మన శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయం. రక్తంలో రసాయనాల స్థాయులను నియంత్రించడం, కొవ్వులను విచ్ఛిన్నం చేయడం,రక్తాన్ని శుద్ధిచేయడం, రక్తంలోని పోషకాలను శరీరానికి ఉపయోగపడేలా మార్చడం కాలేయం ప్రధాన విధులు. కలుషిత ఆహారం, కలుషిత నీరు, రక్త మార్పిడి తదితర కారణాల వల్ల కాలేయానికి వైరస్ ఇన్ఫెక్షన్ పొంచి ఉంటుంది. దీనివల్ల హెపటైటిస్ సంక్రమిస్తుంది. సమస్య ముదిరితే కాలేయం కష్టాల పాలవుతుంది. సకాలంలో చికిత్సకు వెళ్లకపోతే ప్రాణాంతకంగానూ మారుతుంది.
పోషకాలను క్రమబద్ధం చేయడం. రక్తాన్ని వడపోయడం. ఇన్ఫెక్షన్లతో పోరాడటం. .. ఇలా కాలేయం శరీరానికి సర్వసైన్యాధికారిలా పనిచేస్తుంది. కాలేయానికి సోకే ఇన్ఫెక్షన్లలో ముఖ్యమైంది హెపటైటిస్ వైరస్. ఈ ఇన్ఫెక్షన్ వల్ల కాలేయంలో మంటపుడుతుంది. పుండ్లు ఏర్పడతాయి. నిత్య విధులు క్రమం తప్పుతాయి. మద్యపాన వ్యసనం, శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాల కుప్పలు, కొన్నిరకాల ఔషధాల దుష్ప్రభావం, అరుదైన సందర్భాలలో జన్యుపరమైన సమస్యలు కూడా హెపటైటిస్‌కు కారణం అవుతాయి. చాలావరకు ఈ వ్యాధి వైరస్ కారణంగానే సంక్రమిస్తుంది. భారతదేశంలో సాధారణంగా కనిపించే వైరల్ హెపటైటిస్‌లు- ఎ, బి, సి, ఇ.
వ్యాప్తి ఇలా..
వైరల్ హెపటైటిస్-ఎ, ఇ రకాలు కలుషిత ఆహారం, కలుషిత నీరు ద్వారా సంక్రమిస్తాయి. అదే బి, సి రకాలైతే రక్తం, శరీర స్రావాల నుంచి వ్యాపిస్తాయి. ఆహారం, నీరు వాహకాలుగా దాడిచేసే వైరస్లు కాలేయం మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. రక్తం నుంచి సంక్రమించే బి, సి వైరస్లు మరింత దూకుడుగా.. శరీరంలో తిష్టవేసి కాలేయానికి పుండ్లను (స్కారింగ్) సృష్టిస్తాయి. కాలేయ క్యాన్సర్, కాలేయ క్షయానికి (లివర్ సిరోసిస్) కారణం అవుతాయి. హానికర వైరస్‌లకు చిరునామా అయిన మానవ విసర్జితాల వల్ల ఆహారం, నీరు కలుషితం అవుతాయి. అపరిశుభ్రమైన పరిసరాల నుంచే వైరస్ల వ్యాప్తి జరుగుతుంది. బహిరంగంగా ఉమ్మడం, మల విసర్జన తర్వాత చేతులు సరిగ్గా కడుక్కోక పోవడం వల్ల హెపటైటిస్-ఎ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగే కుటుంబసభ్యులకూ వైరస్ సోకే ముప్పు ఉంది.
చేతుల అపరిశుభ్రత వల్ల రెస్టారెంట్లలో పనిచేసేవారి నుంచి వినియోగదారులకు, డే కేర్ సెంటర్ల సిబ్బంది నుంచి పిల్లలకు హెపటైటిస్ వైరస్ వ్యాప్తి చెందుతుంది. వైరస్ సంక్రమించిన వ్యక్తి నుంచి రక్త మార్పిడి జరిగినప్పుడు శరీర ఫ్లూయిడ్ల (ద్రవాలు)ను వాహికగా చేసుకుని హెపటైటిస్-బి, సి వైరస్లు వ్యాప్తి చెందుతాయి. లైంగిక సంబంధాల వల్ల, మాదక ద్రవ్యాల పీడితులు మత్తు ఎక్కించుకోవడానికి ఒకే సిరంజిని వాడటం వల్ల, రక్త మార్పిడి వల్ల కొన్నిరకాల హెపటైటిస్ వ్యాపిస్తుంది. మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు రక్త శుద్ధి కోసం చేపట్టే హీమోడయాలసిస్ కూడా దీనికో మార్గం కావచ్చు. తల్లుల నుంచి అప్పుడే జన్మించిన శిశువులకు హెపటైటిస్-బి వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువ. పచ్చబొట్లు వేయించుకోవడం వల్ల, బ్లేడ్లు, టూత్ బ్రష్‌ల వంటి వ్యక్తిగత సామగ్రిని ఇతరులతో పంచుకోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది.
