హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు శుక్రవారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) కూటమి ఫుల్ జోష్లో ఉన్నది. కార్మికుల సమస్యల పరిషారమే ప్రధాన ఎజెండాగా కూటమి ఎన్నికల బరిలో నిలిచింది. తెలంగాణ ఆర్టీసీలో కార్మికుల హక్కులను కాపాడటంతోపాటు.. సమ్మె ద్వారా విలీన హక్కును సాధించిన జేఏసీలోని ప్రధాన సంఘాలే తమ కూటమిలో ఉన్నాయని, కార్మికులు ఆలోచించి ఓటు వేయాలని కార్మిక నేతలు పిలుపునిచ్చారు. తెలంగాణ ఆర్టీసీలో ప్రధానంగా ఉద్యోగుల భద్రతపై పోరాడుతూ.. ప్రభుత్వాన్ని కార్మికుల దగ్గరకు తీసుకొచ్చి, సమస్యలు పరిష్కరించేలా మార్గాలు అన్వేషిస్తామని ప్రచారంలో హామీ ఇచ్చారు.
దీంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ విలీనం తర్వాత ఏర్పడిన సమస్యలు తెలంగాణలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయూ కూటమి నేతలు కార్మికులకు హామీ ఇచ్చారు. సంస్థలో కార్మికుల హకులు, ఉద్యోగ భద్రత, వేతనాలు, ఉద్యోగోన్నతులు తదితర అంశాలపై నిరంతరం పోరాటం చేస్తామని ప్రకటించారు. పాత పెన్షన్ విధానం (ఓపీఎస్ ) అమలు కోసం బలమైన ఉద్యమం చేపడుతామని తెలిపారు. కొన్ని యూనియన్లు అధికార పార్టీ పంచన చేరి అన్యాయం చేస్తున్నాయని కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల పక్షాన పోరాడుతున్న ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయూ కూటమిని ఆయా డిపోల్లో గెలిపించి.. అతిపెద్ద గుర్తింపు సంఘంగా తీసుకురావాలని కోరుతున్నారు.
ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు జాయింట్ లేబర్ కమిషనర్ సునీత తెలిపారు. ఎన్నికల బరిలో మొత్తం 12 సంఘాలు ఉన్నాయని, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 115 డిపోల్లో పోలింగ్ నిర్వహిస్తున్నామని, మొత్తం 35 వేలకుపైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నట్టు తెలిపారు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఓటు వినియోగించుకోవాలని తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని, తర్వాత కౌంటింగ్ నిర్వహించి.. లెక్కలు భద్రపరుస్తామని చెప్పారు. 14, 15 తేదీల్లో జరిగే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వాటిని కలిపి తుది ఫలితాలు 17న వెల్లడిస్తామని చెప్పారు.