శాటిలైట్ చిత్రాల్లో కదిలే మబ్బులు తెలంగాణ మీదికి రాగానే ‘బీ అలర్ట్’ అంటూ హెచ్చరికలు జారీచేస్తారు భారత వాతావరణ విజ్ఞాన విభాగం, హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కొప్పర్తి నాగరత్న. ఆ వెంటనే రేడియోలో వర్ష సమాచారం వినిపిస్తుంది. టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ కనిపిస్తుంది. ఆమె సూచనలే పచ్చని పైరుకు ప్రాణం, రైతు కుటుంబాలకు ఆధారం. బాల్యంలో అబ్బురపడుతూ ఆకాశవాణిలో వాతావరణ సూచనలు విన్న రోజుల నుంచి రాష్ట్ర ప్రజానీకానికి తుఫాను హెచ్చరికలు చేసేవరకూ నాగరత్న ప్రయాణమంతా ఆమె మాటల్లోనే..
‘ఆకాశవాణి. విశాఖపట్నం కేంద్రం. రానున్న 24 గంటల్లో కోస్తా తీరంలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడొచ్చని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాలరులు సముద్రంలోకి పోవద్దని ప్రభుత్వం హెచ్చరించింది’ అంటూ రేడియోలో వచ్చే వార్తల్ని మా ఇంట్లో చెవులు రిక్కించి వినేవారు. నాన్నగారు కోరమాండల్ ఫెర్టిలైజర్స్‌లో జనరల్ మేనేజర్. సొంతూరు గొల్లవాని తిప్ప (భీమవరం దగ్గర)లో పరిస్థితి ఎలా ఉందోనన్న దిగులు నిత్యం వెంటాడేది. నాన్నది వ్యవసాయ నేపథ్యమే అయినా, ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకున్నారు. విశాఖలో స్థిరపడ్డారు. దీంతో ప్రాథమిక విద్యాభ్యాసం నుంచి పీహెచ్డీ వరకు నా చదువంతా అక్కడే. చిన్నప్పుడు లెక్కల్లో వందకు వంద తెచ్చుకునేదాన్ని. అందరూ లెక్కలంటే భయపడితే, నాకు అందులోనే ఎక్కువ మార్కులు వచ్చేవి. కానీ, వాతావరణ శాస్త్రంలో పీజీ చేశాను. తర్వాత ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ (బంగాళాఖాతంలో సంభవించే తుఫానులు – సంఖ్యాపరమైన విశ్లేషణ) పట్టా అందుకున్నాను. భారత వాతావరణ విజ్ఞాన శాఖలో ఉద్యోగం సాధించాను. కాకపోతే, ఢిల్లీలో పని చేయాల్సి వచ్చింది. మా ఆయన డాక్టర్. నా కోసం అక్కడే ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఆ తర్వాత ఎనిమిదేళ్లకు హైదరాబాద్ వాతావరణ కేంద్రానికి బదిలీ చేశారు. వ్యవసాయ వాతావరణ విభాగం కేటాయించారు. రైతులకు, వ్యవసాయ అధికారులకు నిత్యం వాతావరణ సూచనలు పంపేదాన్ని.
ఆ నాలుగు రోజులూ
ఈ ఏడాది వానాకాలం ప్రారంభంలో అబ్జర్వేషన్ మోడల్స్ తీస్తుంటే.. ఎందుకో అనుమానం వచ్చింది. వరుసగా నాలుగు రోజులు భారీ వర్షాలు ఉంటాయంటూ రెడ్ అలర్ట్ ఇచ్చాను. ప్రభుత్వం దానిని సీరియస్‌గా తీసుకుంది. సీఎం కేసీఆర్ గారు పిలిచారు. ‘ఏమ్మా.. నాలుగు రోజులూ భారీ వర్షాలు కురుస్తాయా?’ అని అడిగారు. ఒక్కరోజు కొద్దిగా అంచనా తప్పొచ్చేమో కానీ, మిగతా రోజుల్లో మాత్రం అంచనా తప్పదని చెప్పాను. అన్నట్టే భారీ వర్షాలొచ్చాయి. అయిదో రోజు కూడా కుండపోతే. రెండేండ్ల క్రితం.. హైదరా
బాద్‌లో వరదలొచ్చాయి. నాలుగు రోజులు విపరీతమైన వానలు. అప్పుడు కూడా మేం ముందుగానే ప్రకటించాం. జనం మాత్రం.. చెప్పినట్టుగా వానలు పడితే పొగుడుతారు. పడకపోతే తిడతారు. దేన్నయినా సమానంగా స్వీకరిస్తాం మేం.
