అంబరాన్నంటిన సద్దులు
అక్కచెల్లెళ్ల కాలి గజ్జెల సవ్వళ్లు.. పిల్లాజెల్లా సందడితో ఊరూరా బతుకమ్మ నెత్తుకొని గడపలన్నీ కదలినయ్.. వాకిళ్లన్నీ పూదోటలైనయ్.. కూడళ్లలో తీరొక్క విరుల జాతరలు జరిగినయ్..
- హోరెత్తిన పెద్ద బతుకమ్మ సంబురాలు.. ఊరూవాడల్లో ఆడిపాడిన ఆడబిడ్డలు
- ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
అక్కచెల్లెళ్ల కాలి గజ్జెల సవ్వళ్లు.. పిల్లాజెల్లా సందడితో ఊరూరా బతుకమ్మ నెత్తుకొని గడపలన్నీ కదలినయ్.. వాకిళ్లన్నీ పూదోటలైనయ్.. కూడళ్లలో తీరొక్క విరుల జాతరలు జరిగినయ్.. గుడులు, బడులు హోరెత్తినయ్.. చెరువూ.. గట్టూ సందడిగ మారినయ్.. చెట్టూపుట్టా పులకించిపోయినయ్.. పల్లె, పట్నం తేడా లేకుండా ఆడబిడ్డల ఆటపాటలతో మార్మోగినయ్.. నింగీనేలా మురిసేలా గాజుల సప్పట్లు.. ఇంపైన పాటలతో సద్దుల బతుకమ్మ సంబురాలను ఆడబిడ్డలు అంబరాన్నంటేలా జరుపుకొన్నారు.
బతుకునిచ్చే బతుకమ్మను అందరొక్కచోట చేరి కొలిచారు. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజించిన గౌరమ్మను చివరి రోజున గంగమ్మ ఒడికి సాగనంపి వాయినాలను ఇచ్చిపుచ్చుకొని పాటల నెమరేతతో ఇండ్లకు కదిలారు. తెలంగాణ నుదుట సిందూరం.. ఆడబిడ్డల ఆత్మగౌరవ సంరంభం.. సాంస్కృతిక వైభవం.. ప్రకృతిని ఆరాధించే పర్వమైన ‘పెద్ద బతుక మ్మ’ ఉత్సవాలు.. ఎంగిలిపూలతో మొదలై ఎన్నో మధురానుభూతులను ‘సద్దులు’ కట్టిచ్చి ఆదివారం ఘనంగా ముగిసినయ్.
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : పుడమి పూలవనమైంది. సద్దుల బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై తొమ్మిదిరోజుల పాటు సాగిన పూల పండుగ ఆదివారం సద్దులతో వైభవంగా ముగిసింది. తీరొక్క రంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో ఆలయాలు, కూడళ్లు, చెరువు, కాలువల గట్ట వద్దకు చేరుకొని ఆడబిడ్డలు ఆడిపాడారు. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో’ అంటూ ఊరూరా బతుకమ్మ పాటలతో హోరెత్తించారు.
అనంతరం వాగులు, చెరువుల్లో నిమజ్జనం చేశారు. ‘పోయిరా గౌరమ్మ పోయిరావమ్మ.. మళ్లొచ్చే ఏడాదికి తిరిగి రావమ్మ’ అంటూ వీడ్కోలు పలికిన మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. హనుమకొండలోని పద్మాక్షి గుట్ట, వడ్డేపల్లి చెరువు, వరంగల్‌లోని చిన్నవడ్డేపల్లి చెరువు, రంగలీలా మైదానం, జనగామలోని బతుకమ్మ కుంట, జయశంకర్ భూపాలపల్లిలోని అంబేద్కర్ స్టేడియం, మహబూబాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం, ములుగులోని మినీ ట్యాంక్‌బండ్‌తో వద్ద నిర్వహించిన వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనగా, ఆయా ప్రాంతాలు పూలవనాలను తలపించాయి. కాగా, పలుచోట్ల ప్రభుత్వం బతుకమ్మ పండుగ కోసం విద్యుద్దీపాలు ఏర్పాటుచేయకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
సాగర తీరాన సర్కార్ బతుకమ్మ
హుస్సేన్‌సాగర్ తీరాన ట్యాంక్‌బండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. ఆటాపాటలు.. కళాకారుల సాంసృతిక ప్రదర్శనలు.. లేజర్ షో, బాణసంచా వెలుగులతో ఆ ప్రాంతమంతా ధగధగా మెరిసిపోయింది. ఎటుచూసినా పండుగ సందడే కనిపించగా, నగరవాసులు ఉత్సాహంగా సంబురాల్లో పాల్గొన్నారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు, యువతులు, చిన్నారులు సంప్రదాయబద్ధంగా ఆడిపాడారు. బతుకమ్మ పాటలు, కోలాటంతో పరిసరాలన్నీ మార్మోగాయి. గవర్నర్ సతీమణి జానకి, మంత్రి సీతకతోపాటు ప్రముఖ సినీనటులు రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ దంపతులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివిధ వేదికలపై కళాకారులు ప్రదర్శించిన సాంసృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. లేజర్‌షో, బాణసంచా కాంతులు ఆకాశంలో రంగుల హరివిల్లును ఆవిషరించాయి.








Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

