ఇంటర్ విలీనైంపె తప్పుడు లెక్కలు… ఇంటర్ విద్యకు సర్కార్ పోటు
ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసేందుకు ప్రభుత్వం చెప్తున్న లెక్కలు వాస్తవ విరుద్ధాలా? సర్కార్ చెప్పే అంశాల్లో అనేక వైరుధ్యాలు ఉన్నాయా? అంటే అధ్యాపక వర్గాలు అవుననే అభిప్రాయపడుతున్నాయి.
- విలీనానికి చెప్తున్న కారణాల్లో డొల్లతనం..
- సహేతుక కారణాలు చెప్పని ప్రభుత్వం..
- ఇంటర్ బోర్డు రద్దు వెనుక దాగిన కుట్ర ..
- అనుమానం వ్యక్తంచేస్తున్న అధ్యాపకవర్గం..
- జూనియర్ కాలేజీల మనుగడకే ముప్పు
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసేందుకు ప్రభుత్వం చెప్తున్న లెక్కలు వాస్తవ విరుద్ధాలా? సర్కార్ చెప్పే అంశాల్లో అనేక వైరుధ్యాలు ఉన్నాయా? అంటే అధ్యాపక వర్గాలు అవుననే అభిప్రాయపడుతున్నాయి. అసలు డ్రాపౌట్లు తగ్గించడమే లక్ష్యమైతే అందుకు ఇంటర్ బోర్డు విలీనమే పరిషారమా? అని వారు ప్రశ్నిస్తున్నారు. విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు విద్యారంగంలో తీవ్ర చర్చకు దారితీస్తున్నది. విద్యార్థులు, తల్లిదండులు, విద్యావేత్తల్లో అనేక ప్రశ్నలను రేకెత్తిస్తున్నది. విద్యార్థుల ప్రయోజనాల కోసమే ఈ సంస్కరణలని ప్రభుత్వం చెప్తుండగా, సర్కార్ చెప్తున్న కారణాలు, గణాంకాలపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా పదో తరగతి తర్వాత 40 శాతం మంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారన్న ప్రభుత్వ వాదనను అధ్యాపక సంఘాలు కొట్టిపారేస్తున్నాయి. ఇది పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్తున్నాయి. మరీ 40 శాతం డ్రాపౌట్ అయితే ఇది విద్యాశాఖ మంత్రి వైఫల్య కాదా? అని కూడా ప్రశ్నిస్తున్నాయి. ఇంత మంది చదువుకు దూరమైతే అందుకు బాధ్యులపై చర్యలేవి? అని పేర్కొంటున్నాయి.
అసత్యం – 1
డ్రాపౌట్ లెక్కల్లో తప్పులు
రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరంలో 5,16,815 మంది పదో తరగతి ఉత్తీర్ణులయ్యారు. పది తర్వాత 40 శాతం విద్యార్థులు చదువుమానేస్తున్నారని సర్కార్ అధికారికంగా ప్రకటించింది. అంటే దాదాపు 2 లక్షల మంది చదువు మానేస్తున్నట్టు లెక్క. వీరిలో అత్యధికులు బాలికలు, దళిత, గిరిజన, మైనారిటీ విద్యార్థులున్నారని ప్రభుత్వం ప్రకటించింది. అయితే వాస్తవాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. 2026-27 విద్యాసంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్‌లో 5,05,898 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. 2025-26లో 4,90,214 మంది చేరితే ఇదే ఏడాది ఏకంగా 15 వేల మంది అధికంగా ఫస్టియర్‌లో అడ్మిషన్లు పొందారు. కానీ సర్కార్ మాత్రం 40శాతం డ్రాపౌట్ అయ్యారని అబద్ధమాడింది. అంటే ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరో తప్పును ప్రచారం చేస్తున్నది.
ఇవీ సందేహాలు..
- టీచర్లంతా బోధనా డిగ్రీ కలిగి ఉం డాలని ఎన్ఈపీ చెప్తున్నది. బీఈడీ అర్హత లేని వారిని రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్లుగా నియమిస్తున్నారు. కేజీబీవీలు, మాడల్ స్కూళ్లలో బీఈడీ ఉన్న వారు ఇంటర్ తరగతులు బోధిస్తున్నారు. వీరి మధ్య వ్యత్యాసం పొడచూపే అవకాశం ఉన్నది. 9,10 తరగతులకు జూనియర్ లెక్చరర్లు బోధించేందుకు నిబంధనలు అనుమతించవు. దీనిని ఎలా అధిగమిస్తారు.
