హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18(నమస్తే తెలంగాణ) : దేవాదాయ శాఖ కార్యాలయంలో రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ చైర్మన్‌కు సీటు లేదు. కేసీఆర్ హయాంలో ఏర్పాటుచేసిన బ్రాహ్మణ పరిషత్‌ను బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలోనే కొనసాగిస్తుండగా, అక్కడ చైర్మన్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన చాంబర్లో వేరొకరు కూర్చోవడం సమస్యాత్మకంగా మారింది. పరిషత్ కార్యాలయంలో తనకు ఉండాల్సిన చైర్మన్ చాంబర్లో వేరొకరు కూర్చొని ఉండటంతో కొత్తగా నియమితులైన చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ అధికారికంగా తన కార్యాలయానికి వచ్చి బాధ్యతలు చేపట్టలేదు.
గత రెండేండ్లుగా బ్రాహ్మణ పరిషత్ కమిటీని నియమించకపోగా, చైర్మన్ పదవికి ఎవరినీ ఎంపిక చేయకపోవడంతో ఆ చాంబర్ ఖాళీగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్తగా రాష్ట్ర ధార్మిక సలహాదారు పదవిని సృష్టించి ఆ పోస్టులో గోవిందహరిని నియమించింది. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ చాంబర్ ఖాళీగా కనిపించడంతో దానినే ఆయన తన కార్యాలయంగా మార్చుకున్నారు. పరిషత్ చైర్మన్‌కు కేటాయించిన సీట్లో కూర్చుంటూ రాష్ట్రంలోని దేవాలయాల ధార్మిక స్థితిగతులను పర్యవేక్షిస్తున్నారు. గతవారం ప్రభుత్వం బ్రాహ్మణ పరిషత్ చైర్మన్‌గా బసవరాజు శ్రీనివాస్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. బ్రాహ్మణ పరిషత్ కార్యాలయానికి వెళ్లిన ఆయనకు అక్కడ చాంబర్ లేదనే విషయం తెలిసింది.
దీంతో నాగోల్‌లోని ఓ ఫంక్షన్హాల్లో బ్రాహ్మణ సంఘాల నేతృత్వంలో జరిగిన శ్రీనివాస్ అభినందన సభలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు సమక్షంలో అదే వేదికపై పదవీ బాధ్యతలను కూడా స్వీకరించారు. తన కార్యాలయానికి వెళ్లి అక్కడ అధికారికంగా బాధ్యతలు స్వీకరించాల్సిన చోట ప్రత్యేక చాంబర్ లేకపోవడంతో ఇదే సభలో చైర్మన్‌గా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చిందని కొందరు బ్రాహ్మణ సంఘాల నేతలు చెప్తున్నారు. దేవాదాయ శాఖలో తన చాంబర్లో గోవిందహరి కూర్చొని తనకు చాంబర్ లేకుండా చేయడంపై బసవరాజు శ్రీనివాస్ కొంత అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ విషయం దేవాదాయ శాఖ ముఖ్యులకు తెలియడంతో బ్రాహ్మణ పరిషత్ చైర్మన్‌కు మరో చాంబర్‌ను సిద్ధంచేస్తున్నట్టు తెలిసింది. గోవిందహరి మాత్రం తాను ఉంటున్న చాంబర్‌ను వదలడానికి ఇష్టపడకపోవడంతో చైర్మన్‌కు వేరే గదిని ఏర్పాటు చేసే దిశగా దేవాదాయ శాఖ వర్గాలు సిద్ధమయ్యాయి. ఈ నెల 21వ తేదీలోగా గది కేటాయింపు పూర్తవుతుందని, తాను అక్కడినుంచే తన కార్యకలాపాలు కొనసాగించే అవకాశం ఉన్నదని బసవరాజు శ్రీనివాస్ తెలిపారు.