Rains | హైదరాబాద్ : తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈనెల 9 వరకు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతం నుంచి దక్షిణ ద్వీపకల్ప భారతదేశం, అలాగే బంగాళాఖాతంపై ద్రోణి వరకు బలమైన తూర్పు, ఈశాన్య గాలుల ప్రభావంతో రానున్న రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
నాగర్‌కర్నూలు, వనపర్తి, జోగులాంబ-గద్వాల్, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అదే సమయంలో రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పగలు ఎండలు మండిపోతుండగా, రాత్రిళ్లు, ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 16.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.