ఉరుకుల పరుగుల జీవనశైలి, నిరంతర పని ఒత్తిడి వల్ల కోపం దినచర్యలో భాగమైపోయింది. ప్రతి చిన్న విషయానికి విసుగు చెందడం, పకనున్న వారిపై తీవ్రంగా అసహనం వ్యక్తం చేయడం చాలామందికి పరిపాటిగా మారింది. మానసిక క్షోభ, ప్రతికూల ఆలోచనలు కొన్నిసార్లు మన దైనందిన జీవితాన్ని మాత్రమే కాకుండా, తోటివారితో ఉండే సంబంధాన్ని సైతం దెబ్బతీస్తాయి. అయితే, ఇలాంటి ఆవేశాలకు గురైనప్పుడు మనసును అదుపులో ఉంచుకుని ప్రశాంతంగా మారడానికి సులువైన మార్గాలున్నాయి.
మనసును గమనించండి: మనసులో ప్రతికూల ఆలోచనలు సుడిగుండంలా తిరుగుతున్నప్పుడు, తక్షణమే ఎదుటివారిపై అరవకుండా.. అసలు మనసు ఏమనుకుంటున్నదో గమనించాలి. మీ మనోస్థితికి కారణం ఏమిటో ఒక్క రెండు నిమిషాలు నిలకడగా ఉండి ఆలోచించండి. అప్పుడు కారణం తెలిసివస్తుంది. దీంతో ఎదుటివారిపై అనవసరంగా అరిచే పరిస్థితిని అధిగమించే అవకాశం ఉంటుంది. ఫలితంగా మీ బంధాలు పదిలం.
హాయిగా నిద్రపోండి: కంటినిండా నిద్రపోతే మనసు కుదురుగా ఉంటుంది. నిద్రలేమి మనుషుల్లో నైరాశ్యాన్ని, కోపాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్తుంది. రాత్రి పొద్దుపోయే వరకు మొబైల్ పట్టుకొని వింత వింత వీడియోలు చూస్తూ.. ‘డూమ్ స్రోలింగ్’ చేయడం మానసిక ఆరోగ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తుంది. సోషల్ మీడియాలో ఉండే వీడియోలు రేపైనా ఉంటాయి, కానీ మీ ఆరోగ్యానికి ఈ రాత్రి నిద్ర చాలా ముఖ్యమని గమనించి సమయానికి నిద్రించండి.
చల్లని నీటితో: విపరీతమైన కోపానికి గురైనప్పుడు.. తక్షణ ఉపశమనానికి ముఖంపై చల్లని నీళ్లు చల్లుకోవడం ఉత్తమం. చల్లటి నీరు శరీరంలోని నరాలను ఉత్తేజపరిచి, గుండె వేగాన్ని తగ్గించి, మెదడును ప్రశాంతపరుస్తుంది. ఈ చిన్న చిటా శరీర ఉష్ణోగ్రతతో పాటు మానసిక ఆవేశాన్ని కూడా
తగ్గిస్తుంది.
సమయానికి భోజనం: కడుపులో ఆకలిగా ఉన్నప్పుడు కోపం రావడం అత్యంత సహజమైన శారీరక ప్రక్రియ. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం సరిగా చేయకుండా జంక్ ఫుడ్ లేదా స్వీట్లపై ఆధారపడితే శరీరంలో చకెర స్థాయులు పెరిగి తీవ్రమైన చిరాకు వస్తుంది. ఆ అసహనం తోటివారిపై వ్యక్తమవుతుంటుంది. కాబట్టి, భోజనం
విషయంలో సమయపాలన పాటించడం తప్పనిసరి అని గుర్తుపెట్టుకోండి.