క్యాన్సర్… ఈ మాట ఎంతోమందిని భయపెడుతున్నది. క్యాన్సర్ ఒక వ్యాధి కాదు. అనేక వ్యాధుల సమూహం. అసాధారణ కణాలు నియంత్రణ లేకుండా పెరగడం, అవి ఇతర భాగాలకు వ్యాపించడం వల్ల కలిగే అనేక వ్యాధులే క్యాన్సర్. ప్రాణాంతకమైన క్యాన్సర్ పేరు వింటేనే భయపడుతున్నారు. ఈ భయాన్ని పోగొట్టేందుకు యశోద హాస్పిటల్స్ డిస్కవర్ హెల్త్ కార్యక్రమం నిర్వహిస్తున్నది. క్యాన్సర్ అంటే ఏంటి? దానికి కారణాలేమిటి? ఎలా గుర్తించాలి? దీని నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సా విధానాలు, క్యాన్సర్ గురించి సమగ్రంగా తెలియజేస్తూ సమాజంలో అవగాహన పెంపొందిస్తున్నది.
ప్రపంచ వ్యాప్తంగా ఏటా 2 కోట్ల మందికి పైగానే కొత్తగా క్యాన్సర్ బారినపడుతున్నారు. వీరిలో రొమ్ము, ఊపిరితిత్తులు, పెద్దపేగు, ప్రోస్టేట్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బాధితులే అత్యధికం. వైద్య రంగం సాధించిన పురోగతి వల్ల అనేక రకాల క్యాన్సర్లను సమర్థంగా నియంత్రించగలుగుతున్నారు. అంతేగాక, కొన్నింటిని పూర్తిగా నయం చేయడం సాధ్యమవుతున్నది.
శరీరంలోని సాధారణ కణాల్లో జన్యు మార్పులు సంభవించినప్పుడు క్యాన్సర్ ప్రారంభమవుతుంది. ఈ మార్పుల వల్ల కణాలు నియంత్రణ లేకుండా విపరీతంగా పెరుగుతూ, సమీప కణజాలాలపై దాడి చేస్తాయి. అంతేకాకుండా, ఈ అసాధారణ కణాలు రక్తప్రసరణ వ్యవస్థ లేదా లింపాటిక్ (శోషరస) వ్యవస్థ ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. ఈ విధంగా ఇతర అవయవాలకు వ్యాప్తి చెందడాన్ని మెటాస్టాసిస్ (Metastasis) అని అంటారు.
క్యాన్సర్ ప్రారంభమయ్యే అవయవం లేదా కణజాలం ఆధారంగా ఈ క్యాన్సర్లను వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఇప్పటికి 100కు పైగా క్యాన్సర్లను గుర్తించారు. ఉదాహరణకు.. ఊపిరితిత్తుల క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ మొదలైనవి. ఈ వ్యాధికి ప్రధానమైన కారణాలను పలు పరిశోధనలు నిర్ధారించాయి. వాటిలో ముఖ్యమైనవి..
జీవనశైలి సంబంధిత కారకాలు పొగాకు వినియోగం: క్యాన్సర్‌ని కలిగించే ప్రధానమైన వాటిల్లో పొగాకు మొదటిది. ఊపిరితిత్తులు, నోరు, గొంతు క్యాన్సర్లకు పొగాకే ప్రధాన కారణం.
మద్యపానం: కాలేయం, రొమ్ము, అన్నవాహిక క్యాన్సర్లకు మద్యపానం కారణమవుతున్నది. అనారోగ్యకరమైన
ఆహారం: అధిక కొవ్వు, తక్కువ ఫైటర్ కలిగిన ఆహారం, ఫాస్ట్‌ఫుడ్ అధికంగా తీసుకోవడం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
స్థూలకాయం: ఇది పెద్దపేగు, రొమ్ము, క్లోమ గ్రంథి క్యాన్సర్ (ప్యాంక్రియాటిక్ క్యాన్సర్)కు దారితీస్తాయి. వ్యాయామ లోపం కూడా ఈ రకం క్యాన్సర్లను కలిగించవచ్చు.