- విద్యాహక్కు చట్టం పరిధిలో (ఆర్టీఈ యాక్ట్) 1-12 తరగతులున్నాయి. కానీ అత్యంత కీలకమైన ప్రీ ప్రైమరీ విద్యాహక్కు చట్టం కింద లేదు. ప్రీ ప్రైమరీ ప్రభుత్వ దయాదాక్షిణాల్యపై ఆధారపడి ఉన్నది. ప్రాథమిక విద్యలో లోపాటు సరిదిద్దకుండా ఇంటర్ విద్య పై ఎందుకు ఫోకస్ పెడుతున్నది. దీనిని ప్రభుత్వం ఎందుకు మార్చడంలేదు.
- రాష్ట్రంలో పదోతరగతి, ఇంటర్ పాఠ్యపుస్తకాల అనుసంధానం జరిగింది. రెండింటి పుస్తకాలను సమతుల్యం చేసే పాఠ్యపుస్తక రచన చేస్తున్నారు. ఇలాంటప్పుడు కొత్త విధానంతో ఒనగూరే లాభాలేంది?
- ఒకప్పుడు ఇంటర్లో ఫిజికల్ సైన్స్ లెక్చరర్లుండేవారు. ఆ తర్వాత పరిణామాలతో కొంతకాలం ఫిజిక్స్, కెమిస్ట్రీలకు వేర్వేరు లెక్చరర్లు బోధించారు. ఇప్పుడు కెమిస్ట్రీని ముగ్గురు లెక్చరర్లు బోధిస్తున్న కాలేజీలూ ఉన్నాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒకరు, ఇనార్గిక్ కెమిస్ట్రీ మరొకరు, ఫిజికల్ కెమిస్ట్రీ ఇంకొకరు బోధించాల్సి వస్తున్నది. కొత్త ప్రయోగంలో ఇలాంటి సదుపాయాలుంటాయా?
- విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, బ్యాగులు, షూస్ ఇవ్వాలంటే మూడు నాలుగు నెలలు పడుతున్నది. వీటినే సకాలంలో సర్కార్ ఇవ్వలేకపోతున్నది. రాబోయే జూన్ కల్లా ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయడం సాధ్యమేనా? అన్న ప్రశ్నలొస్తున్నాయి.
అసత్యం – 2
టీసీల్లేక చదువు మానేస్తున్నారా?
పదో తరగతి తర్వాత విద్యార్థులు పాఠశాలల నుంచి బదిలీ సర్టిఫికెట్లు (టీసీ) తీసుకొన్నాక కొత్త కాలేజీల్లో చేరడం ప్రతిబంధకంగా మారుతుందని, ఈ క్రమంలోనే పలువురు డ్రాపౌట్ అవుతున్నారన్నది అధికారుల వాదన. ఇది ఎన్రోల్మెంట్ తగ్గేందుకు ఓ కారణమన్న అభిప్రాయం ఉన్నది. ఇదే నిజమనుకుంటే ఈ నిబంధనలను సర్కార్ సరళీకరణ చేయవచ్చు. సాంకేతిక పరిష్కారాలు చూపవచ్చు. ప్రభుత్వ స్కూళ్లల్లో చదివిన వారికి టీసీలు జారీ చేయరాదన్న నిబంధనలు పెట్టి అమలు చేయవచ్చు. ప్రభుత్వ కాలేజీల్లో చేరిన విద్యార్థుల టీసీలు తామే ఇస్తామన్న భరోసా ఇవ్వవచ్చు. ఏ విద్యాసంస్థలో చదువుకోవాలన్నది, ఏ కాలేజీలో చేరాలన్న ఆప్షన్ విద్యార్థిదే. ఆ హక్కు విద్యార్థికే ఉంటుంది. రేపు 9,10,11,12 తరగతులు ఒకే విద్యాసంస్థలో ప్రారంభించినా 10వ తరగతి పూర్తిచేసిన విద్యార్థి అక్కడే చదువుతారన్న నమ్మకమూ లేదు.
అసత్యం – 3
ఒకే క్యాంపస్‌లో ఉంటే డ్రాపౌట్ తగ్గుతుందా!
ఒకే స్కూళ్లో పదో తరగతి చదివిన వారు అక్కడే ఇంటర్ చదువుతున్నారు. 12వ తరగతి వరకు కొనసాగింపు ఉన్న విద్యాసంస్థల్లో డ్రాపౌట్ రేట్ తక్కువగా ఉంటున్నది. ఇది సర్కార్ చెప్తున్న మరో వాదన. నిజానికి ఇది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే నగరంలోని ఓ ప్రముఖ సీబీఎస్ఈ స్కూల్లో పదో తరగతిలో ఐదు సెక్షన్లు ఉంటే ప్లస్ టూకు వచ్చేసరికి ఒకటి రెండు సెక్షన్లు మాత్రమే ఉన్నాయి. అంటే మిగతా మూడు సెక్షన్లలోని విద్యార్థులు అదే స్కూల్లో ఎందుకు చదువలేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ఈ ఒక్క స్కూలే కాదు.. అనేక సీబీఎస్ఈ స్కూళ్లలో ఇదే జరుగుతున్నది. అంటే 12వ తరగతి వరకు ఉన్న స్కూళ్లలో ఇంటర్ విద్యను చదువడం లేదనడానికి ఈ ఉదాహరణే నిదర్శనం.
