హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ): హెల్త్‌కేర్ సిస్టమ్‌కు నర్సులు వెన్నెముక వంటివారని స్టార్ హాస్పిటల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ గుడిపాటి అన్నారు. గురువారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని స్టార్ హాస్పిటల్లో పలు కార్యక్రమాలను నిర్వహించారు. నిత్యం బిజీగా ఉండే నర్సులు.. డ్యాన్స్, సింగింగ్, ఆర్ట్ గ్యాలరీ తదితర యాక్టివిటీస్‌తో సందడి చేశారు. పలు అంశాల్లో ప్రతిభ కనబర్చిన నర్సింగ్ సిబ్బందికి బహుమతులు అందజేశారు. దవాఖాన ఎండీ డాక్టర్ గోపీచంద్ మన్నెం నర్సింగ్ విభాగానికి వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. సానుభూతి, నిజాయితీ, కమ్యూనికేషన్ అనేవి ఆదర్శవంతమైన నర్సుకు ఉండాల్సిన మూడు ప్రధాన లక్షణాలని వీడియోలో పేర్కొన్నారు. డాక్టర్ రమేశ్ మాట్లాడుతూ నర్సులు ఎన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ రోగులకు నిస్వార్థంగా సేవలు చేస్తారని చెప్పారు. స్టార్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఆంథోనీ మాట్లాడుతూ నర్సింగ్ సిబ్బంది రోగుల జీవితంలో సంతోషాన్ని నింపే దేవదూతలని కొనియాడారు. కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ ఎస్ కవిత, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.