బడుల్లో పరిశుభ్రతకు పైసలేవి?
రాష్ట్రంలోని సర్కార్ బడులను పరిశుభ్రంగా ఉంచే విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది.
- విడుదల కాని ప్రత్యేక వర్కర్ల వేతనాలు
- నెలల తరబడి వేతనాలు పెండింగ్
- 7 జిల్లాలకు పైసా విదల్చని సర్కార్
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సర్కార్ బడులను పరిశుభ్రంగా ఉంచే విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. అట్టహాసంగా జీవో విడుదల చేసిన సర్కార్.. గౌరవ వేతనాల విడుదల్లో మాత్రం జాప్యం చేస్తున్నది. ఫలితంగా పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతున్నది. నెలల తరబడి గౌరవ వేతనాలు పెండింగ్‌లో ఉండటంతో వర్కర్లు పనిచేసేందుకు ముందుకు రావడంలేదు. రాష్ట్రంలోని సర్కార్ స్కూళ్లలో పరిశుభ్రత, పచ్చదనం, మరుగుదొడ్ల నిర్వహణకు గౌరవ వేతనం ప్రాతిపదికన స్పెషల్ వర్కర్లను నియమించుకునేందుకు సర్కార్ అనుమతినిచ్చింది. ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా పారితోషికాన్ని ఖరారు చేసింది.
డిస్ట్రిక్ట్ మినరల్ ట్రస్ట్ ఫండ్ (డీఎంఎఫ్టీ) నుంచి నిధుల విడుదలకు అనుమతినిస్తూ 2024 జూలై 30న ప్రభుత్వం జీవో-21 జారీచేసింది. విద్యార్థుల సంఖ్య 30మంది లోపు ఉంటే రూ.3 వేలు, 100 మంది లోపు ఉంటే రూ.6 వేలు, 101-250 వరకు రూ.8 వేలు, 251 నుంచి 500 మంది ఉంటే రూ.12 వేలు, 501 నుంచి 750 మంది ఉంటే రూ.15 వేలు, 751పైన విద్యార్థులున్న బడులకు రూ.20 వేల చొప్పున పారితోషికాన్ని ఖరారు చేసింది. నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో ఉండటంతో పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.
ఏడు జిల్లాల్లో పైసా విదల్చలే
2026-27 విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఏడు జిల్లాల్లో రూపాయి కూడా విడుదల చేయలేదు. కామారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, ములుగు, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో ఇప్పటివరకూ కనీసం ఒక నెల గౌరవ వేతనం కూడా చెల్లించలేదు. వేతనాలు అందకపోవడంతో ప్రధానోపాధ్యాయులపై వర్కర్లు ఒత్తిడి తెస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో విధుల నిర్వహణను సైతం నిలిపివేస్తున్నారు. మరో వైపు, అధికారులు పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోతే హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులిస్తున్నారు. ఇటు వర్కర్లు పనిచేసేందుకు నిరాకరిస్తుండటం, అటు అధికారులేమో షోకాజ్ నోటీసులు జారీచేస్తుండటంతో హెచ్ఎంలకు తిప్పలు తప్పడంలేదు.
డైరెక్టర్‌కు వినతి.. అయినా కదలికేది?
అత్యంత సున్నితమైన ఈ సమస్యను పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం (టీఎస్‌జీహెచ్‌ఎంఏ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించినా, ఫలితం లేదని సంఘం అధ్యక్షుడు ఆర్ రాజగంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్ గిరిధర్‌గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘స్కూల్ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్’ను తక్షణమే విడుదల చేసి, ప్రత్యేక వరర్లకు పెండింగ్ గౌరవ వేతనాలు చెల్లించాలని కోరారు. పాఠశాలల పరిశుభ్రతకు ప్రత్యేక పథకం ప్రకటించి, దాని అమలుకు అవసరమైన నిధులు విడుదల చేయకపోతే ప్రయోజనమేందని ప్రశ్నించారు.
సిద్దిపేటలో రెండేండ్ల బకాయిలు
సిద్దిపేట జిల్లాలో ప్రత్యేక వరర్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉన్నది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు నెలలు, 2025-26లో నాలుగు నెలల గౌరవ వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. అంటే గత రెండు విద్యా సంవత్సరాలకు సంబంధించి ఏడు నెలల బకాయిలు పేరుకుపోయాయి. ప్రస్తుత 2026-27 విద్యా సంవత్సరంలోనూ ఇప్పటివరకూ ఒక నెల వేతనం కూడా చెల్లించలేదు. కొన్ని జిల్లాల్లో పాక్షికంగా విడుదల చేసి చేతులు దులుపుకొన్నారు. నిజామాబాద్, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో నాలుగు నెలలు, మంచిర్యాల, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మూడు నెలల చొప్పున మాత్రమే చెల్లించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

