కౌలాలంపూర్: స్కూటర్‌పై వెనుక కూర్చొని స్నేహితురాలితో కలిసి వెళ్తున్న మహిళ తలపై పెద్ద కొబ్బరికాయ పడింది. దీంతో ఆమె స్కూటర్ పైనుంచి రోడ్డుపై పడింది. అయితే ఆ మహిళ హెల్మెట్ ధరించి ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. ఊహించని ఈ సంఘటన మలేషియాలో జరిగింది. స్నేహితులైన ఇద్దరు మహిళలు ఆదివారం జలాన్ తెలుక్ కుంబార్ నుంచి జార్జ్ టౌన్‌కు స్కూటర్‌పై వెళ్తున్నారు. అయితే రోడ్డు పక్కగా ఉన్న కొబ్బరి చెట్లు రోడ్డు మీదకు ఒంగి ఉన్నాయి. ఉన్నట్టుండి ఒక కొబ్బరి చెట్టు పై నుంచి బాస్కెట్ బాల్ సైజులో ఉన్న కొబ్బరికాయ స్కూటర్‌పై వెనుక కూర్చొన్న మహిళపై తలపై నేరుగా పడింది. దీంతో అదుపు తప్పిన ఆమె స్కూటర్ పైనుంచి రోడ్డుపై పడింది. ఆమె ధరించిన హెల్మెట్ కూడా కింద పడిపోయింది. స్కూటర్‌ను ఆపిన స్నేహితురాలు వెంటనే సహాయం కోసం ఆమె వద్దకు పరుగున వచ్చింది.
మరోవైపు రోడ్డుపై వెళ్తున్నవారు, స్థానికులు వెంటనే స్పందించారు. ఆ రోడ్డుపై వెళ్లే వాహనాలను అప్రమత్తం చేసి ఆపారు. గాయపడిన ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళ తమన్ ఎమాస్‌కు చెందిన పువాన్ అనిత అని స్థానిక రాజకీయ నేత అజ్రుల్ మహతీర్ అజీజ్ తెలిపారు. ఈ ప్రమాదం గురించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఫేస్బుక్ ద్వారా వెల్లడించారు. రోడ్డు మీదకు ఒంగి ప్రమాదాలకు దారి తీసేలా ఉన్న కొబ్బరి చెట్లను నరికివేస్తామని అధికారులు హామీ ఇచ్చారని అన్నారు. కాగా, ఆ స్కూటర్ వెనుక వెళ్తున్న కారు డ్యాష్ బోర్డుపై ఉన్న కెమెరాలో రికార్డైన వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యింది.