Dalit Bandhu | నవశకానికి నాంది.. దళిత జనోద్ధరణలో మరో ముందడుగు..

- కాంట్రాక్టులు, లైసెన్సుల్లో ప్రత్యేక కోటా
- ఎస్సీల అభివృద్ధికి చేయూత..
- తొలిసారిగా మార్కెట్ చైర్మన్లలో రిజర్వేషన్లు
- టీ-ప్రైడ్‌తో దళిత వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం..
- సబ్‌ప్లాన్ నిధులు క్యారీ ఫార్వర్డ్
హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): ‘ప్రజాస్వామ్యమంటే సమానత్వమే. వీలైనంత తొందరగా దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలను రూపుమాపాలి. దళితుల అభివృద్ధి అందుకు సోపానం కావాలి’ అన్న అంబేద్కర్ ఆశయాన్ని తెలంగాణ ప్రభుత్వం అక్షరాలా నెరవేరుస్తున్నది. స్వరాష్ట్రంలో దళిత జనోద్ధరణే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలు, ప్రత్యేక కార్యక్రమాలను అమలుచేస్తున్నది. తూతూ మంత్రంగా సాయంచేసి.. ఆర్భాటపు ప్రచారాలు చేసుకొని.. చేతులు దులుపుకోకుండా దళితుల సమస్యను మూలాల నుంచి పెకలించి వేసేందుకు కృషిచేస్తున్నది. ఎస్సీల్లో అన్ని వయసులు, అన్ని వర్గాల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నది. తాజాగా దళితులు ఆర్థికంగా ఉన్నతస్థాయికి ఎదిగే మార్గాలపై దృష్టి పెట్టింది. వైన్స్‌లు, ఎరువుల దుకాణాలు, మెడికల్ షాప్‌లు వంటివాటిల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో దళిత జనోద్ధరణలో నవశకం ప్రారంభం కానున్నది. దళితబంధు పథకం కింద ప్రభుత్వం రూ.10 లక్షలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కరు సొంతగా లేదా ఇద్దరుముగ్గురు కలిసి ఒక బృందంగా ఏర్పడి వీటిని ఏర్పాటు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తే వారి జీవితాలు బాగుపడుతాయనే యోచనలో సీఎం కేసీఆర్ దీనికి నాంది పలికారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మద్యం దుకాణాలు, ఎరువుల దుకాణాలు, మెడికల్ షాపులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, మీ సేవ కేంద్రాలు, రేషన్ షాపులు, వివిధ శాఖల్లోని కాంట్రాక్ట్ పనులు, విద్యాసంస్థలు, రిటైల్ వ్యాపారాలు వంటివాటిలో రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉన్నది.
భావి మేధోవర్గానికి బాటలు
‘చదువుతోనే జాతి బాగుపడుతుంది’ అన్న ఫూలే నినాదం స్ఫూర్తిగా దళితుల్లో విద్యావ్యాప్తిపై రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రత్యేకంగా 268 ఎస్సీ గురుకులాలను ఏర్పాటుచేసింది. డిగ్రీ వరకు ఉచిత విద్యనందిస్తున్నది. సకల సౌకర్యాలు కల్పించి, దళిత బిడ్డలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నది. భావి మేధోవర్గాన్ని తయారు చేస్తున్నది. ఈ గురుకులాల్లో సుమారు 1.35 లక్షల మంది చదువుతున్నారు. మొత్తంగా ఇప్పటివరకు గురుకులాల కోసం రూ.4,500 కోట్ల వరకు ఖర్చు చేసింది. విదేశాలకెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థుల కోసం ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి’ పథకం కింద రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నది. గత ఏడేండ్లలో మొత్తం 620 మంది విద్యార్థులకు రూ.107.54 కోట్లు సహాయం అందజేసింది.
పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు..
ఎస్సీ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ‘టీ-ప్రైడ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. ఔత్సాహిక ఎస్సీ పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల శాఖ నుంచి పలు రాయితీలు ప్రకటించింది. స్టాంప్‌డ్యూటీని 100% మినహాయించడం, భూమి కొనుగోలు వ్యయంలో సాయం, కరెంటు చార్జీల్లో సబ్సిడీ, పెట్టుబడిలో 35% రాయితీ.. ఇలా అనేకం ప్రకటించింది. ఆరేండ్లలో ఎస్సీలకు పరిశ్రమల శాఖ తరఫున వివిధ స్కీంల కింద రూ.482 కోట్లు సబ్సిడీ ఇచ్చింది. పావలా వడ్డీకింద రూ.10.03 కోట్లు కేటాయించింది.
దళిత మహిళా సాధికారత కోసం
దేశంలోనే ఎక్కడా లేనివిధంగా నిరుపేద దళిత మహిళలకు మూడెకరాల భూమిని ఇచ్చే పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్నది. దళిత మహిళా సాధికారతను సాధించడంలో భాగంగా ప్రభుత్వం ప్రైవేట్ భూములను కొనుగోలు చేసి వందశాతం సబ్సిడీతో వారికి కేటాయిస్తున్నది. ఇప్పటివరకు 6,874 మంది లబ్ధిదారులకు 16,906 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇచ్చింది. ఇందుకోసం రూ.756 కోట్లు ఖర్చు చేసింది.

