CID Digital Services | సీఐడీలో ఏడు డిజిటల్ సేవలు ప్రారంభం.. జైళ్ల నుంచి విడుదలయ్యే ఖైదీలపై నిఘా
CID Digital Services | పోలీసు సేవలను ఇటీవల వినియోగించుకున్న ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు తెలుసుకునేందుకు సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సెంటర్ (సీఎఫ్‌సీ)ను ఏర్పాటు చేశారు. నేర పరిశోధన విభాగం (సీఐడీ) రూపొందించిన ఏడు డిజిటల్ సేవలను డిజిపి సీవీ ఆనంద్ డీజీపీ కార్యాలయంలో ప్రారంభించారు.
CID Digital Services | హైదరాబాద్, అక్టోబర్ 28: పోలీసు సేవలను మరింత పారదర్శకంగా, వేగంగా, సమర్థంగా అందించేందుకు తెలంగాణ పోలీసు శాఖ సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా నేర పరిశోధన విభాగం (సీఐడీ) రూపొందించిన ఏడు డిజిటల్ సేవలను డిజిపి సీవీ ఆనంద్ డీజీపీ కార్యాలయంలో ప్రారంభించారు.
పౌరుల అభిప్రాయాల సేకరణకు సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సెంటర్..
పోలీసు సేవలను ఇటీవల వినియోగించుకున్న ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు తెలుసుకునేందుకు సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సెంటర్ (సీఎఫ్‌సీ)ను ఏర్పాటు చేశారు. పిటిషన్లు, ఎఫ్ఐఆర్ల నమోదు, ఈ-చలాన్లు, పాస్‌పోర్టు వెరిఫికేషన్ సేవలపై ప్రజల స్పందనను ఈ కేంద్రం సేకరిస్తుంది.
భరోసా కేంద్రాలకు డిజిటల్ సేవలు..
మహిళా భద్రతా విభాగం రూపొందించిన ‘భరోసా’ సాఫ్ట్వేర్ ద్వారా రాష్ట్రంలోని 35 భరోసా కేంద్రాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. బాధితులకు అందించే కౌన్సెలింగ్, వైద్య, న్యాయ, పునరావాస సేవల వివరాలను నమోదు చేసి, కేసు ప్రారంభం నుంచి ముగింపు వరకు పర్యవేక్షించవచ్చు. కాగితపు రిజిస్టర్లకు బదులుగా రాష్ట్రస్థాయి డ్యాష్‌బోర్డులు, 23 రకాల నివేదికలు అందుబాటులో ఉంటాయి.
సీఐడీకి ప్రత్యేక వెబ్సైట్..
సీఐడీ కార్యకలాపాలు, సేవలకు సంబంధించిన సమాచారం ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు https://cid.tspolice.gov.in/ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
విడుదలైన ఖైదీల నిఘా..
జైళ్ల నుంచి విడుదలయ్యే ఖైదీల సమాచారాన్ని పోలీసులకు సకాలంలో చేరవేసేందుకు జైల్ రిలీజ్ మానిటరింగ్ సిస్టమ్ (జేఆర్ఎంఎస్)ను అందుబాటులోకి తెచ్చారు. ఎన్ఐసీకి చెందిన ఈ-ప్రిజన్స్ వ్యవస్థను సీసీటీఎన్‌ఎస్‌తో అనుసంధానించారు. ఖైదీల విడుదల వివరాలను సంబంధిత పోలీస్స్టేషన్లు, అధికారులకు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయడంతోపాటు రాష్ట్రస్థాయి డ్యాష్‌బోర్డులు, కృత్రిమ మేధ ఆధారిత విశ్లేషణ, ఖైదీల వివరాల శోధనకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. నేర నెట్‌వర్క్‌లను గుర్తించేందుకు, ముందస్తు నిఘాను బలోపేతం చేసేందుకు దోహదపడుతుంది.
15 సెకన్లలో ముఖ గుర్తింపు..
9.8 లక్షలకుపైగా ఫొటోలతో రూపొందించిన మొబైల్ ఫేస్ సెర్చ్ యాప్ ద్వారా సుమారు 15 సెకన్లలో ముఖాలను సరిపోల్చవచ్చు. అనుమానితులు, మృతులు, గుర్తుతెలియని మృతదేహాలు, తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడంలో ఇది ఉపయోగపడుతుంది.
ఫింగర్ ప్రింట్లతో వేగంగా ఆధారాల సేకరణ..
క్రైమ్ సీన్ ఛాన్స్ ప్రింట్ యాప్ ద్వారా నేరస్థలాల్లో లభించే వేలిముద్రలను ఆండ్రాయిడ్ ఫోన్లతోనే సేకరించి, వెంటనే రాష్ట్ర సర్వర్‌కు పంపవచ్చు. అక్కడ ఆటోమేటిక్‌గా సరిపోల్చడం ద్వారా అనుమానితులను గుర్తించేందుకు త్వరితగతిన ఆధారాలు లభిస్తాయి. దేశంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు అధికారులు తెలిపారు.
దర్యాప్తు అధికారులకు మార్గదర్శకాలు..
నేర పరిశోధనలో ప్రమాణాలను మెరుగుపరిచేందుకు 5 సంపుటాల ప్రామాణిక కార్యాచరణ విధానాలను (ఎస్ఓపీలు) రూపొందించారు. శారీరక నేరాలు, ఆస్తి నేరాలు, మహిళలు-పిల్లలపై నేరాలు, ప్రత్యేక-స్థానిక చట్టాలు, ఇతర నేరాలకు సంబంధించి వీటిలో మార్గదర్శకాలు ఉన్నాయి. దర్యాప్తు నాణ్యతను పెంచి, న్యాయస్థానాల్లో నేర నిరూపణ అవకాశాలను మెరుగుపరిచేందుకు ఇవి దోహదపడనున్నాయి.
ఈ డిజిటల్ సేవలతో పోలీసు వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెరగడంతోపాటు ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని అధికారులు పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, ప్రామాణిక దర్యాప్తు విధానాల సమన్వయంతో నేర నియంత్రణ, పరిశోధనను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్‌తోపాటు, డిజి (లా & ఆర్డర్) మహేష్ భగవత్, డిజి (సిఐడి) చారు సిన్హా, ఏడీజీ అకున్ సబర్వాల్, ఐజి (పి&ఎల్) గజరావు భూపాల్, డిఐజిలు నారాయణ నాయక్, పరిమళ హన నూతన్ , ఎస్పీలు విశ్వజిత్ కంపాటి, రూపేష్, ప్రవీణ్ కుమార్, మల్లారెడ్డి , బాలకోటి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


Read Also :
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ బుకింగ్స్ ప్రారంభం.. ఈ శుక్రవారం నుంచే థియేటర్లలో సందడి!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CID Digital Services | సీఐడీలో ఏడు డిజిటల్ సేవలు ప్రారంభం.. జైళ్ల నుంచి విడుదలయ్యే ఖైదీలపై నిఘా
గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ యూనైటెడ్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొండ్రు విజయరావు
Lice | పిల్లలకు తలలో పేలు ఎలా ఏర్పడుతాయి.. తొలగేందుకు ఏం చేయాలి..?
Laxma Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Health tips | పచ్చికొబ్బరి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.. ఎందుకో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

