పుట్టింటి నుంచి మెట్టినింటి గడప తొక్కిన ఆమెకు చేనేత పరిచయమైంది. ఒకవైపు పని నేర్చుకుంటూనే.. మరోవైపు మధ్యవర్తుల దోపిడీనీ గుర్తించింది. తమ రెక్కల కష్టాన్ని దళారుల పాలు కానివ్వొద్దని భావించింది. నేరుగా కస్టమర్లకే చీరలను అమ్మడం మొదలు పెట్టింది. వీహబ్ సహకారంతో మార్కెట్ మెలకువలనూ నేర్చుకున్నది. అడపా దడపా ఆర్డర్ల నుంచి ప్రారంభమైన ఆమె ప్రయాణం.. నేడు బల్క్ ఆర్డర్లకు చేరింది. ప్రపంచ సుందరీమణులకు సైతం పోచంపల్లి చీరల గొప్పతనాన్ని తెలియజెప్పిన గుండేటి నవనీత ప్రస్థానమిది. నమ్ముకున్న చేనేత వృత్తిలో ఆంత్రప్రెన్యూర్‌గా రాణిస్తున్న ఆ మహిళ ‘జిందగీ’తో ముచ్చటించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
మాది జనగామ దగ్గర ఓబుల కేశవపూర్. నాన్న వస్ర్తాల వ్యాపారం చేస్తుండేవారు. మేము ముగ్గురం అక్కచెల్లెళ్లం. ఇంట్లో నేనే పెద్దదాన్ని కావడంతో ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లికి చెందిన మా బంధువుల అబ్బాయితో పెళ్లిచేశారు. అత్తగారింట్లో మా మామ, మా ఆయన ఇద్దరూ కలిసి మగ్గం పనులు చేస్తుండేవారు. అప్పటివరకూ నాకు తెలియని చేనేత పనులన్నీ అత్తగారింట్లోనే నేర్చుకున్నా. పెళ్లి తరువాత డిగ్రీ పూర్తిచేయడంతోపాటు మగ్గం పనులపైనా పట్టుసాధించా. మా మామయ్య చేనేత సొసైటీలో సభ్యుడు కావడంతో ఆయన నేసిన చీరలను అక్కడే అమ్మేవారు. మా ఆయనకు సభ్యత్వం లేకపోవడంతో.. ఆయన నేసిన చీరలను సొసైటీవాళ్లు తిరస్కరించేవాళ్లు. చేసేదేమీ లేక బయటి షాపుల్లో తక్కువ ధరకే అమ్ముకునేవాళ్లం. బయట అమ్ముకుంటే కూలి కూడా పడకపోయేది. నమ్ముకున్న వృత్తిలో ఎలాంటి లాభం లేకపోవడంతో మా ఆయన చాలా బాధపడేవారు.
మా ఆయన బాధను చూడలేక, బయటి దుకాణాల్లో తక్కువ ధరకే మా కష్టాన్ని ధారపోయడం ఇష్టంలేక.. మా చీరల్ని మేమే అమ్ముకోవాలని నిర్ణయించుకున్నా. నేను చదువుకున్న కాలేజీలోని లెక్చరర్లకు ఒక్కొక్క చీరను అమ్మడం మొదలుపెట్టా. అలా వాళ్లుకూడా మా కష్టాన్ని గుర్తించి తమకు తెలిసినవాళ్లతో కొనిపించేవాళ్లు. నెమ్మదిగా కస్టమర్లు పెరగడంతో వాళ్లందరితో ఒక వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి, కొత్తగా నేసిన చీరలను అందులో పోస్ట్ చేసేదాన్ని. అలా 200 మందికిపైగా రెగ్యులర్ కస్టమర్లను సంపాదించుకున్నా. అప్పుడే మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ‘వీవర్స్ అండ్ కస్టమర్స్’ మాత్రమే ఉండాలనే ఆలోచనతో ‘వీవర్స్ హబ్ హ్యాండ్లూమ్స్’ను ప్రారంభించా. మా ఇంటినే కేంద్రంగా చేసుకొని, మేము నేసే వస్ర్తాలను అమ్మడం మొదలుపెట్టా. అడిగినవారికి ఆన్లైన్ డెలవరీలు కూడా చేశా. ఒకసారి మా లెక్చరర్ వీహబ్ గురించి చెప్పారు. చెప్పడమే కాకుండా ఆవిడే నేరుగా నన్ను అక్కడికి తీసుకెళ్లారు. ఆన్లైన్ మార్కెటింగ్‌లో మన వస్తువులను అమ్మే విధానం, కస్టమర్‌తో మాట్లాడే తీరు.. ఇలా మహిళలను ఆంత్రప్రెన్యూర్లుగా తీర్చేదిద్దే లక్ష్యంతో వారు శిక్షణనిస్తున్నారు. నా చీరలను అమ్ముకునేందుకు ఆరు నెలలపాటు శిక్షణ తీసుకున్నా.

