హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): టెక్నాలజీ స్టార్టప్‌లే కాకుండా ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించే బ్యాంకింగ్, ఫైనాన్సింగ్ రంగాల్లో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు టీహబ్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఫిన్‌టెక్ స్టార్టప్‌లను ఏంపికచేసి వాటిని అవసరమైన మెంటారింగ్, మార్కెటింగ్ సదుపాయాలతోపాటు రూ.10 లక్షల వరకు గ్రాంట్ ఫండింగ్‌ను కల్పించనున్నది. ఆసక్తి ఉన్నవారు టీహబ్‌లో సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు. ఎంపికైన స్టార్టప్‌లు ఫైనాన్సియల్ ఐడెంటిటీ అండ్ సెక్యూరిటీ, యుబిక్యూటియస్ లెండింగ్, నెక్ట్ జనరేషన్ పేమెంట్స్, ఫైనాన్షియల్ వెల్బీయింగ్ మేనేజ్మెంట్, ఫిన్‌టెక్ ఆపరేషన్స్, ఫైనాన్సియల్ ఇన్‌క్లూజన్ లాంటి అంశాల్లో కొత్త ఆవిష్కరణలు చేయాల్సి ఉంటుందని వివరించారు. నూతన ఆవిష్కరణలకు చేయూతనిచ్చేందుకు టీహబ్ ఇప్పటికే దేశంలోని అనేక సంస్థల భాగస్వామ్యంతో ప్రోత్సాహక కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఔత్సాహిక స్టార్టప్‌లకు మంచి అవకాశాలు లభించి, వాటి ఉత్పత్తులు విజయవంతమయ్యేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని టీహబ్ నిర్వాహకులు తెలిపారు.