వరంగల్ చౌరస్తా, ఫిబ్రవరి 28: యూజీ ఆయుష్ వైద్యవిద్య సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ స్ట్రే వెకెన్సీ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహణకు, తెలంగాణలోని ప్రైవేట్ హోమియోపతి కళాశాలలో బీహెచ్ఎంఎస్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఆయుష్ కళాశాలల్లో హోమియోపతి (బీహెచ్ఎంఎస్), ఆయుర్వేద (బీఏఎంఎస్), యునాని (బీయూఎంఎస్), నేచురోపతి-యోగా (బీఎన్వైసీ) కోర్సుల్లో మిగిలిపోయిన కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మరో ప్రకటన జారీ చేసినట్టు వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం 2 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. తుది మెరిట్ జాబితాలో అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.
బీహెచ్ఎంఎస్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి నీట్ 2022 అర్హత సాధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులు మార్చి 2వ తేదీ సాయంత్రం 4 వరకు ఆన్లైన్లో సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సీట్ల కేటాయింపునకు మార్చి 4వ తేదీ సాయంత్రం 4 వరకు ఆసక్తిగల కళాశాలల్లో నేరుగా సంప్రదించాల్సి ఉంటుందని తెలిపారు.