ఎంత మబ్బుకు అంత వాన
ఈ పదిహేనేండ్లలో ఎంతో ప్రగతి సాధించాం. వచ్చే నెలలో వర్షాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడే చెప్పగలుగుతున్నాం. వచ్చే రెండు వారాల్లో వర్షం దక్షిణ తెలంగాణలో పడుతుందో, ఉత్తర తెలంగాణలో పడుతుందో కూడా నిర్ధారించగలం. వారం ముందే ఎక్కడిదాకా వర్షం పడుతుందో అంచనా వేస్తాం. రెండు రోజులకు ముందు కచ్చితంగా ఈ ప్రదేశంలో పడుతుందనే అంచనాకు వస్తాం. ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్టు ఎంత మబ్బుకు అంత వాన. నిండు కుండల్లాంటి మబ్బుల్లో నీళ్లెన్ని ఉన్నాయో రాడార్లతో లెక్కగట్టేంత సాంకేతికత సాధించాం. వర్షానికి మూడు గంటల ముందే ఎన్ని సెంటీ మీటర్లు కురుస్తుందో కూడా చెబుతాం. ఒక సెంటీ మీటరు ఎక్కువ తక్కువ కావచ్చు కానీ, మా లెక్క తప్పదు. మా అంచనాలు 80 శాతం నిజమయ్యాయి. కొన్నిసార్లు వర్ష సూచనలు వాస్తవాన్ని ప్రతిబింబించక పోవచ్చు. అది కూడా మా వైఫల్యమేం కాదు. వాతావరణంలో శరవేగంగా మార్పులు జరుగుతాయి. మా కేంద్రం నెల రోజులకు, రెండు వారాలకు, అయిదు రోజులకు, ఒక రోజుకు నివేదిక తయారు చేస్తుంది. పది రోజుల్లో వర్షం వస్తుందనే అంచనా, అయిదు రోజుల తర్వాత పూర్తిగా మారిపోవచ్చు. మూడు రోజుల ముందు ఇంకేదో పరిణామం చోటుచేసుకోవచ్చు. మేఘాల గమనం, అల్ప పీడన కేంద్ర చలనం, గాలి వీచే దిక్కులో మార్పులు, ఉష్ణోగ్రతలు క్షణక్షణానికి మారుతూ ఉంటాయి. ఆ ప్రకారంగానే వాతావరణ హెచ్చరికలను అప్డేట్ చేస్తాం.
వివక్ష పోలేదు
లింగ వివక్ష ఎక్కడైనా ఉంటుంది. ఆ అవరోధాల్ని దాటుకుని మనం ధైర్యంగా ముందుకెళ్లాలి. హైదరాబాద్ వాతావరణ కేంద్రానికి వచ్చిన కొత్తలో.. క్లాస్ వన్ సైంటిఫిక్ ఆఫీసర్స్‌లో నేనొక్కదాన్నే మహిళను. సీఎం పిలిస్తే మాట్లాడడానికి నన్ను వెళ్లమన్నారు. నాకు ఈ పని పూర్తిగా కొత్త. కొలీగ్స్ సహకరించలేదు. ఆఫీస్‌కు ఆలస్యంగా వచ్చాను. వెంటనే నన్ను శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు బదిలీ చేశారు. అక్కడ మూడేళ్లు పనిచేశాను. అక్కడ నా అంచనాలన్నీ సక్సెస్ అయ్యాయి. తర్వాత మళ్లీ ఇక్కడికి వచ్చాను. కొన్నాళ్లకు డైరెక్టర్ అయ్యాను. డైరెక్టర్ హోదాకు చేరుకున్నాక కూడా చిన్నచూపు ఉంది. ఎన్ని కష్టాలు ఎదురైనా మహిళలు ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు.
పల్లెకు ప్రకృతి సందేశం
రైతులు 040 2790 8506, 040 27906172 నంబర్లకు ఫోన్ చేసి వర్ష సమాచారం తెలుసుకోవచ్చు. కృషి విజ్ఞాన కేంద్రాల వద్ద అగ్రిమెట్రాలజీ పట్ల అవగాహన ఉన్నవాళ్లనే నియమించారు. ప్రతి మండలానికీ రోజూ వర్ష సూచనలు ఇస్తున్నాం. వ్యవసాయ శాఖ ద్వారా అవన్నీ రైతులకు చేరుతున్నాయి. తెలంగాణలో లక్ష మందికిపైగా రైతులు వాతావరణ సందేశాల కోసం ఫోన్ నంబర్లు రిజిస్టర్ చేసుకున్నారు.
– నాగవర్ధన్ రాయల