలిజం నేపథ్యంలో నడిచే కథ. ప్రతి సన్నివేశం వాస్తవికతను ప్రతిబింబిస్తుంది. అడవిలో నాటి నక్సల్స్ జీవన చిత్రణతో పాటు హృదయాల్ని తాకే అందమైన ప్రేమకథతో సాగే ఉద్వేగభరిత ప్రయాణమిది.
ప్రేమకథ కేంద్రంగా నక్సలిజాన్ని ఎలా చూపించారు? ఈ రెండిటికి మైత్రి ఎలా కుదిరింది?
నా కెరీర్లో తొలి ప్రేమకథా చిత్రమిది. స్టీరియోటైప్ ప్రేమకథలు నాకు అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి సినిమాలు చూడను. చేయను కూడా. కానీ ‘విరాటపర్వం’లో ప్రేమలోని గాఢతను, భావోద్వేగాలలోని తీవ్రతను చూస్తారు. పవిత్రమైన ప్రేమను వెతుక్కుంటూ వెన్నెల అనే అమ్మాయి ఎంత దూరం ప్రయాణించిందో.. ప్రేమాన్వేషణలో ఆమెకు ఎదురైన ప్రతిబంధకాలు ఏమిటో.. తెరమీద చూస్తారు.
కథ వింటున్నప్పుడు మీ భావోద్వేగాలు ఎలా ఉన్నాయి?
తొలుత నాలుగు పేజీల్లో కథ సారాంశం చదివాను. హృదయం బరువెక్కిపోయింది. సముద్రం మధ్యలో చిక్కుకుపోయిన ఒంటరి యాత్రికుడిలా మనసు నిండా ఏవో ఆలోచనలు ముప్పిరిగొన్నాయి. ఇలాంటి కథ నేనెప్పుడూ వినలేదు. కేవలం స్టోరీ సినాప్సిస్ చదివే.. ఈ సినిమా తప్పకుండా చేయాలని నిర్ణయించుకున్నా.
‘విరాటపర్వం’ కథలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశాలేమిటి?
నక్సల్స్ భావజాలంలో వ్యక్తిగత స్వార్థం ఉండదు. అణగారిన వర్గాల ప్రయోజనాలే పరమావధిగా ఉంటాయి. ఓ బలమైన సిద్ధాంతం ప్రాతిపదికన వారు పోరాటం సాగిస్తుంటారు. ఉద్యమమే ఊపిరిగా పనిచేస్తున్న రవన్న అనే దళ నాయకుడి జీవితంలోకి వెన్నెల అనే అమ్మాయి ప్రవేశిస్తుంది. అలాంటి తరుణంలో అటు ఉద్యమ సిద్ధాంతాలు, ఇటు వ్యక్తిగత ప్రేమ మధ్య చోటు చేసుకునే నైతిక సంఘర్షణ ఎలా ఉంటుంది? వాటిలో ఏ విలువను త్యజించాలనే డోలాయమానంలో.. వెన్నెలతో రవన్న ప్రయాణం ఎలా సాగింది? అన్నది హృద్యంగా, స్ఫూర్తిమంతంగా తెరకెక్కించారు.
సరళ అనే అమ్మాయి స్ఫూర్తితో కథానాయిక వెన్నెల పాత్రను రాసుకున్నానని చెప్పారు దర్శకుడు వేణు ఊడుగుల. మరి రవన్న పాత్రకు ప్రేరణ ఎవరు?
రవన్నది పూర్తిగా కల్పిత పాత్ర. దర్శకుడు వేణు ఊడుగుల ఉదాత్త భావాల్ని ఆపాదిస్తూ ఆ పాత్రను సృష్టించాడు. చేగువేరా మొదలుకొని తెలంగాణ నక్సల్ ఉద్యమంలో ప్రభావశీలమైన పాత్ర పోషించిన అనేక మంది నాయకుల స్ఫూర్తి రవన్న పాత్రలో కనిపిస్తుంది. డాక్టర్ అయిన రవన్న వామపక్ష భావజాల ప్రభావంతో తొలుత కవిగా మారుతాడు. ఆ తర్వాత సమసమాజ స్థాపన ధ్యేయంగా అడవి బాట పడతాడు.
రవన్న పాత్ర మీపై వ్యక్తిగతంగా ఏమైనా ప్రభావం చూపిందా?
