హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) అరుదైన ఘనత సాధించనున్నది. భారత సైన్యానికి ఆకాశ్ వెపన్ సిస్టమ్‌ను తయారుచేసే బాధ్యతను చేపట్టింది. రూ.8,161 కోట్ల విలువైన ఆకాశ్ వెపన్ రూపకల్పనకు ఢిల్లీలోని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖతో బీడీఎల్ ఒప్పందం కుదుర్చుకున్నది. భారత సైన్యంలోని రెండు రెజిమెంట్ల కోసం, మూడేండ్ల కాలపరిమితితో ఒప్పందం చేసుకున్నది. అదనంగా బీడీఎల్ ఎంఎల్‌హెచ్ హెలికాప్టర్లకు, కౌంటర్ మెజర్స్ డిస్పెన్సింగ్ సిస్టమ్ (సీఎమ్డీఎస్) కోసం మరో రూ.261 కోట్ల ఆర్డర్‌ను సైతం బీడీఎల్ పొందింది.
ఈ కొత్త ఒప్పందంపై సంతకం చేయడంతో బీడీఎల్ కంబైన్డ్ ఆర్డర్ బుక్ స్థానం ఇప్పుడు సుమారుగా రూ.24,021 కోట్లకు చేరుకున్నది. బీడీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కమోడోర్ సిద్ధార్థ్ మిశ్రా (రిటైర్డ్) కొత్త ఒప్పందంపై సంతకం చేశారు. దేశీయ, అంతర్జాతీయ మారెట్ల నుంచి స్వీకరించిన కొత్త ఆర్డర్లు, అత్యాధునిక ఉత్పాదక సౌకర్యాల స్థాపన, సాయుధ దళాల కోసం కొత్త ఉత్పత్తులను ఆవిషరించనున్నట్టు మిశ్రా తెలిపారు.