Twin Sisters : కవల అక్కాచెల్లెళ్లు షోలాపూర్‌కు చెందిన ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ విషయం బయటికి రావడంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు దర్యాప్తు చేసేందుకు అనుమతించాలని షోలాపూర్ కోర్టును అశ్రయించారు. అయితే, కోర్టులో వాళ్లకు చుక్కెదురైంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 198 ప్రకారం కేసు విచారణకు కోర్టు అనుమతి నిరాకరించింది. అతడిపై విచారణకు ఆదేశించలేం. ఫిర్యాదు చేసిన మూడో వ్యక్తి అటు పెళ్లి కొడుకు లేదా ఇటు పెళ్లికూతురు తరఫు వాడు కాదు. వాళ్ల పెళ్లి వల్ల ఇతనిపై ఎలాంటి ప్రభావం ఉండదు అని వ్యాఖ్యానించింది.
మహారాష్ట్రకు చెందిన 36 ఏళ్ల కవల అక్కాచెల్లెళ్లు రింకీ, పింకీలు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. వీళ్లు డిసెంబర్ 2న అతుల్ అవతడే అనే వ్యక్తిని అక్లుజ్ ప్రాంతంలో పెళ్లి చేసుకున్నారు. వీళ్ల పెళ్లి వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో, అక్లుజ్కు చెందిన రాహుల్ ఫూలే అనే సామాజిక కార్యకర్త డిసెంబర్ 4న అతుల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతనిపై 494 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.