హ్యామ్ రోడ్లలో కమీషన్ల లొల్లి!
తెలంగాణలో ‘పర్సటేజీ’ల గోల ముదిరి పాకానపడుతున్నట్టుంది. ఏదైనా శాఖలో పనులు జరుగాలంటే ఇచ్చుకునే పర్సంటేజీల గోల ఒకటైతే.. ప్రభుత్వం అప్పుగా తీసుకొచ్చే రుణాలకు సంబంధించిన పర్సంటేజీల గోల మరొకటి.
- ఆర్‌అండ్‌బీకి హడ్కో ఇస్తానన్న రుణంపై ఆర్థిక శాఖ కొర్రీలు!
- హడ్కో నుంచి నేరుగా నిధులు ఇవ్వడంపై ఆర్థికశాఖ అసంతృప్తి
- వడ్డీ పేరుతో కొర్రీ.. ఆర్నెల్లుగా ఆగిన రూ.9 వేల కోట్ల రుణం
- అసలు కారణం వేరే ఉన్నదని అంటున్న ఆర్అండ్బీ వర్గాలు
- ఆగిన హ్యామ్ రోడ్ల పనులు
- ‘పర్సంటేజీ’ పంచాయితీ తేలితేనే ప్రక్రియ ముందుకు?
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ‘పర్సటేజీ’ల గోల ముదిరి పాకానపడుతున్నట్టుంది. ఏదైనా శాఖలో పనులు జరుగాలంటే ఇచ్చుకునే పర్సంటేజీల గోల ఒకటైతే.. ప్రభుత్వం అప్పుగా తీసుకొచ్చే రుణాలకు సంబంధించిన పర్సంటేజీల గోల మరొకటి. ఈ రెండు పర్సంటేజీల విషయంలో రాజీ కుదిరితేనే పనులు గాడినపడ్తాయి. రెండూ కుదరకపోతే అది ఏ పనైనా ఆగిపోవాల్సిందే! దీనికి ప్రత్యక్ష ఉదాహరణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ‘హైబ్రీడ్ యాన్యూటీ మోడ్ (హ్యామ్) రోడ్లు.
రాష్ట్ర రోడ్డు, రవాణా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 6,092 కిలోమీటర్ల పరిధిలో రోడ్లను నిర్మించాలని తలపెట్టారు. దీనిపై అనేక విధాలుగా కసరత్తు చేసి నిధుల కోసం అన్నిచోట్ల తిరిగి చివరకు హడ్కోను ఒప్పించారు. హడ్కో రూ.9 వేల కోట్లను హ్యామ్ రోడ్లకు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. హడ్కో ముందుకు రావడంతో 6,092 కిలోమీటర్ల పరిధిని మొత్తం 34 ప్యాకేజీలుగా చేసి టెండర్లు పిలిచారు. టెండర్లలో పాల్గొనేందుకు కాంట్రాక్టర్లు ఎవ్వరూ ముందుకు రాలేదు. ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నం చేసి చివరికి పనులు అప్పగించింది. అయితే, అసలు సమస్య ఇక్కడే మొదలైంది.
నిలిచిపోయిన హడ్కో రుణం అనుమతులు
రోడ్లు, భవనాల శాఖ హడ్కోను ఒప్పించి రుణాన్ని సంపాదించినప్పటికీ, రాష్ట్రస్థాయిలో ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రావడంలేదు. గడిచిన ఆరు నెలలుగా ఏదో ఒక కొర్రీతో హడ్కో రుణ ప్రక్రియ ముందుకు సాగడంలేదు. హడ్కో రుణం ఇవ్వడాన్ని రిజర్వ్ బ్యాంకు కూడా ఒప్పుకున్నది. హడ్కో తాను ఇచ్చే రుణాన్ని నేరుగా రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఆర్డీసీ)కు మంజూరు చేస్తుంది. ఆర్డీసీ హ్యామ్ రోడ్ల నిర్మాణ బాధ్యతలను చూస్తుంది. అయితే, హడ్కో ఇచ్చే రూ.9,100 కోట్ల రుణానికి తొలి అయిదేండ్లలో 8.6% వడ్డీ, తదుపరి కాలానికి 9.12% వడ్డీ చొప్పున చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. తొలుత దీనికి రోడ్లు, భవనాల శాఖ అధికారులు ఒప్పుకున్నారు.
