ఆసిఫాబాద్ టౌన్,మే 12 : బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు, బండి సాయి భగీరథ్‌ను వెంటే అరెస్ట్ చేయాలని, ఈ ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామాచేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి డిమాండ్ చేశారు. మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియాతో ఆమె మాట్లాడారు. అధికార అహంకారంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే ప్రజలు క్షమించరని హెచ్చరించారు.
బాలిక కుటుంబం పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేయాల్సిన పోలీసులు, అధికార ఒత్తిళ్లకు తలొగ్గి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా బెదిరింపులకు దిగడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కుమారుడు కావడం వల్లే చట్టం మౌనం వహిస్తుందా? అని ప్రశ్నించారు. బండి సాయి భగీరథ్ డ్రగ్స్, మద్యం సేవిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, చర్యలు తీసుకోకపోవడం వెనుక రాజకీయ జోక్యం ఉందని స్పష్టంగా కనిపిస్తున్నదని తెలిపారు. బాలికకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం అని స్పష్టం చేశారు.