బెర్లిన్
నెట్‌ఫ్లిక్స్: డిసెంబర్ 29
నటీనటులు: పెడ్రో అలన్సో, ట్రిస్టాన్ ఉల్లావ్, మైఖేల్ జెన్నర్, బెగోనా వర్గాస్ తదితరులు
దర్శకత్వం: అలెక్స్ పినా, ఎస్తర్ లొబాటో
మనీ హెయిస్ట్-5 స్పానిష్ వెబ్‌సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకులను ఎంతలా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్పానిష్‌తోపాటు ఇంగ్లిష్, హిందీ, తెలుగు తదితర భాషల్లోనూ రికార్డు స్ట్రీమింగ్ సొంతం చేసుకుంది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఆ సిరీస్‌లో అందరినీ అలరించిన క్యారెక్టర్ బెర్లిన్. ఆ పాత్రలో జీవించిన పెడ్రో అలన్సోకు లక్షలమంది అభిమానులయ్యారు. మనీ హెయిస్ట్కు ప్రీక్వెల్‌గా రూపొందిన వెబ్‌సిరీస్ ‘బెర్లిన్’ తాజాగా స్ట్రీమింగ్ అవుతున్నది. ఎవరీ బెర్లిన్, అతని గతమేంటి? అతణ్ని ముగ్గురు భార్యలు ఎందుకు వదిలిపెట్టారు? కొడుకుతో అతని అనుబంధం అంశాలతో ఎనిమిది ఎపిసోడ్లతో ఈ వెబ్‌సిరీస్ నిర్మించారు.
కథలోకి వెళ్తే బెర్లిన్ తన టీమ్‌తో కలిసి విలువైన నగల దొంగతనానికి ప్రణాళిక రచిస్తాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగలను కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇందుకోసం అతనేం చేశాడు, వాటిని దొంగిలించడంలో సఫలమయ్యాడా లేదా అన్నది మిగిలిన కథ. మొదటి మూడు ఎపిసోడ్లలో దొంగతనానికి వేసే స్కెచ్‌లు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత ఎపిసోడ్లలో ఆసక్తికరమైన మలుపులు అలరిస్తాయి. బోల్డ్ సన్నివేశాలు ఉండటం వల్ల అందరితో కలిసి చూడలేం.