మా అక్క కూతురి వయసు 12 నెలలు. ఏడు నెలల వయసు నుంచీ ఇంట్లో చేసిన ఉగ్గు బాగానే తినేది. కానీ గత రెండు నెలలుగా సరిగ్గా తినడం లేదు. దాంతో మా అక్క కంగారు పడుతున్నది. మానసికంగా కుంగిపోతున్నది. పక్కవాళ్ల పిల్లలు బాగా తింటున్నారని, తన పాపే ఎందుకిలా చేస్తున్నదనీ బాధపడుతున్నది. ఆఫీసు పనిలో కూడా నిమగ్నం కాలేకపోతున్నది. ఒత్తిడితో తనూ సరిగ్గా తినట్లేదు. ఈ సమస్యకు పరిష్కారం చెప్పగలరు. l ఓ సోదరి
జ: ఏ ఇద్దరు పిల్లలూ ఒకేలా ఉండరు. వయసు, ఎదుగుదల, ఆకలి మొదలైన అంశాలపై పిల్లల ఆహారపు అలవాట్లు ఆధారపడి ఉంటాయి. పిల్లల్లో ఆకలి అన్నిరోజులూ ఒకేలా ఉండదు. ఆహారం, ఆరోగ్య పరిస్థితి, మూడ్.. ఈ మూడింటిని బట్టి పిల్లలు తింటారు. ఒకేసారి కాకుండా, గంటకోసారి కొద్దికొద్దిగా నచ్చిన ఆహారాన్ని తినిపించాలి. ఇక్కడో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పిల్లలు తినే ఆహారం పెద్దల అభిరుచి, ఇష్టాలపైనా ఆధారపడి ఉంటుంది. కుటుంబ సభ్యుల అలవాట్లు కూడా పాపపై ప్రభావం చూపిస్తాయి. తిండి విషయంలో తల్లీబిడ్డలిద్దరికీ సమాన బాధ్యతలు, హక్కులు ఉంటాయి. ఎలాంటి ఆహారం పెట్టాలి, ఏ సమయానికి తినిపించాలన్న బాధ్యత తల్లిది అయితే.. ఏం తినాలి, ఎంత తినాలన్న విషయంలో పిల్లలకు ప్రత్యేక అభిరుచి ఉంటుంది. వాటిని గ్రహించాలి. ఆ పాప తల్లికి కుటుంబ సభ్యులు మానసిక ధైర్యం ఇవ్వాలి. తల్లి కూడా కేవలం కడుపు నింపడమే తన బాధ్యత అనుకోకుండా, పిల్లలు ఆహారాన్ని ఆస్వాదించేలా చేయాలి. పక్కింటి పిల్లలు తిన్నట్లే తమ పిల్లలూ తినాలని కోరుకోవడం సరికాదు. ఒకరు ఎక్కువ తింటే, మరొకరు తక్కువ తినొచ్చు. ఆ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు.
– సహానా రబీంద్రనాథ్
లైఫ్ కోచ్ అండ్ థెరపిస్ట్ SWITCH NOV
హైదరాబాద్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అమ్మను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు.. నరకం చూపిస్తున్నాడు.. ఏం చేయాలో చెప్పండి
మా అబ్బాయి వింతగా ప్రవర్తిస్తున్నాడు.. ఏం చేయాలో అర్థం కావట్లేదు
ఆ అబ్బాయితో నా చెల్లి పెండ్లి జరిగితే కాపురం సాఫీగా సాగుతుందా?
ఏడు నెలల క్రితం సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నా.. నా భర్త ఈ మధ్యే చనిపోయాడు.. నేనేం చేయాలి?