హైదరాబాద్ : వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రీడలకు( Sports ) అధిక ప్రాధాన్యం ఇస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేయడంతో పాటు క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు .
కేసీఆర్ జన్మదినం( KCR Birthday ) సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ కప్ 8వ ఎడిషన్ పోటీల విజేతలకు చెక్‌లు, ట్రోఫీలను హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో కేటీఆర్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సమగ్ర క్రీడా పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేసీఆర్ క్రికెట్ కప్ స్ఫూర్తితో వచ్చే ఏడాది కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ గులాబీ శ్రేణులను, కాకతీయ క్రికెట్ అకాడమీ సభ్యులను అభినందించారు.

ఓరుగల్లు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి : దాస్యం వినయ్ భాస్కర్
ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 8 ఏండ్లుగా కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. హనుమకొండ జిల్లా పరిధిలోని పేద క్రీడాకారులకు చేయూతనందిస్తున్నామని పేర్కొన్నారు.
విజేతలకు చెక్‌లు, ట్రోఫీల ప్రదానం
కేసీఆర్ క్రికెట్ కప్ 8వ ఎడిషన్ పోటీల్లో టోర్నీ విన్నర్‌గా నిలిచిన 51వ డివిజన్ జట్టుకు, రన్నర్స్‌గా నిలిచిన 49వ డివిజన్ జట్టుకు కేటీఆర్ చేతుల మీదుగా నగదు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. డిపార్ట్మెంట్ క్రికెట్ విభాగంలో విన్నర్‌గా నిలిచిన అంజలి కిడ్నీ కేర్ సెంటర్ హాస్పిటల్ జట్టుకు, రన్నర్-అప్‌గా నిలిచిన సంకీర్తన హాస్పిటల్ జట్టుకు కూడా ట్రోఫీలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాకతీయ క్రికెట్ అకాడమీ (KCA) ఫౌండర్ చైర్మన్ ఫారుక్ అలీ, కేసీఏ సభ్యులు మాజీద్, వీరు, సిరాజ్, రాజేష్, రాంబాబు, 51వ డివిజన్ కార్పొరేటర్ బోయినపల్లి రంజిత్ రావు, ప్రెసిడెంట్ ఫిరోజ్, 4వ డివిజన్ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్, మూటిక రాజు, యాదగిరి, పులి రజనీకాంత్, జోరిక రమేష్, నయీముద్దీన్, ఇమ్మిడి రాజు, దువ్వ కనకరాజు, ఇస్మాయిల్, కేశోజు ప్రణయ్, చిన్నా, రాంమూర్తి, రాకేష్ యాదవ్, వినీల్ రావు తదితర డివిజన్ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.