దర్శకుడు కట్ చెప్పడంతో లొకేషన్లో షూటింగ్ ముగుస్తుంది. కానీ, ఆయన సరిగ్గా కట్ చేస్తేనే.. మంచి సినిమాగా తెరపైకి వస్తుంది. దర్శకుడు ప్రేమగా తీసిన సన్నివేశమైనా.. స్టంట్ మాస్టర్ ప్రాణం పెట్టిన ఫైట్స్ అయినా.. పంటికింద రాయిలా అనిపిస్తే.. నిర్మొహమాటంగా కోసేయడం ఆయన బాధ్యతే. ఆ చిత్ర భవితవ్యాన్ని తేల్చే క్రమంలో కత్తెర మీద సాము చేస్తాడు ఎడిటర్. అలాంటి యుద్ధాలెన్నో చేసి సక్సెస్ఫుల్ ఎడిటర్ అని నిరూపించుకున్నారు మార్తాండ్ కె వెంకటేశ్. మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’ కు కూడా తనే ఎడిటర్. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలకానుంది. ఈ సందర్భంగా మార్తాండ్ కె వెంకటేశ్‌తో ముఖాముఖి.
‘సర్కారు వారి పాట’ కథ వినగానే ఎడిటర్‌గా మీకు ఎలాంటి అభిప్రాయం కలిగింది?
దర్శకుడు పరశురామ్‌తో కలిసి చాలా కాలంగా ప్రయాణం చేస్తున్నా. ‘గీత గోవిందం’ చిత్రానికి నేనే పనిచేశాను. సాధారణంగా ఆయన సినిమాల్లో ఫ్యామిలీ డ్రామా, లవ్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ‘సర్కారు వారి పాట’ చిత్రంలో పుష్కలమైన మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కుటుంబ ప్రేక్షకులకు కూడా ఈ కథ బాగా కనెక్ట్ అవుతుంది. ‘గీత గోవిందం’, ‘పోకిరి’ రెండు చిత్రాలకు నేను ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించా. ఈ రెండు సినిమాలు కలిపితే ‘సర్కారు వారి పాట’ అవుతుంది. ఈ సినిమాలో మహేశ్‌బాబు గతంలో కన్నా అందంగా కనిపిస్తాడు.
ఈ సినిమాను ‘పోకిరి’తో పోల్చారెందుకు?
‘పోకిరి’ రషెస్ చూసినప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని చెప్పాను. నా అంచనా నిజమైంది. ‘సర్కారు వారి పాట’ రషెస్ చూసినప్పుడు ‘పోకిరి’ని అధిగమిస్తుంది అనిపించింది. ప్రథమార్ధంలో నాయకానాయికల మధ్య వచ్చే లవ్‌ట్రాక్ కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. ద్వితీయార్ధంలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కట్టి పడేస్తుంది. మొత్తంగా మహేశ్‌బాబు అభిమానులకు ఓ పండుగలా ఉంటుందీ చిత్రం.
టెక్నాలజీ వల్ల ఎడిటర్‌కు శ్రమ తగ్గిందా?
సాంకేతికత వల్ల సినిమాల్ని వేగంగా పూర్తి చేయగలుగుతున్నాం. అప్పట్లో ఏడాదికి పది సినిమాలు చేస్తే గొప్ప. డిజిటల్ యుగంలో ఏడాదికి ఇరవై చేసే సౌలభ్యం ఉంది.
సాంకేతికత కారణంగా ఎడిటర్‌కు మునుపటి గౌరవం దక్కడం లేదా?
రీల్ ఎడిటింగ్ ఒక్కసారి చేస్తే పూర్తయిపోయినట్లే. దానికి మరొక వెర్షన్ ఉండదు. దర్శకుడు, ఎడిటర్ కలిసి ఎక్కడ ఏ సీన్ కట్ చేయాలో, కంటిన్యుటీ ఎలా ఉండాలనే విషయాల్ని చర్చించిన తర్వాత ఎడిటింగ్ టేబుల్ మీదికి వెళ్లేవారు. ఒక్కసారి పని పూర్తయిందంటే అదే ఫైనల్‌గా ఉండేది. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఎడిటింగ్‌లో మల్టిపుల్ వెర్షన్స్, ఇంకా ఎన్నో మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి.
లొకేషన్లోనే ఆన్లైన్ ఎడిటింగ్ గురించి..
ఆన్‌లొకేషన్‌లో ఎడిటింగ్ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. అయితే, సెట్లో పూర్తి ఎడిటింగ్ చేయాలంటే కుదరదు. అప్పుడు తీసిన సీన్ వరకే చేస్తారు. షూటింగ్ పూర్తయ్యాకే సినిమాను ఫైనల్‌గా ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఎడిటింగ్ చేసినా, సినిమా ఫైనల్ ప్రొడక్ట్ అనేది ఎడిటర్ రూం నుంచే రావాలి.
డిజిటల్ ఎడిటింగ్‌లో మీ జడ్జిమెంట్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉందా?
సినిమా రషెస్ చూసినప్పుడే ఓ అభిప్రాయం ఏర్పడుతుంది. ఎక్కడ ఎలాంటి కత్తెర్లు అవసరమో తెలిసిపోతుంది. దాంతో ఫస్ట్ ఇంప్రెషన్‌ను దృష్టిలో పెట్టుకొని ఎడిటింగ్ చేస్తాం.
ఎడిటర్‌గా దర్శకులతో మీ సంబంధాలు ఎలా ఉంటాయి?
