ఎముకలు మానవ శరీరంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మనిషికి ఆకారాన్ని ఇచ్చేవి ఎముకలే. మనిషి ఎత్తు, బరువును నిర్ణయిస్తాయి. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మెదడు, మూత్రపిండాలు తదితర ప్రధాన అవయవాలకు వివిధ ఆకారాల్లో ఎముకలే రక్షణ కవచంగా ఉంటాయి. మనిషి పుట్టినప్పుడు శరీరంలో 300 వరకు ఉన్న ఎముకలు వయసు పెరిగే కొద్దీ కొన్ని ఎముకలు ఒకదానిలో ఒకటి కలిసిపోయి 206కు తగ్గిపోతాయి. శరీరంలో అతిపెద్దది తొడ ఎముక, అతిచిన్నది చెవిలో ఉండే స్టేపిస్. ఎముక ఉపరితలం గట్టిగా ఉండి లోపల స్పాంజిలా ఉంటుంది. దీనినే అస్థిమజ్జ (బోన్‌మ్యారో) అంటారు. దీనినుంచే ఎర్ర రక్తకణాల ఉత్పత్తి జరుగుతుంది.
ఎముకల గట్టితనం స్త్రీ, పురుష లింగభేదం, జీవన విధానం, ఆహారపు అలవాట్లు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలలో మెనోపాజ్ తరువాత ఎముకలు పల్చగా, పెళుసుగా మారి తేలికగా ఫ్రాక్చర్ అవుతాయి. దాన్ని ‘ఆస్టియో పోరోసిస్’ అంటారు. లింగభేదం లేకుండా చాలామందిలో బోన్ టీబీ, బోన్ క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయి. బోన్ క్యాన్సర్ రావడానికి కచ్చితమైన కారణాలు తెలియవు. ఇతర భాగాల నుంచి వ్యాపించే సెకండరీ బోన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలే అధికంగా ఉండటంతో శరీరంలో ఏర్పడే క్యాన్సర్లను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవాలి. అలా ఎముకలకు క్యాన్సర్లు వ్యాపించకుండా జాగ్రత్తపడొచ్చు.
బోన్ టీబీ, బోన్ క్యాన్సర్ లక్షణాలు:
సాధారణంగా చాలామందిలో బోన్ క్యాన్సర్ లక్షణాలు, బోన్ టీబీ లక్షణాలు ఒకేలా ఉంటాయి. దీంతో కొన్నిసార్లు ఒకదానికొకటి పొరబడే అవకాశం ఉంటుంది. ఎముకల మీద కణితి ఏర్పడే ప్రదేశం ఆధారంగా లక్షణాలు ఉంటాయి. క్యాన్సర్‌కు సంబంధించిన కణితి లేదా గడ్డ అయినా, నాన్ క్యాన్సర్ కణితి అయినా ఎముక మీద ఏర్పడితే ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఎక్కువ.
బోన్ క్యాన్సర్ ప్రధాన లక్షణాలు:
బోన్ క్యాన్సర్ కణుతులు 5 రకాలు :
బోన్ క్యాన్సర్ ఐదు రకాలు. 1. ఆస్టియో సార్కొమా 2. ఈవింగ్స్ సార్కొమా 3. కాండ్రో సార్కొమా 4. ఫైబ్రో సార్కొమా 5. కార్టోమా. ఈ బోన్ క్యాన్సర్ కణుతులు వయసు ఆధారంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆస్టియో సార్కొమా, ఈవింగ్స్ సార్కొమాలు చిన్న వయసు వారిలో వచ్చే అవకాశం ఉంటుంది. కాండ్రో సార్కొమా మధ్య వయస్సువారిలో ఎక్కువగా కనిపిస్తుంది. చాలావరకు బోన్ క్యాన్సర్లు సెకండరీగానే ఉంటాయి. అంటే శరీరంలో ఇతర భాగాలలో వచ్చిన క్యాన్సర్లు ఎముకలకు వ్యాపించడం(మెటాస్టాసిస్) వంటి కేసులు అధికంగా కనిపిస్తున్నాయి. ఎముకలోనే క్యాన్సర్ ముందుగా రావడం చాలా అరుదైన విషయం.
నిర్ధారణ పద్ధతులు :
ఎముకపై ఏర్పడిన క్యాన్సర్ కణితి ప్రారంభ దశలో చాలా చిన్నగా ఉండటం వల్ల ఎక్స్‌రే ద్వారా నిర్ధారించలేం. అందుకని బోన్ క్యాన్సర్ లక్షణాలు కనిపించినప్పుడు నిర్ధారణ చేయడానికి సీటీ-స్కాన్, ఎంఆర్ఐ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. సాధారణ కణుతులు గుండ్రని ఆకారంలో, నెమ్మదిగా పెరుగుతాయి. అదే క్యాన్సర్ కణుతులు కచ్చితమైన ఆకారం లేకుండా వేగంగా పెరుగుతాయి. ఇవి పరిమాణంలో పెద్దగా ఉంటే ఎక్స్‌రేలో కనిపిస్తాయి. చిన్నగా ఉంటే ఎంఆర్ఐ, సీటీ స్కాన్‌లో చూడవచ్చు.
అందుబాటులో ఉన్న చికిత్సలు :
ఇతర అన్ని క్యాన్సర్లలానే బోన్ క్యాన్సర్‌కు కూడా సర్జరీ, రేడియో, కీమో థెరపీలతో చికిత్స అందిస్తారు. క్యాన్సర్ గడ్డ వచ్చిన ప్రదేశాన్ని తొలగించినప్పుడు, గాయం చిన్నగా ఉంటే సిమెంటింగ్, గ్రాఫ్టింగ్ వంటి పద్ధతులలో సరిచేస్తారు. ఎముక తీయాల్సిన ప్రదేశం పెద్దగా ఉంటే బోన్ బ్యాంక్ నుంచి ఎముకలను తీసుకుని వేయడం లేక మెటల్ ఇంప్లాంట్స్‌ను వాడతారు. క్యాన్సర్ కణితి పెద్దగా ఉంటే శస్త్రచికిత్స కంటే ముందు కీమో, రేడియో థెరపీలతో కణితి పరిమాణాన్ని చిన్నగా చేసి, ఆ తరువాత సర్జరీ చేస్తారు. ఈ క్యాన్సర్ సర్జరీ తర్వాత కొత్తగా పెట్టిన ఇంప్లాంట్స్‌కు అలవాటు పడటానికి ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ వంటివి కూడా అందించాల్సి ఉంటుంది. క్యాన్సర్ వచ్చిన ఎముకలను గట్టిపర్చడానికి ‘బిన్ పాస్సోనేట్స్’ ఇంజక్షన్ ఇస్తారు.
– డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
ఒమేగా హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
98490 22121