అంతా ఒప్పుకొని వచ్చాక రాష్ట్ర ఆర్థిక శాఖ వడ్డీ మరీ ఎక్కువ ఉన్నదంటూ హడ్కో రుణ ప్రతిపాదనపై కొర్రీలు పెట్టింది. దేశవ్యాప్తంగా హడ్కో ఈ తరహా ప్రాజెక్టులకు 8.6% వడ్డీనే వసూలు చేస్తుందని, తదుపరి కాలానికి సంబంధించి ఉన్న 9.12% వడ్డీ గురించి అయిదేండ్ల తర్వాత మాట్లాడితే సరిపోతుందని అధికారులు చెప్పారు. కానీ, ఆర్థిక శాఖ మాత్రం వినలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ వడ్డీని కూడా తగ్గించాలని, కనీసం 8.8 శాతానికి తదుపరి వడ్డీని వసూలు చేస్తామని హడ్కోను ఒప్పిస్తేనే రుణం తీసుకోవాలని భీష్మించుకొని కూర్చున్నది.
దీంతో చేసేదేమీలేక రోడ్లు భవనాల శాఖ అధికారులు ఉరుకులు పరుగుల మీద ఢిల్లీకి మరోసారి ప్రతిపాదన పంపారు. ఈసారి తొలి అయిదేండ్లకు 8.6% తమకు సమ్మతమేనని, అయితే, తదుపరి పదేండ్ల కాలానికి 8.8% వడ్డీ ఉంటుందంటేనే తాము రుణం తీసుకుంటామని తేల్చిచెప్పారు. ఇలా ప్రతిపాదనలు పంపి నెల రోజులవుతున్నది. హడ్కో అధికారులు మాత్రం తమ పాలకవర్గ సమావేశంలో చర్చించి చెప్తామన్నారు. హడ్కో పాలకవర్గం నుంచి ఇంకా అధికారిక ఉత్తర్వులు రాష్ర్టానికి అందలేదు. దీంతో ఇప్పట్లో హ్యామ్ రోడ్ల వ్యవహారం తేలేలాలేదు.
రుణం వచ్చినా.. ప్రభుత్వ వాటా వస్తుందా?
మొత్తం రూ.13 వేల కోట్లలో 9,100 కోట్లు హడ్కో నుంచి రుణం తీసుకుంటున్నప్పటికీ, ఈ మొత్తంతో రోడ్ల నిర్మాణం పూర్తవ్వదు. కనీసం మరో రూ.4,000 కోట్లు కావాలి. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఇవ్వాలి. లేదా గ్యారెంటీలు సమకూర్చాలి. ఇది కూడా అంత ఈజీ కాదు. దీనికి కూడా ఆర్థిక శాఖ నుంచి అనేక అనుమతులు అవసరం. మరో మూడు నాలుగు నెలలపాటు హ్యామ్ రోడ్ల పరిస్థితి ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగానే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. పర్సంటేజీల గొడవ తేలి, రుణం మంజూరై వచ్చిన తర్వాత పనులు మొదలవుతాయని, మొదలయ్యే పనులు ఎప్పుడు ముగుస్తాయో చెప్పాలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు.
పర్సంటేజీల గొడవేంది?
హ్యామ్ రోడ్ల నిధులు నేరుగా రోడ్లు, భవనాల శాఖ పరిధిలో ఉండే ఆర్డీసీకి వెళ్తాయి. నిధుల విడుదల అధికారం ఆర్అండ్బీ అధికారులు, మంత్రికి మాత్రమే ఉంటుంది. రుణం మంజూరైపోతే ఆర్థిక శాఖ పాత్ర ఏమీ ఉండదు. ఈ నేపథ్యంలోనే ‘పర్సంటేజీ’ల గొడవ మొదలైనట్టు ఆర్అండ్బీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. బిల్లుల మంజూరు ప్రక్రియలో ఆర్థిక శాఖ పాత్ర లేకపోవడం అక్కడ ఉన్న కొంతమందికి రుచించడంలేదని, అందుకే ఏదో ఒక కారణంతో హ్యామ్ రోడ్ల రుణ ప్రక్రియను అడ్డుకుంటున్నారని చెప్తున్నారు.
పెద్ద మొత్తంలో నిధుల ప్రవాహం ఉంటుందని, దీంట్లో ఆర్థిక శాఖకు చెందిన ‘గట్టి మనిషి’ మొత్తం ప్రక్రియను నిలిపివేయాలని చెప్పినట్టు తెలుస్తున్నది. దీనిపై గత నెల జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా గట్టిగానే చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. ఈ చర్చ తర్వాత రోడ్ల శాఖ మంత్రి కొంత నారాజ్ అయినట్టు సమాచారం. ఆయన ఇదే విషయాన్ని తన సహచర మంత్రులకు కూడా చెప్పి వాపోయినట్టు సమాచారం. తాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రోడ్ల కార్యక్రమాన్ని ప్రారంభించానని, కొబ్బరికాయ కొట్టి నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభం కాకపోతే ఎట్లా అంటూ ఆయన వాపోయినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