కాలుష్యం, రేడియేషన్, ఆస్బెస్టాస్ ఉత్పత్తుల కాలుష్యం, బెంజీన్, అల్ట్రావయొలెట్ కిరణాలు.. దీర్ఘకాలం వీటి ప్రభావానికి గురైనప్పుడు కణాల్లో జన్యు మార్పిడికి దారి తీస్తుంది. అందువల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.
కొన్ని రకాల వైరస్లు, బ్యాక్టీరియా కొన్ని నిర్ధిష్టమైన క్యాన్సర్లను కలిగిస్తున్నాయి.
హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) కారణంగా గర్భాశయ ముఖద్వార (సర్వికల్) క్యాన్సర్, ఓరోపారింజియల్ క్యాన్సర్ తలెత్తవచ్చు.
హెపటైటిస్ బీ-హెపటైటిస్ సీ వైరస్: ఈ వైరస్లు కాలేయ క్యాన్సర్‌ని కలిగిస్తాయి.
హెచ్ పైలోరి (H. Pylori) ఇన్ఫెక్షన్: జీర్ణాశయ క్యాన్సర్‌ను కలిగిస్తుంది.
కొందరికి BRCA1, BRCA2 వంటి నిర్ధిష్టమైన జన్యువుల్లో మార్పులు ఉంటాయి. ఇవి వంశపారంపర్యంగా రావొచ్చు. ఈ జన్యు మార్పులు రొమ్ము, అండాశయ (ఓవరియన్) క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయి.
క్యాన్సర్ సమర్థమైన చికిత్సకు ప్రారంభ దశ, కచ్చితమైన నిర్ధారణ అత్యంత కీలకమైనవి. క్యాన్సర్‌ను గుర్తించడానికి వైద్యులు శారీరక పరీక్ష, గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు, చికిత్సను పరిశీలిస్తారు. రోగి లక్షణాలు, కుటుంబ చరిత్ర, జీవనశైలి వంటి అంశాలను పరిశీలిస్తారు.
ఇమేజింగ్ పరీక్షలు: ఎక్స్-రే, సిటి స్కాన్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ వంటి పరికరాల ద్వారా శరీరంలోని అనుమానాస్పద భాగాలను పరిశీలిస్తారు.
బయాప్సీ: క్యాన్సర్ నిర్ధారణలో అత్యంత విశ్వసనీయ పద్ధతి. అనుమానాస్పద కణజాలం నుంచి చిన్న ముక్కను వేరుచేసి, అందులో క్యాన్సర్ కణాలున్నాయా లేదా అనేది మైక్రోస్కోప్‌లో పరీక్షించి నిర్ధారిస్తారు.
వంశపారంపర్య క్యాన్సర్ ప్రమాదాన్ని గుర్తించడంలో లేదా చికిత్సకు రోగి స్పందనను అంచనా వేయడంలో జన్యు పరీక్షలు సాయపడతాయి.
క్యాన్సర్ చికిత్స దాని రకం, దశ, అలాగే రోగి పూర్తి ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఆధునిక అంకాలజీ విభాగంలో, క్యాన్సర్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు పలు చికిత్సా విధానాలను సమన్వయంతో చేస్తున్నారు.
శస్త్రచికిత్స: ట్యూమర్, దాని చుట్టుపక్కల ప్రభావిత కణజాలాన్ని తొలగించడం. ప్రస్తుతం మినిమల్లీ ఇన్వేసివ్, రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీలు కచ్చితత్వాన్ని పెంచి, కోలుకునే సమయాన్ని తగ్గిస్తున్నాయి.
రేడియేషన్ థెరపీ: అధిక శక్తి కాంతి కిరణాలను ఉపయోగించి క్యాన్సర్ కణాలను నాశనం లేదా చిన్నవిగా చేయడం. IMRT, SBRT వంటి ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా ఆరోగ్యంగా ఉన్న కణజాలానికి హాని కలగకుండా రేడియేషన్ చికిత్స అందించవచ్చు.
కీమో థెరపీ: వేగంగా పెరుగుతున్న క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తిమంతమైన ఔషధ చికిత్స. ఇది శస్త్రచికిత్సకు ముందు లేదా శస్త్ర చికిత్స తర్వాత ఇస్తారు.
ఇమ్యునోథెరపీ: శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరచడం ద్వారా క్యాన్సర్ కణాలను నశింపచేసే విధానం ఇది. ఆధునిక అంకాలజీలో ఇమ్యునోథెరపీ ఒక కీలకమైన పురోగతి.
