హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 క్యాటగిరీలో డీఎస్పీ పోస్టులకు రెండేండ్ల వయోపరిమితి పెంచుతున్నట్టు టీఎస్పీఎస్సీ పేర్కొన్నది. గతంలో అర్హత 31 సంవత్సరాలు ఉండగా, ప్రభుత్వ తాజా నిర్ణయంతో 33 సంవత్సరాల అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్-1 కింద భర్తీచేసే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులకు ఈ వయోపరిమితి సడలింపు వర్తించనున్నది. ఎత్తులో కూడా సడలింపు ఇచ్చారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకు గతంలో 167.6 సెంటీమీటర్ల ఎత్తు ఉండాల్సి ఉండగా దాన్ని ప్రస్తుతం 165 సెంటీమీటర్లకు కుదించారు. మహిళలకు గతంలో 152.5 సెంటీమీటర్లు ఉండగా.. దాన్ని 150 సెంటీమీటర్లకు తగ్గించారు. వయోపరిమితిలో రెండేండ్ల సడలింపుతో దరఖాస్తులు పెరుగుతాయని టీఎస్పీఎస్సీ భావిస్తున్నది.