హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ పరిధిలోని మౌలాలి రైల్వే స్టేషన్ సమీపంలో ఓవర్హెడ్ ఎక్విప్మెంట్ (ఓహెచ్ఈ) వైర్లలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అదివారం పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్తు సరఫరాలో సమస్య కారణంగా నిలిచిపోయిన శాతవాహన ఎక్స్ప్రెస్ను అధికారులు క్లియర్ చేశారు. మౌలాలి స్టేషన్లో నిలిచిపోయిన పల్నాడు ఎక్స్ప్రెస్కు ప్రత్యామ్నాయంగా డీజిల్ ఇంజిన్ను అమర్చి పంపించారు. ప్రస్తుతం రైల్వే సాంకేతిక సిబ్బంది యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులను వేగంగా చేపడుతున్నారని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
సాంకేతిక సమస్య కారణంగా సికింద్రాబాద్-భద్రాచలం రోడ్ ‘కాకతీయ ఎక్స్ప్రెస్’ రైలు మార్గాన్ని దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు. ఈ రైలును మౌలాలి మీదుగా కాకుండా మలాజిగిరి గుండా నడిపించినట్టు పేర్కొన్నారు. కాకతీయ ఎక్స్ప్రెస్ రైలు మౌలాలి స్టేషన్లో ఆగదని, ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని కోరారు. తదుపరి మార్పులు, తాజా వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని అధికారులు వెల్లడించారు.