చిగురుమామిడి, ఆగస్టు 24 : ‘మా ఊళ్లే ఉన్న సమస్యలు మీ దృష్టికి తీసుకువచ్చేటోళ్లను పోలీసులు అక్రమంగా అరెస్ట్చేసిన్రు. వాళ్లేమైనా దొంగలా సర్?’ అంటూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఓగులాపూర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మహిళలు నిలదీశారు. సోమవారం ఓగులాపూర్‌లో ‘పల్లెపల్లెకూ ప్రజాపాలన’ సందర్భంగా సమావేశానికి ఎలాంటి ఆటంకం కలుగకుండా పోలీసులు ముందస్తుగా బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ బోయిని శ్రీనివాస్, గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు ఎండ్ర నారాయణ, బీజేపీకి చెందిన శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, శేఖర్, రాజును ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
సమావేశం అనంతరం మంత్రి తిరిగి వెళ్తున్న సమయంలో మహిళలు ఒక్కసారిగా ఆయన వద్దకు వెళ్లారు. ‘సమస్యలను ఎత్తిచూపే వారిని సమావేశంలో ఉండనీయకుండా ఎందుకు అరెస్టు చేశారు? వారు ఏం అన్యాయం చేసిండ్రు?’ అని నిలదీశారు. గతంలో ప్రభుత్వం సేకరించిన భూముల గురించి అడిగితే తప్పేందని ప్రశ్నించారు. అరెస్టు విషయం తనకు తెలియదని, వారిని ప్రత్యేకంగా పిలిపించుకొని గ్రామ సమస్యలను అడిగి తెలుసుకుంటానని, పరిషరించే దిశగా కృషి చేస్తానని మంత్రి పొన్నం ప్రభా కర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.