ఖమ్మం కమాన్‌బజార్, అక్టోబర్ 8 : రాబోయే ఖమ్మం – నల్లగొండ – వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం కోసం శ్రేణులన్నీ నడుం బిగించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఖమ్మంలో గురువారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీందర్‌రావుతో కలిసి పువ్వాడ మాట్లాడారు. ఖమ్మం నియోజకవర్గంలో 28,500 గ్రాడ్యుయేట్ ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఓట్ల పర్యవేక్షణకు 325 మంది సమన్వయకర్తలను నియమించామని తెలిపారు. డివిజన్లవారీగా పట్టభద్రుల ఓట్ల నమోదు కోసం క్యాంపులు నిర్వహించాలని సూచించారు.
ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, వైద్యులు, న్యాయవాదులు, బ్యాంక్ ఉద్యోగులు, డిగ్రీ పూర్తి చేసి మూడేండ్లు పూర్తయిన వారిని కలిసి ఓటర్లుగా నమోదు చేయించాలని తెలిపారు. ఈ సందర్భంగా అజయ్‌కుమార్ తన గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేసుకున్నారు. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఖమ్మం నియోజకవర్గం నుంచే అత్యధికంగా ఓట్లు పోలయ్యాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీందర్రావు గుర్తుచేశారు. ఈ పట్టభద్రుల ఎన్నికలే రాబోయే మున్సిపల్ కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలకు నాంది అని పేర్కొన్నారు.