పుట్టింది తమిళనాడులోనే అయినా, తెలుగు అంటే ఎంతో ఇష్టమని చెబుతున్నది జీ తెలుగు ‘మావారు మాస్టారు’ సీరియల్ కథానాయిక సంగీత. బుల్లితెర స్టార్ హీరోయిన్ కావాలన్నది తన కల.నేను చెన్నైలో పుట్టాను. కానీ నా మాతృభాష తెలుగే. మా అమ్మ తెలుగింటి ఆడబిడ్డ. ఇంట్లో మావాళ్లు తెలుగే మాట్లాడతారు. కానీ నేను మాత్రం, ఎందుకో తమిళం మాట్లాడేదాన్ని. మా అమ్మమ్మ వాళ్లది తిరుపతి. వేసవి సెలవులకు వెళ్లినప్పుడు తెలుగు నేర్చుకున్నా.
ఇంట్లో అందరం కలిసి సినిమాలకు వెళ్తాం. ఇంట్లో కూడా కలిసే చూస్తాం. అందుకే సినిమాలంటే చిన్నప్పటి నుంచీ ఇష్టం. ఆడిషన్స్‌కి వెళ్తానంటే అమ్మానాన్న ఒప్పుకోలేదు. బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్స్ చదివేప్పుడు మా సీనియర్స్ ప్రాజెక్టులో భాగంగా షార్ట్ ఫిల్మ్ చేశారు. అందులో నన్ను మెయిన్ రోల్ చేయమన్నారు. అది చూసి కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ అవకాశం ఇచ్చాయి. ఆ తర్వాత తమిళ సీరియల్స్ చేశాను. మంచి పేరు తెచ్చుకున్నాక, సినిమా అవకాశం వచ్చింది. ఆ సినిమా రిలీజ్ కాకముందే మరో ప్రాజెక్ట్‌కు సంతకం చేశాను. రెండూ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈలోగా జీ తెలుగు నుంచి పిలుపు అందింది. ఇక్కడి వాతావరణం
బాగా నచ్చింది.
తెలుగు సినిమాల్లో అడుగుపెట్టాలన్నది నా కోరిక.అల్లు అర్జున్ నాకు ఇష్టమైన హీరో. మా అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉన్నప్పుడు ‘ఆర్య’ చూశాను. అప్పటి నుంచీ అల్లు అర్జున్ అభిమానిగా మారాను. సినిమా కోసం ఏడాది పాటు బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసుకుని నెల రోజుల్లో షూట్ పూర్తి చేస్తారు. కానీ సీరియల్స్‌లో దానికి రివర్స్‌గా ఉంటుంది. నెలల తరబడి షూటింగ్. అన్నట్టు, ఇప్పుడు తెలంగాణ యాస నేర్చుకుంటున్నా. మ్యాథ్స్ టీచర్ కావాలనే నా కోరిక తీరలేదు. నా చదువు మధ్యలోనే ఆగిపోయింది. అయినా నాకు బాధలేదు. ఇష్టమైన రంగంలో సంతృప్తిగా ఉన్నాను.