సీఎంవోపై మంత్రుల గుర్రు!
సంక్షేమ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన టెండర్ల వ్యవహారంలో ముఖ్యమంత్రి కార్యాలయ జోక్యం ఆయా శాఖల మంత్రులకు ఆగ్రహం తెప్పించినట్టు తెలుస్తున్నది.
- గురుకుల టెండర్లతో ముసలం
- ముదురుతున్న కమీషన్ల పంచాయితీ
- సీఎం కనుసన్నల్లోనే పూర్తి వ్యవహారం
- కీలకమైన ఉన్నతాధికారిపై ఆగ్రహం
హైదరాబాద్, అక్టోబర్15 (నమస్తే తెలంగాణ): సంక్షేమ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన టెండర్ల వ్యవహారంలో ముఖ్యమంత్రి కార్యాలయ జోక్యం ఆయా శాఖల మంత్రులకు ఆగ్రహం తెప్పించినట్టు తెలుస్తున్నది. ఈ వ్యవహారాలన్నీ కొనసాగిస్తున్న సీఎంవోలోని ఓ ఉన్నతాధికారి తమను బేఖాతరు చేయడంపై వారు రగిలిపోతున్నట్టు సమాచారం.
నిజానికి ముఖ్యమంత్రే చక్రం తిప్పుతున్నారని, ఆయనను ఎదిరించలేక మంత్రులు సదరు ఉన్నతాధికారిపై గురిపెట్టినట్టు మరో వాదన వినిపిస్తున్నది. ఈ మొత్తం వ్యవహారంలో చేతులు మారిన కమీషన్లు తమ వరకూ రాకపోగా.. తమ శాఖల్లో జరుగుతున్న వ్యవహారం గురించి కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వకపోవడంపై సదరు మంత్రులు భగ్గుమంటున్నట్టు తెలుస్తున్నది.
కమీషన్ల పంచాయతీనే కారణం..
రాష్టంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాలతోపాటు, సంక్షేమ హాస్టళ్లు, కస్తూర్బా విద్యాలయాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆయా విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ప్రతి సంవత్సరం పుస్తకాలు, యూనిఫామ్స్, స్టేషనరీ, దుప్పట్లు, బూట్లు, సాక్సులు మొత్తంగా 24రకాల వస్తువులను ప్రభుత్వమే అందిస్తున్నది. ఆయా వస్తువుల సప్లయ్ కోసం ఈ ఏడాది సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ నేతృత్వంలో అన్ని గురుకుల సొసైటీల కార్యదర్శులతో ప్రత్యేకంగా ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ)ను ఏర్పాటుచేసింది. దానికే ధరల ఖరారు, టెండర్ ప్రక్రియను అప్పగించింది.
బుక్స్ స్టేషనరీకి సంబంధించి దాదాపు రూ.1200 కోట్ల వర్క్ఆర్డర్, ఫుడ్ ప్రొవిజన్ (కిరాణా సామగ్రి) వర్క్ఆర్డర్ దాదాపు రూ.800 కోట్లు మొత్తంగా రూ.2 వేల కోట్ల ఆర్డర్‌ను పీఎంయూనే నిర్వహించింది. ఈ వ్యవహారం మొత్తం సీఎంవోలోని ఓ ఉన్నతాధికారి, మరికొందరు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కొనసాగింది. వారే చక్రం తిప్పి అధిక ధరలకు గుజరాత్ కంపెనీలకు, మరికొందరు తమ అనుయాయులకు కట్టబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రక్రియలో సంక్షేమశాఖలకు నేతృత్వం వహిస్తున్న మంత్రులు, అధికారులెవరికీ కనీస సమాచారం కూడా ఇవ్వలేదని తెలుస్తున్నది.
రూ.2,000 కోట్ల వ్యవహారంలో తమను పట్టించుకోకపోగా, కనీస సమాచారమివ్వకపోవడంపై ఆ శాఖల మంత్రులు ఇప్పటికే పూర్తిగా రగిలిపోతున్నట్టు సమాచారం. టెండర్లకు సంబంధించిన పూర్తి సమాచారమివ్వాలని పదేపదే సీఎంవోలోని ఉన్నతాధికారిపై ఇద్దరు మంత్రులు ఒత్తిడి తీసుకువచ్చినా జవాబు ఇవ్వకపోగా, ఆ అధికారిని ఒత్తిడి చేయవద్దని రివర్స్‌లో మంత్రులకే సీఎంవో వర్గాలు హుకుం జారీచేసినట్టు తెలిసింది. ఆ ఉన్నతాధికారి సైతం టెండర్ల అంశాన్ని పూర్తిగా తామే చూసుకుంటామని మంత్రుల మొఖం మీదే చెప్పగా వారు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారని తెలుస్తున్నది. దీనంతటికీ అసలు కారణం కమీషన్ల పంచాయతీనేనని తెలుస్తున్నది.
ముఖ్యమంత్రే సూత్రధారి..
