హైదరాబాద్‌సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరంతోపాటు రాష్ట్రంలోని పలుచోట్ల గ్యాస్ ఏజెన్సీలు, మధ్యవర్తుల బ్లాక్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది. గల్ఫ్ యుద్ధ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరత చాటున ఈ బ్లాక్ దందాకు తెరలేపారు. కృత్రిమ కొరతను చూపిస్తూ ఏకంగా గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి.
ఇటు గృహ, అటు వాణిజ్య గ్యాస్ సిలిండర్లపై కాసులు కురిసేలా కుట్రలు చేస్తున్నాయి. నో స్టాక్ బోర్డులు చూపించి ఒక్కో సిలిండర్‌ను నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఒక్క సిలిండర్‌పై అదనంగా రూ.2 వేల వరకు వసూలు చేస్తే.. వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు గుంజుతున్నారు. ఇదేమిటని అడిగిన వారికి నో స్టాక్ బోర్డులు చూపించి వచ్చేంత వరకూ వేచి ఉండాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు.
ఎవరైతే బ్లాక్ మార్కెట్ ధరలను అంగీకరిస్తారో వారికి అదే రోజున ఇంటికి, హోటల్‌కు గ్యాస్ సిలిండర్లు చేరిపోతున్నాయి. బుకింగ్ చేసుకున్నాం కదా.. గ్యాస్ ఇంటికే వస్తదని ఎదురుచూస్తున్న వినియోగదారులకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. తాము బుక్ చేసుకొని 10 రోజులు గడుస్తున్నా గ్యాస్ సిలిండర్ రాలేదని ఏజెన్సీలను సంప్రదించినా ఫలితం ఉండటం లేదు. కనీసం ఏజెన్సీల టోల్ ఫ్రీ నంబర్లు కూడా పనిచేయకపోవడం గమనార్హం.
నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా గృహ, కమర్షియల్ గ్యాస్ కొరత తీవ్రంగా మారడంతో గ్యాస్ బ్లాక్ దందా కొనసాగుతున్నది. గ్యాస్ సిలిండర్ల కోసం హోటల్ యజమానులు, హాస్టల్, మెస్ నిర్వాహకులు ఏజెన్సీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకేరోజు సిలిండర్ కావాలంటే అధిక ధరలు వసూలు చేస్తున్నారని హైదరాబాద్‌కు చెందిన ప్రమీల అనే మహిళ ఆవేదన వ్యక్తంచేశారు.
నగరంలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.1,800 ఉండగా, రెండురోజుల క్రితం రూ.114 పెరిగింది. కొందరు డీలర్లు తాజాగా అదే సిలిండర్‌ను బ్లాక్ మార్కెట్లో రూ.5,000 వరకు విక్రయిస్తున్నారని నారాయణ అనే వ్యక్తి తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, ఆహార సంస్థల అవసరాలను తీర్చడానికి నగరంలో 6.5 లక్షల వరకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల వినియోగం ఉండగా, రోజూ దాదాపు 20 వేల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లు అవసరమవుతాయని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.
కొన్ని పెద్ద హోటళ్లు కొన్ని వారాలకు సరిపడా నిల్వ చేసుకొన్నప్పటికీ చిన్నతరహా హోటళ్లను మాత్రం మూసివేయక తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయి. కొందరు డిస్ట్రిబ్యూటర్లు మధ్యవర్తులను రంగంలోకి దించి గ్యాస్ సిలిండర్లను అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారని వినియోగదారులు చెప్తున్నారు. వినియోగదారులను మధ్యవర్తులే ఆశ్రయించి తాము సిలిండర్ ఇప్పిస్తామని అడిగినంత ఇవ్వాలని బేరం కుదుర్చుకుంటున్నారు.