ఆహారాన్ని శక్తిగా మార్చే ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కీలక అవయవం కాలేయం. అది కనుక బలహీనపడితే దేహంలోని మిగతా భాగాలనూ నిస్సత్తువ ఆవహిస్తుంది. కాలేయ సంబంధ రోగాలకు కారణం.. హెపటైటిస్ వైరస్‌లే. వీటి బారినపడి ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్షల మంది చనిపోతున్నారు. దీనిని నివారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ జూలై 28ని ‘హెపటైటిస్ అవగాహనా దినం’గా ప్రకటించింది. హెపటైటిస్ వ్యాధిని ఆయా వైరస్ల ఆధారంగా .. ఎ నుంచి ఇ వరకు అయిదు రకాలుగా విభజించారు. ఈ వైరస్లలో కొన్ని దీర్ఘకాలికంగా, మరికొన్ని స్వల్పకాలికంగా రోగిని ఇబ్బందిపెడతాయి.
హెపటైటిస్-ఎ, ఇ
ఈ వైరస్లు కలుషిత ఆహారం, నీళ్ల ద్వారా సోకుతాయి. ఈ రెండిటిలో ఏది సంక్రమించినా జ్వరం, ఆయాసం, మలబద్ధకం, దేహం (కళ్లు కూడా) పచ్చగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటి బారిన
పడినవాళ్లు కొన్ని వారాల్లోనే కోలుకుంటారు.
హెపటైటిస్- బి, సి
ఈ వైరస్ సోకిన వారి రక్తాన్ని కానీ, ప్లాస్మాను కానీ ఎక్కిస్తే వాళ్లకూ సోకుతుంది. లైంగిక సంబంధాల ద్వారా కూడా పాకుతుంది. గర్భిణుల విషయంలో ప్రసవం తర్వాత బిడ్డకు కూడా రావచ్చు. ఈ వైరస్లు దీర్ఘకాలం బాధిస్తాయి. కొద్దికాలం తర్వాత కాలేయంలో ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది. దీంతో దాని పనితీరు మందగిస్తుంది. సకాలంలో వైద్యం అందకపోతే కాలేయం విఫలం అవుతుంది. రుగ్మత ముదిరిపోయి క్యాన్సర్‌కు దారితీయవచ్చు.
హెపటైటిస్-డి
ఈ వైరస్ అసాధారణ పరిస్థితుల్లోనే సోకుతుంది. హెపటైటిస్-బితో బాధపడుతున్న వారికి హెపటైటిస్-డి వైరస్ ఉన్న కలుషిత రక్తం ఎక్కిస్తే.. హెపటైటిస్-డి బారినపడే ప్రమాదం ఉంది.
ముందు జాగ్రత్త..
ఇప్పటికే హెపటైటిస్-ఎ, బి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. హెపటైటిస్-సి వ్యాక్సిన్ ఇంకా రాలేదు. హెపటైటిస్-ఎ వ్యాక్సిన్‌ను రెండుసార్లు ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. అదే హెపటైటిస్-బి వ్యాక్సిన్‌ను మూడుసార్లు ఇస్తారు. అన్ని వయసుల వాళ్లూ ఈ వ్యాక్సిన్లు తీసుకోవచ్చు. టీకాల వల్ల వచ్చిన వ్యాధి నిరోధక శక్తి జీవితకాలం ఉంటుంది.