ఈ టెండర్ల వ్యవహారంలో మొత్తంగా చక్రం తిప్పింది ముఖ్యమంత్రేనని సమాచారం. కాగా నిందలు తమపై పడుతున్నాయని మంత్రులు తీవ్రంగా రగిలిపోతున్నారు. వాస్తవంగా వర్క్ ఆర్డర్లను దక్కించుకున్న ఏజెన్సీలు 45 రోజుల్లో సరుకులను పూర్తిస్థాయిలో సప్లయ్ చేయాలి. కానీ వర్క్ఆర్డర్ అప్పగించి రెండు నెలలు గడిచిపోయినా కనీసం 50 శాతం కూడా సప్లయ్ కాలేదు. మరోవైపు సప్లయ్ చేస్తున్న యూనిఫామ్స్, బూట్లు, సాక్సులు నాణ్యతలేనివని, సైజులు కూడా విద్యార్థులకు సరిపోయేవి కావని ఆరోపణలు వస్తున్నాయి. కిరాణా సామగ్రి ఇప్పటికీ పూర్తిగా సప్లయ్ కాలేదు. టెండర్లను చక్కబెట్టిన సదరు ఉన్నతాధికారిని ఉపేక్షిస్తూ.. నాణ్యతాలోపాలపై తిరిగి సంక్షేమశాఖల అధికారులనే బాధ్యులను చేస్తుండడం కొత్త వివాదానికి దారితీసింది.
ఇది సదరు మంత్రులకు మరింత ఆగ్రహం తెప్పించినట్టు సమాచారం. తాజాగా సంక్షేమశాఖల పరిధిలోని ఇతర వ్యవహారాల్లోనూ సీఎంవో వర్గాలు వేలుపెడుతుండటంపై మంత్రులు మరింతగా రగిలిపోతున్నారని తెలిసింది. కుట్టుమిషన్ల టెండర్లు, ఎస్సీ అభివృద్ధిశాఖలో ఉపాధి శిక్షణకు సంబంధించిన వర్క్‌ఆర్డర్లను నేరుగా కొందరు అనుయాయులకు కట్టబెట్టేందుకు సీఎం సన్నిహిత నేతలు, సదరు ఉన్నతాధికారి పావులు కదుపుతున్నట్టు సమాచారం. నిరుద్యోగ అభ్యర్థుల ఉచిత శిక్షణకు సంబంధించి కొందరికి మొబిలైజేషన్ అడ్వాన్స్‌లను సైతం చెల్లించినట్టు తెలిసింది. ఈ వ్యవహారం తెలిసి ఆయాశాఖల మంత్రులు నిప్పులు చెరుగుతున్నట్టు సమాచారం. పేరుకే శాఖలు తమ వద్ద ఉన్నాయి తప్ప వ్యవహారాలన్నీ సీఎం కార్యాలయం నుంచి కొనసాగుతున్నాయని వాపోతున్నట్టు చెప్పుకొంటున్నారు.
సీఎంను ఎదిరించలేక.. ఉన్నతాధికారిపైనే గురి
సీఎం ఒంటెత్తు పోకడలను ఎదిరించలేని అసహాయస్థితిలో ఉన్న మంత్రులు సదరు ఉన్నతాధికారిపై గురిపెట్టినట్టు ఆయా శాఖల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సదరు ఉన్నతాధికారిపై ఇటీవల కొన్ని పత్రికల్లో వరుసగా కథనాలు ప్రచురితమవుతున్నాయి. అవినీతి పరాకాష్టకు చేరిందని, ఉన్నతాధికారి ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్నారని, మంత్రులు సైతం సదరు ఉన్నతాధికారిపై గరం అవుతున్నారనేది వాటి సారాంశం. అయితే ఆ కథనాల వెనుక సదరు మంత్రులే ఉన్నారని చెప్పుకొంటున్నారు.
ఇదిలాఉండగా, టెండర్ల వ్యవహారంలో వందల కోట్ల కుంభకోణం జరిగిందని, వర్క్ ఆర్డర్, చేసుకున్న అగ్రిమెంట్లకు, క్షేత్రస్థాయిలో సరఫరా అవుతున్న వస్తువులకు, నాణ్యత ప్రమాణాలకు ఏమాత్రం పొంతన లేదని ఆరోపణలు వస్తున్నాయి. థర్డ్ గ్రేడ్ సరుకులను సరఫరా చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో అవినీతి వ్యవహారం నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వ పెద్దలే సదరు ఉన్నతాధికారిని బదనాం చేసేందుకు సిద్ధపడినట్టు తెలుస్తున్నది. తెరవెనుక ఉండి వ్యవహారం చక్కబెట్టించి, కోట్లు కొల్లగొట్టి ఇప్పుడు జారుకునేందుకు సిద్ధమయ్యారని అధికారవర్గాల్లో చర్చ జరుగుతున్నది. మొత్తంగా టెండర్ల వ్యవహారం చిలికిచిలికి గాలివానగా మారుతున్నదని తెలుస్తున్నది.
శాఖల పర్యవేక్షణ గాలికి
మంత్రులు పూర్తిగా టెండర్ల వ్యవహారం, కమీషన్ల పంచాయతీపైనే దృష్టి పెడుతున్నారని విమర్శలున్నాయి. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమశాఖల్లో పాలన పూర్తిగా గాడితప్పింది. ఇన్చార్జుల పాలనే కొనసాగుతున్నది. విద్యార్థులు, ఉద్యోగులకు సంబంధించి అనేక సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయి ఉన్నాయి. అదీగాక పలువురు ఉన్నతాధికారులు ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకోవడం పరిపాటిగా మారిందని ఆయా శాఖల ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. ప్రమోషన్లు, పోస్టింగ్‌లలో అవినీతి రాజ్యమేలుతున్నదని విమర్శిస్తున్నారు. మంత్రులు సమీక్షలకే పరిమితమవుతున్నారు తప్ప సమస్యలు పరిష్కారం కావడం లేదని నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వ పెద్దలు కమీషన్ల పంచాయతీలోనే మునిగితేలుతూ శాఖల పర్యవేక్షణను పూర్తిగా గాలికివదిలేశారని మండిపడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

