ఇంతకుముందు.. హెయిర్ స్టయిలింగ్ కోసం ఎవరో ఒక సెలబ్రిటీని ఫాలో అయ్యేది. వారి ఫొటో చూపించి, ‘అలాంటి హెయిర్ కట్ కావాలి’ అని అడిగేది. అయితే, చాలామందికి అది పూర్తిగా సెట్ కాకపోయేది. ఈ సమస్యకు ‘ఏఐ’ అద్భుతమైన పరిష్కారం చూపుతున్నది. వినియోగదారుల ముఖానికే వేర్వేరు హెయిర్ కట్స్, కలర్స్ ఎలా ఉంటాయో డిజిటల్‌గా అప్లయి చేసి చూపిస్తున్నది. దాంతో, ‘కొత్త స్టయిల్ ఎలా ఉంటుందో?!’ ముందుగానే తెలిసిపోతున్నది.
అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేస్తున్న ఏఐ.. హెయిర్ స్టయిల్ విభాగంలోనూ సత్తా చాటుతున్నది. ఆధునిక గ్రూమింగ్ రంగంలో అనేక మార్పులు తీసుకువస్తున్నది. ఒకప్పుడు ఊహలకే పరిమితమైన లుక్స్‌ను.. సెలూన్‌కి వెళ్లకముందే కండ్లముందు చూసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నది. హెయిర్‌కట్ సిమ్యులేషన్లను క్రియేట్ చేయడం, స్కిన్‌టోన్‌కు నప్పే రంగులను సిఫార్సు చేయడం, స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్‌లోని పదార్థాలను విశ్లేషించడం లాంటి ఎన్నో పనులను ‘ఏఐ’ చిటికెలో చేసి పెడుతున్నది. ఇప్పుడు చాలామంది, ముఖ్యంగా జెన్ జీ క్లయింట్లు.. స్టయిలింగ్ కోసం ఏఐని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. తమకు ఏ రకమైన హెయిర్ స్టయిల్ సూట్ అవుతుందో, ఎలాంటి హెయిర్ కలర్ వాడాలో, ఉపయోగించే స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్ వివరాలనూ ‘ఏఐ’ ద్వారానే తెలుసుకుంటున్నారు.
ఏదైనా కొత్త ప్రొడక్ట్ వాడేముందు, దాని పూర్తి సమాచారాన్నీ రాబట్టుకుంటున్నారు. ఏఐ అందించిన ఫొటోలను తీసుకెళ్లి.. స్టయిలిస్ట్లకు చూపిస్తున్నారు. అచ్చంగా అలాగే తమను తాము ముస్తాబు చేసుకుంటున్నారు. ఈ ఏఐ ఫొటోల వల్ల ఇటు హెయిర్ స్టయిలిస్టులు కూడా లాభపడుతున్నారు. క్లయింట్ మనసులో ఏముందో సులభంగా అర్థం చేసుకోగలుగుతున్నారు. ప్రొఫెషనల్ హెయిర్ స్టయిలిస్టులు కూడా సరికొత్త హెయిర్ ట్రెండ్స్, క్రియేటివ్ ఐడియాల కోసం ఏఐని వాడుతున్నారు. క్లయింట్‌కు ఏయే ఆప్షన్లు బాగుంటాయో వివరించడానికి ‘మూడ్ బోర్డ్స్’ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇలా.. హెయిర్ స్టయిలింగ్‌లో ఏఐ ఒక అద్భుతమైన సహాయక సాధనంగా మారిపోయింది. వినియోగదారులకు సరికొత్త ఐడియాలను అందిస్తున్నది.