కవులు, రచయితలు, విప్లవకారులు చూడటానికి అతి సాధారణంగా కనిపిస్తారు. వారి హృదయాల్లో మాత్రం తీవ్రమైన భావ సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. దర్శకుడు వేణు ఊడుగుల రవన్న పాత్ర గురించి చెబుతూ కొన్ని విప్లవ నేపథ్య కవితల్ని వినిపించాడు. అవి నాలో ఉత్తేజాన్ని నింపాయి. ఆ మాటల్లో ఏదో శక్తి ఉందనిపించింది. తెరపై నా పాత్రలో కూడా అవే భావోద్వేగాలు కనిపిస్తాయి.
ఈ సినిమాకు సాయిపల్లవే హీరో అని ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పారు కదా..?
నా మనసులో మాటనే అక్కడ చెప్పాను. రవన్న పాత్రను మరొకరు చేయగలుగుతారు కానీ.. వెన్నెల క్యారెక్టర్‌కు సాయిపల్లవి తప్ప ఎవరూ న్యాయం చేయలేరు. ఇక వ్యక్తిగతంగా సాయిపల్లవి సహృదయురాలు. కల్మషం లేని వ్యక్తిత్వం. వెన్నెలగా సాయిపల్లవి అభినయం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది.
కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన కథల్ని ఎంచుకుంటున్నారు. అయినా సోలో హీరోగా ఆశించిన విజయాలు దక్కలేదనే అసంతృప్తి ఏమైనా ఉందా?
అన్ని సినిమాల్లో హీరోగా చేద్దామంటే నేను కొట్టగలిగే విలన్స్ ఎవరూ కనిపించడం లేదు (నవ్వుతూ). నా బాడీ ఫిజిక్ ముందు అందరూ చిన్నగా అనిపిస్తున్నారు. ప్రేక్షకులకు కొత్త కథల్ని పరిచయం చేద్దామనే నేను హీరోగా మారాను. కాబట్టి హీరోగానే నటించాలనే నియమమేం పెట్టుకోలేదు.
నటుడిగా ఎలాంటి లక్ష్యాల్ని పెట్టుకున్నారు?
ప్రతి సినిమాలో ఎంతోకొంత నవ్యత ప్రదర్శించాలన్నది నా సిద్ధాంతం. రాబోయే చిత్రాలన్నిటిలో నేను హీరోగా నటిస్తున్నా. అవన్నీ పవర్ఫుల్ యాక్షన్‌తో ఆకట్టుకుంటాయి. ‘హిరణ్యకశ్యప’ నాలోని కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు నాకు నచ్చవు. సినిమాల్లో హీరోయిన్ను టీజింగ్ చేయడం కూడా నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. నా దృష్టిలో నటులు తాత్కాలికం. సినిమాలే శాశ్వతం. భవిష్యత్తులో ప్రేక్షకులు గొప్పగా మాట్లాడుకునే సినిమాలు చేయాలనే లక్ష్యంతో కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నా. ఫలానా సినిమా రానా మాత్రమే చేయగలడు అని ప్రేక్షకులు నమ్మాలి. అలాంటి పేరునే నేను ఇష్టపడతాను.
ప్రస్తుత పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ గురించి మీరేమంటారు?
కథను బట్టే సినిమా స్థాయి నిర్ణయం అవుతుంది. ప్రేక్షకుల ఆదరణను చూసి ఆ సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ ఉందో లేదో చెప్పొచ్చు. అంతేకానీ, పాన్ ఇండియా సినిమా అంటూ ముందస్తుగానే ముద్రవేయడం మంచిది కాదు.
తదుపరి చిత్రాల గురించి?
‘హిరణ్యకశ్యప’ వచ్చే ఏడాది మార్చిలో సెట్స్ మీదికి వెళ్తుంది. బాబాయ్ వెంకటేశ్‌తో ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్ చేస్తున్నా. ఇదొక క్రైమ్, ఫ్యామిలీ డ్రామా. తొలి సీజన్ పది ఎపిసోడ్స్‌తో ఉంటుంది.
‘విరాటపర్వం’లో నక్సలిజం కంటే ప్రేమకథే ప్రధానంగా ఉంటుంది. కథకు సమాంతరంగా నాటి రాజకీయ, సామాజిక పరిస్థితుల వ్యాఖ్యానం ఉన్నప్పటికీ.. కథ మొత్తం ప్రేమ కేంద్రంగానే నడుస్తుంది.
ఈ సినిమాలో జరీనా వాహబ్, ప్రియమణి, నందితాదాస్ వంటి అగ్రతారలు భాగమయ్యారు. వారి పాత్రలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తాయి. బలమైన మహిళా పాత్రలకు చిరునామాగా వారు కనిపిస్తారు. కథానాయిక వెన్నెలకు నైతిక ైస్థెర్యాన్నిస్తూ ఆ పాత్రలన్నీ ఆకట్టుకుంటాయి.
– కళాధర్ రావు జూలపల్లి