హైదరాబాద్ : పూటకో పార్టీ మార్చే నటి జీవిత టీఆర్ఎస్ నాయకులపై ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ సభ్యులపై చేస్తున్న విమర్శలను తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం తీవ్రంగా ఖండించారు. సినిమాలో స్క్రిప్ట్ చదివినట్టు రాజకీయ ఉపన్యాసాలు చదివే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని జీవితకు సూచించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితపై వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పారని జీవితకు అనిల్ గుర్తు చేశారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు హీరోలు కాబట్టే నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్నో త్యాగాలు చేసి రాష్ట్ర ఏర్పాటు కోసం అలుపెరుగని పోరాటం చేసారని అనిల్ స్పష్టం చేశారు. మీరు జీరోలు కాబట్టి ఎవరు అధికారంలో ఉంటే వారితో జతకడుతారని విమర్శించారు. కవిత ఇంటిపై బీజేపీ గుండాలు దాడి చేస్తే ఖండించే సంస్కారం లేదు కానీ, బీజేపీ నాయకుల మెప్పు కోసం పిచ్చిపిచ్చి విమర్శలు చేస్తే తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని జీవితను హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ మీద విమర్శలు చేయడాన్ని అనిల్ తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా స్క్రిప్ట్ ఉపన్యాసాలు చదవడం మానేసి, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని అనిల్ సూచించారు.