టార్గెటెడ్ థెరపీ: క్యాన్సర్ కణాల పెరుగుదలను ప్రేరేపించే, నిర్ధిష్టమైన సంకేతాలను అడ్డుకోవడం ద్వారా క్యాన్సర్‌ను తగ్గించే చికిత్స ఇది. ఇవి క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యం చేసుకుంటాయి. కాబట్టి టార్గెటెడ్ థెరపీతో సాధారణ కణాలకు ఎక్కువ హాని జరుగదు.
హార్మోన్ థెరపీ: రొమ్ము, ప్రొస్టేట్ లాంటి క్యాన్సర్లు హార్మోన్ సెన్సిటివ్‌గా ఉంటాయి. వీటి హార్మోన్ల ప్రభావాన్ని అడ్డుకోవడానికి అందించే చికిత్స ఇది. ఈ రకమైన క్యాన్సర్లను నియంత్రించడానికి ఇది మేలైన పద్ధతి.
ఎముక మజ్జ మార్పిడి: ల్యుకేమియా, లింఫోమా వంటి రక్త క్యాన్సర్లలో దెబ్బతిన్న ఎముక మజ్జను (బోన్ మ్యారో) తీసివేసి, ఆ స్థానంలో ఆరోగ్యవంతమైన స్టెమ్ సెల్స్ ద్వారా భర్తీ చేసే చికిత్సా విధానం.
క్యాన్సర్ చికిత్సలో వచ్చిన విప్లవాత్మక పురోగతి వల్ల క్యాన్సర్‌ని జయించిన వారి సంఖ్య పెరుగుతున్నది. చికిత్స అనంతరం క్యాన్సర్ రోగులు ఈ కింది విషయాలపై దృష్టి సారించాలి.
నేటి హాస్పిటల్స్ సమగ్ర క్యాన్సర్ సంరక్షణను అందిస్తున్నాయి. వైద్య నైపుణ్యంతో కూడిన చికిత్సతోపాటు భావోద్వేగ, సామాజిక మద్దతు కలిగిన చికిత్స అందించడం ద్వారా పేషెంట్లు ఆత్మవిశ్వాసంతో, మానోబలాన్ని పెంచుకునేలా సహకరిస్తున్నాయి. క్యాన్సర్ శరీరానికి సంబంధించిన వ్యాధి మాత్రమే కాదు. ఇది మానసిక సంఘర్షణ కూడా! అవగాహన, ప్రారంభ దశలో గుర్తింపు, సమయానుకూల వైద్యం ప్రాణాలను కచ్చితంగా కాపాడగలవు. రోబోటిక్ సర్జరీ, టార్గెటెడ్ థెరపీ, వ్యక్తిగతంగా అందించే మానసిక మద్దతుతో మెరుగైన ఫలితాలను పొందవచ్చు. మన ధైర్యం, స్థిమితత్వం, సహనం, ఆశావహ ఆలోచనలతో
క్యాన్సర్‌ను తేలిగ్గా జయించవచ్చు.
క్యాన్సర్ బారినపడిన అవయవం, కణజాలాన్ని బట్టి క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి. అయితే నిరంతర అలసట లేదా కారణం లేకుండా బరువు తగ్గడం క్యాన్సర్ బాధితుల్లో సాధారణంగా గమనించే లక్షణాలు.
కుటుంబ వైద్య చరిత్రపై అవగాహన కలిగి ఉండాలి. ప్రారంభ దశలో గుర్తింపే ప్రాణాలను కాపాడుతుంది. అనేక క్యాన్సర్లు ప్రారంభ దశలో నిర్ధారణ అయితే, తగిన చికిత్సతో పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుంది. అన్ని క్యాన్సర్లు పూర్తిగా నివారించలేనప్పటికీ, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, స్క్రీనింగ్ పరీక్షలు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.
– డాక్టర్. సచిన్ మర్జా
సీనియర్ సర్జికల్ అంకాలజిస్ట్ & రోబోటిక్ సర్జన్ (క్యాన్సర్ నిపుణుడు)
యశోద హాస్పిటల్స్-సోమాజిగూడ, హైదరాబాద్