హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): బాగ్-ఏ-ఆమ్లోని మసీద్-ఏ-బాగ్-ఏ-ఆ (రాయల్ మసీదు) విస్తరణ, పునరుద్ధరణ కోసం 1,539 గజాల ప్రభుత్వ స్థలాన్ని (రాష్ట్ర శాసనసభకు చెందిన 698 చదరపు గజాలు, ఉద్యానశాఖకు చెందిన 841 చదరపు గజాలు) మార్పిడి చేయాలన్న ప్రతిపాదనపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ప్రతిపాదనను సవాలు చేస్తూ హైదరాబాద్కు చెందిన చిలుముల రామారావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
దీంతో ఈ ప్రతిపాదన రాజ్యాంగంలోని 14, 21, 48ఏ, 51ఏ(జీ) అధికరణలకు విరుద్ధమని, అది అమలైతే బాగ్-ఏ-ఆమ్లోని బహిరంగ ప్రదేశాలు, పచ్చదనం, పాత వృక్షాలు, ప్రజల రాకపోకల మార్గాలు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నదని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. రెవెన్యూ, సర్వే, అటవీ, పురావస్తు, ఉద్యాన, మ్యూజియంల శాఖలు, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్త సర్వే నిర్వహించి హద్దులను నిర్ధారించే వరకు భూమార్పిడి ప్రతిపాదనను నిలిపివేయాలని కోరారు. దీంతో భూమార్పిడి ప్రతిపాదనపై ప్రభుత్వ వివరణ కోరిన ధర్మాసనం.. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.