ప్రేక్షకులు తెరపై చూసే సినిమాను మేం ముందే చూస్తాం. సినిమా ఎలా ఉండబోతున్నదనే ప్రాథమిక అంచనాలు మా నుంచే వెళ్తాయి. కాబట్టి, దర్శకులతో మంచి వాతావరణంలో పనిచేస్తాం. పరస్పరం చర్చించుకుంటాం. ఒక్కోసారి బెటర్మెంట్ కోసం గొడవలు జరుగుతుంటాయి. దర్శకులు తప్పకుండా నా అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
ఇటీవలి కాలంలో ఎడిటింగ్ రూమ్ నుంచి సినిమాలు లీక్ అయ్యే ఘటనలు ఎక్కువయ్యాయి. దీనిపై మీరేమంటారు?
సాంకేతికత వల్ల లాభనష్టాలు రెండూ ఉంటాయి. రీలు ఉన్నప్పుడు లీకేజీ సమస్య అస్సలు ఉండేది కాదు. ఎడిటింగ్ రూమ్ నుంచి ల్యాబ్‌లో ప్రింట్ అయిన రీలు మాత్రమే బయటికి వెళ్లేది. ప్రస్తుతం డిజిటల్ టెక్నాలజీ వల్ల అవుట్‌పుట్ సులభంగా బయటికి వెళ్లిపోతున్నది. అందుకే, ఎడిటింగ్ చేసిన కంటెంట్‌పై తేదీ సహా వాటర్ మార్క్ వేస్తున్నాం. దీనివల్ల లీకేజీ జరిగినా ఎవరు చేశారో సులభంగా తెలిసిపోతుంది.
ఈ రంగంలో మీరు ఎదుర్కొనే సమస్యలు?
చిన్న చిన్న ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఫైట్ మాస్టర్ తాను తీసిన యాక్షన్ సీక్వెన్స్ మొత్తం ఉంటే బాగుండేదని అంటాడు. చాలా కష్టపడి తీసిన షాట్‌ను ఎందుకు తీసుకోలేదని సినిమాటోగ్రాఫర్స్ అడుగుతుంటారు. సినిమా రిక్వైర్‌మెంట్‌కు తగినట్లుగా మేం తీసేశాం అని చెబుతుంటాం. ఒక్కోసారి వాదోపవాదాలు జరుగుతాయి. ఏదిఏమైనా కెప్టెన్ ఆఫ్ ది షిప్ దర్శకుడే కాబట్టి, అతనిదే అంతిమ నిర్ణయం.
పాన్ ఇండియా సినిమాలు చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలా?
అలాంటిదేమీ లేదు. అన్ని భారతీయ భాషలకు ఒకేరకమైన ఎడిటింగ్ ఉంటుంది. ఏదైనా అవార్డులకు పంపించే సినిమాలకు మాత్రం పాటల్ని తీసేస్తుంటాం. భారతీయ భాషల్లో విడుదలయ్యే సినిమా నిడివి కూడా ఒకే విధంగా ఉంటుంది.
ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాల గురించి?
చిరంజీవిగారి ‘గాడ్‌ఫాదర్’ ‘భోళాశంకర్’తో పాటు సమంత నటిస్తున్న ‘యశోద’ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేస్తున్నా.
ఎడిటర్‌గా మీ ప్రయాణం ఎలా సాగుతున్నది?
దాదాపు 450 సినిమాలకు పనిచేశాను. అప్పటి సీనియర్ హీరోల నుంచి నేటి కొత్తతరం హీరోల వరకు అనేక సినిమాలు నా ఖాతాలో ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే సినీ రంగంలో రెండు తరాలతో పనిచేశా.
విమర్శల్ని ఎలా స్వీకరిస్తారు?
నిర్మాణాత్మక విమర్శలు వృత్తిపరంగా ఎంతో మేలు చేస్తాయి. మరింత సృజనాత్మకంగా ఆలోచించేందుకు వీలు కల్పిస్తాయి. అయితే చెప్పే విషయంలో స్పష్టత ఉండాలన్నది నా సిద్ధాంతం. కొందరు దర్శకులు పది నిమిషాల నిడివి తగ్గిస్తే బాగుంటుందని కోరతారు. ఏ సీన్స్ తొలగించాలో చెప్పరు. ఇలాంటి సందర్భాల్లో మేమూ కన్ఫ్యూజ్ అవుతుంటాం. వారికి ఏం కావాలో వివరంగా
చెబితే అవుట్‌పుట్ బాగా వచ్చే వీలుంటుంది.
పెద్ద సినిమాల విషయంలో ఎడిటర్స్ మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుందా?
అవును. పెద్ద సినిమాలు ఓవర్సీస్కు మూడురోజుల ముందే వెళ్లాలి. దాంతో మాపై చాలా ఒత్తిడి ఉంటుంది. దర్శకులు బెటర్మెంట్ కోసం ఇంకా ఏదో చేయాలనే తాపత్రయంతో ఉంటారు. ఓ సీన్ విషయంలో చివరివరకు చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో కాస్త ఒత్తిడికి గురవుతుంటాం. అయితే పెద్ద సినిమాలకు ఇదంతా తప్పనిసరి అయిపోయింది.
సినిమా సక్సెస్‌లో ఎడిటర్ పాత్ర?
అది దర్శకుడు, ఎడిటర్‌కు మధ్య ఉండే సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. ఇద్దరి సెన్సిబిలిటీస్, ఆలోచనలు ఒకటే అయితే మంచి అవుట్‌పుట్ వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇద్దరి మధ్య ఎంత తీవ్రంగా చర్చలు జరిగితే అంత గొప్ప అవుట్‌పుట్ వస్తుంది.