హెపటైటిస్ లక్షణాలు
హెపటైటిస్‌కు గురికావడానికి, జబ్బు పడటానికి మధ్య కాలాన్ని ‘ఇన్క్యుబేషన్ పీరియడ్’ అంటారు. ఈ వ్యవధి వైరస్ నుంచి వైరస్‌కు మారుతూ ఉంటుంది. హెపటైటిస్-ఎ, ఇ వైరస్ల ఇన్క్యుబేషన్ వ్యవధి 2 నుంచి 6 వారాలు అయితే.. హెపటైటిస్-బి, సి వైరస్ల కాలపరిమితి 2 నుంచి 6 నెలలు. ఫ్లూ లాంటి లక్షణాలు, మగతగా ఉండటం, గాఢమైన మూత్రం, జ్వరం, వాంతులు, పసరికలు మొదలైనవి హెపటైటిస్ తీవ్ర లక్షణాలు. కొన్నిసార్లు ఈ వైరస్లు సోకినప్పటికీ నామమాత్రపు ఇన్ఫెక్షన్తో కొద్దిపాటి లక్షణాలు కనిపించవచ్చు. దీంతో ఆ వ్యాధి మనం గుర్తించేలోపే దానంతట అదే తగ్గిపోతుంది. అరుదుగా మాత్రమే, వైరల్ హెపటైటిస్ కాలేయం పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తుంది. దీనివల్ల మెదడు మీదా ప్రభావం పడుతుంది. ఒక్కోసారి మెదడులో రక్తస్రావం జరగవచ్చు. దీన్నే ‘ఫుల్మినెంట్ లివర్ ఫెయిల్యూర్’ అని పిలుస్తారు. అలాంటి పరిస్థితుల్లో తక్షణమే కాలేయ మార్పిడి చేయకపోతే రోగి మరణించే ప్రమాదం ఉంది.
ఇలా అడ్డుకోవచ్చు..
శుభ్రమైన నీళ్లే తాగాలి. క్యాండిల్ వాటర్ ఫిల్టర్లతోపాటు అతినీలలోహిత (యూవీ), రివర్స్ ఆస్మాసిస్
(ఆర్వో).. తదితర నీటి శుద్ధి పరికరాలను ఇండ్లలో అమర్చుకోవాలి. ప్రయాణాల్లో నాసిరకం నీళ్ల సీసాలు వాడకూడదు. పండ్ల రసాలు, మిల్క్ షేక్‌లు, చాట్, పానీపూరీ లాంటి రోడ్డు పక్క ఆహారానికి దూరంగా ఉండాలి.
క్షౌర
శాలలు, బ్యూటీ పార్లర్లలో రేజర్ల లాంటి వాటిని ఒకరికి మించి వాడటం వల్ల కూడా హెపటైటిస్ ఇన్ఫెక్షన్ ముప్పు పొంచి ఉంటుంది. హెపటైటిస్-బి వైరస్ సాధారణంగా లైంగిక సంబంధాల ద్వారా సంక్రమిస్తుంది. కాబట్టి, సురక్షిత లైంగిక సంబంధాలను కొనసాగించాలి. హెపటైటిస్-సి విషయంలో ఆ అవకాశం తక్కువే. మహానగరాల్లో సూదుల ద్వారా మాదక ద్రవ్యాలను తీసుకునే అలవాటు మహమ్మారిలా వ్యాపిస్తున్నది. హెపటైటిస్ వైరస్ వేగంగా సోకడానికి ఇదో కారణం. పిల్లలు మాదక ద్రవ్యాల ఊబిలో పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
నివారణ చర్యలు
హెపటైటిస్-ఎ, బి వైరస్‌లను టీకాల సాయంతో అడ్డుకోవచ్చు. హెపటైటిస్-బి కారణంగా వచ్చే కాలేయ క్యాన్సర్‌ను కూడా టీకా నిరోధించగలదు. నిశ్శబ్దంగా, దీర్ఘకాలంపాటు శరీరంలో పాతుకుపోయే హెపటైటిస్-బి, సి వైరస్‌లను తొలిదశలోనే గుర్తించాలి. కాలేయ క్యాన్సర్, కాలేయ క్షయకు (లివర్ సిరోసిస్) కారణమయ్యే ఈ హెపటైటిస్-బి, సి వైరస్‌లకు సమర్థమైన చికిత్స అందుబాటులో ఉంది. కాలేయ వైఫల్యం విషయంలో.. రోగులు మరణించే ఆస్కారం 60 నుంచి 80 శాతం వరకూ ఉంటుంది. దీర్ఘకాలిక హెపటైటిస్-సి వైరస్‌తో పోరాటానికి సమర్థమైన యాంటీ వైరల్ ఔషధాలు మనకు అందుబాటులో ఉన్నాయి.
– డాక్టర్ ధర్మేశ్ కపూర్
సీనియర్ హెపటాలజిస్ట్,
లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్
యశోదా హాస్పిటల్స్
సికింద్రాబాద్.