మనిషికి మంచి ప్రవర్తనే మహా సంపద. మానవ జన్మ చరితార్థమయ్యేది ఇక్కడే. అందుకు ప్రతి మతంలోనూ విధిగా పాటించదగ్గ కొన్ని నైతిక సూత్రాలున్నాయి. కతోలిక, కతోలికేతర క్రైస్తవులు తమ ఆధ్యాత్మిక జీవన విధానంలో దుర్గుణాలు, సుగుణాల పట్ల ఓ పరిపూర్ణమైన అవగాహనతో, మెలకువతో ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు.
ఓ మనిషి పాపకార్యాలు చేయడానికి అనేక కారణాలు కనిపించొచ్చు. ఇంటి వాతావరణం, సంఘ ప్రభావం మొదలైనవి ఎన్ని ఉన్నా మనిషిలోని ప్రతి మనసూ మరికొన్ని కారణాలకు లొంగిపోతుంది. అప్పుడతనికి సహకరిస్తూ చీకట్లోకి నెట్టేసే కొన్ని మూల పాపాలు కారణాలుగా విజృంభిస్తాయి. అందులో ముఖ్యమైనవి ఏడు మూల పాప కారణాలు ఉన్నాయి. అవే, అహంకారం, కోపం, మోహం, లోభం, భోజన ప్రియత్వం, మత్సరం, సోమరితనం.
ఈ ఏడూ ఒకదానికొకటి కారకంగా వ్యవహరిస్తాయి. మనిషిని నైతక పతనావస్థకు నెట్టేస్తాయి. ఇందుకు భిన్నంగా మరో ఏడు కారణాలు.. ఓ మనిషిని తప్పు చేయక నీతిమంతంగా, కనిపించడానికి, సత్కార్యాలు చేయడానికి పుణ్య మూలకారణాలు కనిపిస్తాయి. ఆ ఏడు పుణ్య మూల కారణాలు.. దీనత, ఓర్పు, విరక్తత, ఉదారత, మిత భోజనం, పరస్నేహం, చురుకుదనం. పైన చెప్పిన దుర్గుణాల గాలి ఇసుమంతైనా చేరనీయక రక్షిస్తూ ఉండే సుగుణాలుగా వీటిని పోషించుకోవొచ్చు. పై దుర్గుణాలు ఏ
రకమైన కష్టమూ లేకుండానే ఓ మనిషికి సంక్రమిస్తాయి. సుగుణాలు మాత్రం అలవోకగా అంటుకోవు. కాస్త ఓపిగ్గా కష్టంతోనైనా అలవరచుకోవలసిన అవసరం ఉంది. సుగుణాల్లో ఏ ఒక్కటైనా పొందగలిగితే.. మిగిలిన ఆరింటినీ కైవసం చేసుకోవచ్చు.
-ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024