HomeTelanganaRemove Hitler And Hydra Posts Csb Department Asks X
హిట్లర్, హైడ్రా పోస్టులు తొలగించండి.. ఎక్స్‌ను కోరిన సీఎస్బీ విభాగం
ప్రపంచ నియంత హిట్లర్ తనకు స్ఫూర్తి అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకొన్నది.
కార్టూన్లు, వాటి ఫొటోలనూ డిలిట్ చేయాల్సిందే..
పలువురికి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ప్రపంచ నియంత హిట్లర్ తనకు స్ఫూర్తి అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకొన్నది. సోషల్ మీడియా వేదికగా వస్తున్న అనూహ్యమైన వ్యతిరేకతను కప్పిపుచ్చుకొనేందుకు ఏకంగా పోలీసులను రంగంలోకి దించింది. సీఎంకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని, అందుకు సంబంధించిన పదాలు, పోస్టర్లు, ఫొటోలు, కార్టూన్లను తొలగించాలని ‘ఎక్స్’ యాజమాన్యానికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) ద్వారా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నోటీసులు పంపింది.
‘హైడ్రా’ అనే పదం హిట్లర్‌కు అత్యంత ఇష్టమైన పదమని ఆ కాంక్లేవ్‌లో చెప్పుకొచ్చిన రేవంత్‌రెడ్డి.. హైడ్రా ప్రేరణగా ఎన్నో ఇండ్లు కూల్చివేతలు చేస్తున్నట్టు కూడా చెప్పారు. కావాలంటే గూగుల్‌లో చూసుకోవాలని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా పోస్టులకు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
క్రిశాంక్ పోస్టును ఉదహరించిన సీఎస్బీ
ఒక ప్రజాప్రతినిధిని కించపరిచేలా ఉన్న వివాదాస్పద వీడియోను తక్షణమే బ్లాక్ లేదా టేక్‌డౌన్ (తొలగించడం) చేయాలని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ సంస్థకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ ఇచ్చిన నోటీసుల్లో ఆదేశించింది. సీఎస్బీ ఎస్పీ హర్షవర్ధన్ పేరిట జూన్ 7న ఈ అధికారిక నోటీసు జారీ అయింది. అమెరికా టెక్సాస్‌లో గల ఎక్స్ కార్పొరేషన్ లీగల్ పాలసీ విభాగానికి ఈ ఆదేశాలు పంపారు. ఇందులో బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ (Krishank_BRS) ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఒక వీడియో లింక్‌ను సీఎస్బీ పంపిన నోటీసులో ప్రత్యేకంగా ప్రస్తావించారు.