దళితుల జీవితాల్లో కొత్త కాంతులు
ఉమ్మడి రాష్ట్రంలో దళితుల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేసినవారు లేరు. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయి. నాణ్యమైన విద్య అందడంతోపాటు యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది. దళితులు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు చేయూత అందిస్తున్నది. రాజకీయంగానూ దళితులకు ఉన్నతస్థానాలు దక్కుతున్నాయి.
- గ్యాదరి బాలమల్లు, టీఎస్ఐఐసీ చైర్మన్
ఎస్సీల ప్రత్యేక అభివృద్ధి నిధి
ఎస్సీల కోసం ‘ప్రత్యేక అభివృద్ధి నిధిని’ ఏర్పాటు చేయడంతోపాటు దేశంలోనే తొలిసారిగా 2017లో మిగులు నిధులను వచ్చే ఆర్థిక సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేసేలా చట్టాన్ని చేసింది. 2014-15 నుంచి ఇప్పటివరకు ఎస్సీల ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద దళితుల కోసం రూ.55,439 కోట్లను ఖర్చు చేసింది.

ఉద్యోగ కల్పనలో స్టడీసర్కిళ్లు
నిరుద్యోగ ఎస్సీ యువతకు శిక్షణ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 11 ఎస్సీ స్టడీ సర్కిళ్లను స్థాపించింది. ఇందులో శిక్షణ పొందినవారిలో 1,181 మంది ఉద్యోగాలు పొందారు. 12 మంది సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావడం విశేషం. ఎస్సీ యువత సొంతకాళ్లపై నిలబడేలా నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నది. ఏడేండ్లలో రూ.37.44 కోట్లు ఖర్చు చేసి 8,974 మందికి శిక్షణనిచ్చింది. మరోవైపు డ్రైవర్ కం ఓనర్ పథకం కింద రాయితీపై గత మూడేండ్లలో 2,105 వాహనాలను అందించింది. ఇందుకోసం రూ.96.16 కోట్లు ఖర్చుచేసింది. కొత్తగా మరో 500 మందికి విద్యుత్తు వాహనాలు అందించేందుకు సిద్ధమవుతున్నది.
రాజకీయ సాధికారత కోసం..
దళితులు రాజకీయంగా అన్నిపదవుల్లో ఎదగాలని, అందరితో సమానంగా హోదాలు అనుభవించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే తొలిసారిగా మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు కల్పించింది. రాష్ట్రంలో 168 మార్కెట్ కమిటీలు ఉండగా, 15 చైర్మన్ పదవులను ఎస్సీలకు ప్రత్యేకంగా కేటాయించింది. మహిళా కోటాను ఏర్పాటుచేసి అందులోనూ ఎస్సీ మహిళలకు రిజర్వేషన్ కల్పించింది. ఫలితంగా రాష్ట్రంలో 20 మందికిపైగా ఎస్సీలు చైర్మన్ పదవులను పొందారు. ఎస్సీ కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించేందుకు 101 యూనిట్ల ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నది. కల్యాణలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు 1.82 లక్షల మంది ఎస్సీ ఆడబిడ్డలకు రూ.1,422 కోట్లు అందజేసింది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పథకం కింద ఇప్పటివరకు 1.56 లక్షల మందికి రూ.1944 కోట్లు మంజూరుచేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

