కొందరికి రెగ్యులర్‌గా మేకప్ వేసుకోవడం అలవాటు. ఉద్యోగంలో భాగంగానో, బాగా కనిపించాలనో.. నిత్యం ముఖానికి మెరుగులు దిద్దుకుంటారు. అయితే, ఇలా ప్రతిరోజూ మేకప్‌ను ఆశ్రయించడం చర్మానికి ఏమాత్రం మంచిదికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారంలో కనీసం ఒక్కసారైనా ప్యాకప్ చెప్పాలని అంటున్నారు. ఒక్కరోజు మేకప్ వేసుకోకుంటే చర్మానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరిస్తున్నారు.
మేకప్ లేనిరోజున చర్మం తనను తాను పునరుద్ధరించుకుంటుంది. తన స్థితిస్థాపకతను మెరుగుపరుచుకుంటుంది. మరింత కాంతిమంతంగా, యవ్వనంగా కనిపిస్తుంది. నిజానికి ఫౌండేషన్, క్లెన్సర్ లాంటి మేకప్ ఉత్పత్తులు.. చర్మ రంధ్రాలను మూసివేస్తాయి. దాంతో, చర్మానికి గాలి ఆడటం తగ్గి.. మొటిమలు, బ్లాక్‌హెడ్స్ పెరుగుతాయి. అదే మేకప్ వేయకుంటే.. చర్మ రంధ్రాల్లో మురికి, జిడ్డు పేరుకుపోకుండా ఉంటుంది. అంతేకాకుండా, కొన్నిరకాల మేకప్ ఉత్పత్తుల్లో ప్రిజర్వేటివ్స్, రసాయనాలు ఉంటాయి. వీటివల్ల చర్మంపై దద్దుర్లు, చిరాకు కలిగే అవకాశం ఉంటుంది.
మేకప్ పక్కన పెట్టేస్తే.. చర్మం ప్రశాంతంగా మారుతుంది. ముఖం తాజాదనాన్ని సంతరించుకుంటుంది. రోజూ మేకప్ వేసుకోవడం వల్ల చర్మం ముడతలు పడుతుంది. కాజల్, మస్కారా, ఐ లైనర్లు.. కళ్ల సమస్యల్ని మోసుకొస్తాయి. కళ్లు ఎర్రబడటం, మంట పుట్టడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. మేకప్‌ను కాదంటే.. కళ్లకు ఉపశమనం లభించినట్టే! ఇక మేకప్ మానేసిన రోజు సన్‌స్క్రీన్‌లోషన్ తప్పకుండా రాసుకోవాలి. చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్ అప్లయి చేసుకోవాలి.