అసత్యం – 4
ఇంటర్‌ను చెరిపేస్తే పోటీ పరీక్షల్లో వెనుకబడుతారా?
విద్యార్థుల మేలు కోరి విద్యారంగం సంస్కరణలు చేపడుతున్నామని ప్రభుత్వం చెప్తున్నది. ఇది విద్యార్థులకు లాభమని అంటున్నది. అయితే ఇంటర్ విద్య ప్రత్యేకంగా ఉండటం వల్లే మన విదార్థులు జాతీయ పోటీ పరీక్షల్లో రాణిస్తున్నారు. పైగా జాతీయ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ప్రత్యేక ప్రణాళిక అవసరం. ఐఐటీకి తెలంగాణ ఐకాన్‌గా మారింది. పెద్ద రాష్ర్టాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పోల్చితే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను తెలుగు రాష్ర్టాల నుంచి 40వేల మంది రాస్తున్నారు. ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్లు సాధిస్తున్నారు. నీట్ పరీక్షల్లో అత్యుత్తుమ ర్యాంకులను కైవసం చేసుకుంటున్నారు. రేపు ఇంటర్‌ను రద్దుచేస్తే ఈ పరిస్థితి ఉండదన్నది విద్యారంగ నిపుణుల వాదన. ఒకవేళ జేఈఈ, నీట్ పరీక్షల్లో రాష్ట్రంలో ర్యాంకులు సాధించకపోతే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు పేర్కొంటున్నారు.
అసత్యం – 5
కాలేజీ బలోపేతమా? మూతపడటమా?
రాష్ట్రంలో మొత్తం 3,333 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 430 (12.9శాతం) ప్రభుత్వ కాలేజీలు ఉంటే 16 (0.5శాతం) ఎయిడెడ్, 1,453 ( 43.6శాతం) ప్రభుత్వరంగ కాలేజీలు, 1,434 (43 శాతం) ప్రైవేట్ కాలేజీలు ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో 5 లక్షల మంది ఫస్టియర్‌లో చేరుతుండగా, సగటుకు ఒక్కో కాలేజీలో విద్యార్థుల సంఖ్య 150లోపు మాత్రమే. కొత్తగా స్కూళ్లలో ఇంటర్ విద్యను ప్రారంభిస్తే ఒక కాలేజీలో సగటు విద్యార్థుల సంఖ్య అమాంతం పడిపోతుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఆరేండ్ల క్రితం మొత్తం అడ్మిషన్లు 1.96 లక్షలు ఉండగా నిరుడు 1.72 లక్షలకు తగ్గింది. 2021-22లో 1.10 లక్షల మంది ఫస్టియర్‌లో చేరితే 2025-26కు వచ్చేసరికి అడ్మిషన్లు 94 వేలకు పడిపోయాయి. ద్వితీయ సంవత్సరంలో 2021-22లో 86 వేల మంది ఉంటే..2025-26కు వచ్చేసరికి ఆ సంఖ్య 67వేలకు పడిపోయింది. దీంతో ప్రభుత్వ కాలేజీలే మూతపడే ప్రమాదం పొంచి ఉన్నది.
అసత్యం -6
ఇవి బాగుంటే సీఈవోలెందుకు?
రాష్ట్రంలో కేజీబీవీలు, మాడల్ సూళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో ఇప్పటికే ప్లస్‌టూ విద్యావిధానం అమలవుతున్నది. దాదాపు 1,400కు పైగా కాలేజీల్లో ఒకే క్యాంపస్‌లో 5వ తరగతి నుంచి ఇంటర్ విద్యను అమలు చేస్తున్నారు. ఈ కాలేజీల్లో ఇంటర్ విద్యార్థుల సంఖ్య లక్ష. అదే 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య దాదాపు లక్ష. అంటే పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చు. ఐఐటీ, నీట్ ర్యాంకులు సాధించడంలో వెనుకబడుతున్న ఈ తరుణంలో జిల్లాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల (సీవోఈ)ను నెలకొల్పారు. ఈ గురుకులాలే సత్ఫలితాలనిస్తే సీవోఈలను ఎందుకు ప్రారంభించినట్టు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను జల్లెడ పట్టి సీఈవోల్లో అడ్మిషన్లు ఇస్తున్నారు. గురుకులాల్లో అంత సత్ఫలితాలివ్వని విధానాన్ని ఎందుకు రుద్దుతున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇటీవలే మాడల్ స్కూళ్లు, కేజీబీవీలు సైతం సీవోఈల బాటపట్టాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

