హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): 80 ఏండ్ల వృద్ధుడికి అత్యంత అరుదైన రివర్స్ ఆర్థోప్లాస్టీ చికిత్సను విజయవంతంగా నిర్వహించిన ఘనత సాధించారు గాంధీ దవాఖాన వైద్యులు. ప్రైవేట్‌లో రూ.10 లక్షలు వసూలు చేసే ఈ ఆపరేషన్‌ను ఉచితంగా నిర్వహించారు. వరంగల్ జిల్లా శాయంపేటకు చెందిన టీ లక్ష్మయ్య ఏడాది కాలంగా కుడి భుజాన్ని పైకి, కిందకు కదపలేకపోతున్నాడు. కుడి చేతిని కదిలించలేకపోతున్నాడు. ప్రైవేట్ దవాఖానల చుట్టూ తిరిగినా ఫలితం లేక, గాంధీ దవాఖానను ఆశ్రయించాడు.
ఈ కేసును చాలెంజ్‌గా స్వీకరించిన ఆర్థోపెడిక్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ వాలియా.. రోగికి వైద్య పరీక్షలు నిర్వహించారు. పదేండ్ల క్రితం భుజానికి తగిలిన గాయమే ఈ దుస్థితికి కారణమని గుర్తించారు. రొటేటరీ కఫ్ దెబ్బతినడం వల్ల లక్ష్మయ్య తన భుజాన్ని కదపలేకపోతున్నాడని నిర్ధారించారు. దీంతో ఈ నెల 15న రోగికి ‘రివర్స్ ఆర్థోప్లాస్టీ’ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రభుత్వరంగ దవాఖానలో ఈ తరహా ఆపరేషన్ నిర్వహించడం ఇదే తొలిసారి అని, హైదరాబాద్‌లోని ఒకట్రెండు కార్పొరేట్ దవాఖానల్లో మాత్రమే ఈ చికిత్స అందుబాటులో ఉన్నదని డాక్టర్ వాలియా తెలిపారు. లక్ష్మయ్య ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని చెప్పారు.
పాకుతూ వచ్చి.. నడుస్తూ వెళ్లింది
జువైనల్ రుమటైడ్ ఆైర్థ్రెటిస్తో బాధపడుతూ.. నాలుగడుగులు కూడా నడవలేక.. నేల మీద పాకుతూనే వచ్చిన 16 ఏండ్ల యువతికి సాధారణ జీవితం ప్రసాదించారు గాంధీ వైద్యులు. ఇటీవల దివ్య అనే యువతికి రెండు మోకాళ్లు, రెండు తుంటి కీళ్లను విజయవంతంగా మార్పిడి చేసినట్టు డాక్టర్ వాలియా తెలిపారు. ఈ శస్త్ర చికిత్సకు ప్రైవేట్ దవాఖానల్లో రూ.25 లక్షల వరకు వసూలు చేస్తారని, అయితే సీఎం రిలీఫ్‌ఫండ్ ద్వారా రూ.7 లక్షలతో ఇంప్లాట్స్ సమకూర్చి ఆపరేషన్ చేసినట్టు వివరించారు. ఇప్పుడు ఆ యువతి సాధారణ జీవితాన్ని గడపడమే కాకుండా ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నదని చెప్పారు. ఈ విధంగా గాంధీలో ప్రభుత్వ సహకారంతో అరుదైన, ఖరీదైన శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ నిరుపేదలకు ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా వారికి కొత్త జీవితాన్ని ఇవ్వగలుగుతున్నామని సంతోషం వ్యక్తంచేశారు.
రివర్స్ ఆర్థోప్లాస్టీ అంటే
భుజం అటూ ఇటూ కదలడానికి కీలు లోపల ఒక బాల్, ఒక సాకెట్ ఉంటుంది. బాల్ ఫ్రీగా తిరగడానికి సాకెట్ ఉపయోగపడుతుంది. దీనివల్ల మనిషి తన భుజాన్ని, చేతిని ఫ్రీగా తిప్పగలుగుతాడు. బాల్, సాకెట్ దెబ్బతిన్నప్పుడు వ్యతిరేక పద్ధతిలో ఇంప్లాంట్స్‌ను వేస్తారు. బాల్ స్థానంలో సాకెట్‌ను, సాకెట్ స్థానంలో బాల్‌ను అమర్చి చికిత్స చేస్తారు. ఇది వినూత్నమైన బయోటెక్నిక్. ఈ శస్త్రచికిత్స చాలా అరుదైనది. ఖరీదైనది. అనుభవజ్ఞులు మాత్రమే ఈ శస్త్ర చికిత్స చేయగలుగుతారని డాక్టర్ వాలియా వివరించారు.