2023లో వీహబ్‌లో చేరకముందు అడపాదడపా ఆర్డర్లు వస్తుండేవి. ఎప్పుడైతే అందులో చేరి శిక్షణ తీసుకున్నానో.. బల్క్ ఆర్డర్లు రావడం మొదలైంది. ఒకప్పుడు నాలుగు మగ్గాలపై నేత పనిచేస్తుండే మేము.. ప్రస్తుతం ఆర్డర్లు పెరగడంతో 12 మగ్గాలను ఉపయోగిస్తున్నాం. ఈ క్రమంలో ఆరు కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నాం. ఒకప్పుడు ఖర్చులన్నీ పోనూ రూ.15వేలు మాత్రమే ఆదాయం వచ్చేది. ప్రస్తుతం రూ.60వేల వరకు వస్తుండటం విశేషం. హైదరాబాద్‌లో ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించినప్పుడు వాళ్లు పోచంపల్లిని సందర్శించారు. ఆ సమయంలో కలెక్టర్ హనుమంతరావు హిందీలో, ఇంగ్లిష్ భాషల్లో చేనేత గురించి వారికి వివరించేవాళ్లు కావాలని అడిగితే.. నేను ముందుకొచ్చి ఆ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ప్రారంభంలో భయపడినా మొత్తానికి బాగా చెప్పాను. ఆ తరువాత ఇతర దేశాల వాళ్లు ఎవరొచ్చినా నేనే చెబుతున్నాను. మన కళలను విదేశీయులకు చెప్పడంలో తెలియని అనుభూతి ఉంటుంది.
మా దగ్గరికొచ్చే కస్టమర్లంతా పట్టు చీరలతోపాటు కుర్తాలు, ఫ్యాబ్రిక్ అడుగుతుంటారు. వారికోసం బెంగళూరు నుంచి తెప్పించి మరీ అమ్ముతుంటా. అన్నిరకాల వస్ర్తాలు అందించాలనే ఆలోచనతో ఈ ప్రయత్నం మొదలుపెట్టా. ఇందులో పెద్దగా లాభమేమీ రాకపోయినా.. కస్టమర్ల ఆనందం కోసం తెప్పిస్తుంటా. చిన్నతనంలో నాన్న దుస్తులు అమ్ముతుంటే నాకు కూడా అదే బిజినెస్ చేయాలని ఆలోచన ఉండేది. అనుకున్నట్టుగానే ఆ కల నేరవేరింది. నాకు వ్యాపారంతోపాటు టీచింగ్ అన్నా ఇష్టమే. ప్రస్తుతం పోచంపల్లిలోనే ఓ ప్రైవేట్ స్కూళ్లో హిందీ టీచర్‌గా పాఠాలు చెబుతున్నా. ఎప్పటికైనా హైదరాబాద్‌లో ‘వీవర్స్ హబ్ హ్యాండ్లూమ్స్’ షాపింగ్ మాల్ ఏర్పాటు చేయాలన్నదే నా లక్ష్యం. కరోనాకు ముందు మణికొండలో వాకర్స్ కోసం ప్రతి శని, ఆదివారాల్లో స్టాల్ పెట్టుకునేవాళ్లం. అందుకోసం ఉదయాన్నే నాలుగు గంటలకు మా ఆయనతో కలిసి దుస్తుల మూటలు టూవీలర్పైన కట్టుకొని పోచంపల్లి నుంచి ఇద్దరం వెళ్లేవాళ్లం. ఆ ప్రయాణం చాలా నరకంగా అనిపించేది. ఆ ప్రాంతంలో అన్ని పెద్దపెద్ద హోటళ్లు ఉంటాయి. టిఫిన్ చేద్దామని హోటల్‌కెళ్తే.. మా మూటలు చూసి వాటిని అక్కడ పెట్టనిచ్చేవారు కాదు. నిరాశతో మధ్యాహ్నం ఇంటికొచ్చాక తినేవాళ్లం. అలా రెండేళ్లు కష్టపడ్డాం.