తల స్నానం అయ్యాక తడి తల మీద మనం చేసే కొన్ని పనులు వెంట్రుకల ఎదుగుదలను దెబ్బతీస్తాయి. అందుకే అవేంటో తెలుసుకుంటే కేశ సంరక్షణ చేసినట్టే. అందులో ముఖ్యంగా ఓ అయిదు విషయాలను ఇక్కడ చూద్దాం!
తలంటు పోసుకునే ముందే జుట్టు చిక్కులు తీసుకోవాలి. తడిగా మారినప్పుడు వెంట్రుకకు సాగే గుణం పెరుగుతుంది. అలాంటప్పుడు వెంట్రుకల్ని చిక్కులు తీసి సరిచేస్తే కుదుళ్లు, వెంట్రుకలు ఎక్కువ దెబ్బతినే ప్రమాదముంది. అదే ముందే చిక్కులు తీసుకుంటే మళ్లీ ఎక్కువగా పడవు. స్నానం సమయంలో జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.
తడి తల మీద దువ్వెన పెట్టి గబగబా దువ్వకూడదు. ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య అధికం అవుతుంది. తుడిచిన తర్వాత చేత్తో పాయలుగా చేసి, పైపైన చిక్కులు తీయాలి. తర్వాత దువ్వెన పెట్టి కింది వైపు నుంచి చిక్కులు తీస్తూ
పై భాగానికి వెళ్లాలి.
జుట్టు తడిగా ఉన్నప్పుడు బిగుతుగా రబ్బర్ బ్యాండ్ వేయడం కూడా మంచి పద్ధతి కాదు. దీని వల్ల వెంట్రుకలు లాగినట్టు అవుతాయి. ఆరిపోయాక వెంట్రుకలు చుట్టుకుపోకుండా తీయడమూ కష్టం అవుతుంది.
తలస్నానం పూర్తవగానే బ్లో డ్రైయర్ పెట్టకూడదు. ముందు తల నుంచి నీళ్లు పూర్తిగా కారిపోనివ్వాలి. తువాలుతో మెత్తగా తుడిచిన తర్వాత మీడియం స్పీడులో డ్రైయర్ పెట్టుకోవాలి. తర్వాత నెమ్మదిగా దాని వేగం పెంచి కావాలనుకున్నట్టు జుట్టును ైస్టెల్ చేసుకోవచ్చు.
ఒకవేళ రాత్రిపూట తలంటు పోసుకుంటే తడి తలతో పడుకోవడం మంచిది కాదు. మనం పడుకుని అటూ ఇటూ పొర్లుతున్నప్పుడు వెంట్రుకలు ఘర్షణకు గురవుతాయి. తడిగా ఉన్నప్పుడు ఇలా చేస్తే అవి దెబ్బతింటాయి. అందుకే కాస్తన్నా ఆరబెట్టుకుని, పల్చటి టవల్ చుట్టుకుని పడుకోవాలి.