Shoulder Duster Earrings | సందర్భానికి తగిన ఆభరణాలు ఉండాల్సిందే. మ్యాచింగ్ జాకెట్ నుంచి డిజైనర్ గాజుల వరకు ఎక్కడా రాజీపడరు. ఆ అభిరుచికి తగినట్టే, ఒకప్పుడు హల్చల్ చేసిన షోల్డర్ డస్టర్ చెవి కమ్మలు మళ్లీ రంగంలోకి దిగాయి. గతంతో పోలిస్తే.. మరింత అందంగా, భుజాలను తడిమేంత పొడుగ్గా రూపొందాయి.
కమ్మల బుట్టాలు, లక్ష్మీదేవి డిజైన్ దుద్దులు మొదలైన నగలను పాత రోజుల నుంచీ చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు బంగారు తీగలు, గుండ్లతో చేసిన పే..ద్ద.. లోలాకులు యువతులను ఆకర్షిస్తున్నాయి. పెండ్లి, వ్రతాల సమయంలోనూ పెట్టుకునేలా భారీ డిజైన్లతో ఈ షోల్డర్ డస్టర్ ఆభరణాలను తయారు చేస్తున్నారు. ర్యాంప్ వాక్‌లో సైతం వీటిని ధరిస్తున్నారు. ఈ ఆభరణాలకు కెంపులు, పచ్చలు, ముత్యాలనూ జత చేస్తున్నారు. ఈ డిజైన్ల తయారీకి నాలుగైదు గ్రాముల నుంచి ఐదారు తులాల దాకా బంగారం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ర్యాంప్ వాక్‌లలో మోడల్స్ ఏరికోరి వజ్రాల షోల్డర్ డస్టర్స్ ధరిస్తున్నారు. క్యారెట్లను బట్ట్టి ధరలు. వజ్రాల ఆభరణాల్లో కెంపులు, పచ్చలు చేరుస్తున్నారు. ఖరీదైన రాళ్లే కాదు.. సముద్రపు గవ్వల నుంచి రకరకాల పూసలు, రాళ్ల వరకూ చాలానే జోడిస్తున్నారు.
షోల్డర్ డస్టర్ కమ్మలు చాలా పొడవుగా ఉంటాయి. దీంతో బరువూ ఎక్కువగానే ఉంటుంది. దీనివల్ల చెవి కమ్మల రంధ్రాలు సాగిపోతాయని పెద్దలు హెచ్చరిస్తుంటారు. ఆ సమస్య లేకుండా మార్కెట్లో తేలికపాటి లోలాకులు వస్తున్నాయి. తళుక్కున మెరిసే ప్లాస్టిక్ గ్లిట్టర్ బాల్స్, రైన్‌స్టోన్ డ్రాప్ జువెలరీ, త్రెడ్ టస్సెల్స్ మొదలైనవి బరువే ఉండవు. చెవికి ఏమాత్రం భారం అనిపించవు. అయినాకూడా, చాలా అందంగా ఉంటాయి. షోల్డర్ డస్టర్ వెండి ఆభరణాలు కూడా దొరుకుతున్నాయి.