Malavika Chakravarthy | మనుషుల కోసం ఎన్నో శరణాలయాలు ఉన్నాయి. మరి మనిషికి తోడుగా నిలిచిన శునకాలకు? ఢిల్లీకి చెందిన మాళవిక చక్రవర్తి ఆ లక్ష్యంతోనే ‘వాగింగ్ టెయిల్స్’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ నెలకొల్పారు. ఈ ఎన్జీవో వీధి కుక్కలకు నీడనిస్తుంది. సంరక్షణ అందిస్తుంది. రేబిస్ టీకాలు వేయిస్తుంది. అదే సమయంలో మనుషుల కష్టాలనూ గుర్తిస్తుంది. వీధి కుక్కల దాడిలో గాయాలపాలు అవుతున్నవారు ఎంతోమంది. ఈ సమస్యకు మాళవిక దగ్గర పరిష్కారం ఉంది.
వీధి కుక్కలకు ఎక్కడపడితే అక్కడ ఆహారం పెట్టకుండా, నిర్దేశిత ప్రదేశంలోనే వడ్డిస్తే కనుక ఇలాంటి ఇబ్బందులు ఉండవని సూచిస్తారామె. కాలనీవాసులు, స్థానిక సంస్థలతో మాట్లాడి కుక్కలకు టీకాలు వేయించాలని సలహా ఇస్తారు. ఓ అంచనా ప్రకారం, మన దేశంలో ఏటా ఇరవై వేల రేబిస్ మరణాలు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితిని సరిదిద్దడానికి వ్యాక్సిన్లే ఉత్తమ మార్గం. నిబంధనల ప్రకారం.. వీధి కుక్కలకు బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేస్తున్న సమయంలోనే రేబిస్ టీకా కూడా వేయాలి. అయినా, అక్కడితో సమస్య ముగిసిపోదు. ఏటా బూస్టర్ డోస్ పడకపోతే.. ఆ ప్రభావం తగ్గిపోతుంది. ఈ రెండూ జరిగినట్టు నిర్ధారిస్తూ కుక్కల చెవికి ఓ ట్యాగ్ జోడించాలని ప్రభుత్వాలకు సలహా ఇస్తారు మాళవిక.