మూడేండ్లకే ఆమె బిలియనీర్స్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు అనుముల కొండల్‌రెడ్డి తనకు మెమోరీ లాస్ ఉన్నదని చెప్పి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టిండు. హెడీఎఫ్సీ బ్యాంకు వాళ్లు 2023లో లోన్ కట్టలేదని కొండల్‌రెడ్డి ఇంటికి నోటీసులు పంపిండ్రు.
- వేల కోట్లకు పడగలెత్తిన అనుముల ఫ్యామిలీ
- అధికార దుర్వినియోగంలో ‘ఆదర్శ కుటుంబం’
- 2023లో రూ.2 కోట్ల ఇంటి రుణం చెల్లించలేని స్థితి
- బ్యాంకు నోటీసు అందుకున్న అనుముల కొండల్‌రెడ్డి
- నేడు కోకాపేటలో లగ్జరీ టవర్స్ నిర్మిస్తున్న బిగ్ బ్రదర్స్
- వాటి ధర పెంచేందుకు 100 ఫీట్ల రోడ్డు రూటు మార్పు
- డొల్ల కంపెనీలతో వందల కోట్ల భూములు స్వాహా
- పన్ను ఎగవేత కేసు నుంచి తప్పించుకునేందుకు
- అనుముల కొండల్‌రెడ్డి ‘మెమోరీ లాస్’ నాటకాలు
- బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ సంచలన వ్యాఖ్యలు
- మెమోరీలాస్ ఉన్నోడి కంపెనీకి 200 కోట్ల సర్కార్ భూమి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు అనుముల కొండల్‌రెడ్డి తనకు మెమోరీ లాస్ ఉన్నదని చెప్పి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టిండు. హెడీఎఫ్సీ బ్యాంకు వాళ్లు 2023లో లోన్ కట్టలేదని కొండల్‌రెడ్డి ఇంటికి నోటీసులు పంపిండ్రు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదని కొండల్రెడ్డిపై 2025, నవంబర్ 26న ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ కేసు వేసిండ్రు. అప్పుడు కొండల్‌రెడ్డి తనకు మెమోరీ లాస్ ఉన్నదని కోర్టుకు చెప్పి తప్పించుకున్నడు. అయితే మెమోరీ లాస్ సర్టిఫికెట్ ఇచ్చింది ఎవరో కాదు.. రోజూ వార్తల్లో నిలుస్తున్న మెడికవర్ హాస్పిటల్! ఇలాంటి మెమోరీ లాస్ ఉన్నవాడికి టెస్సెరాక్ట్ సంస్థ పేరిట రూ.200 కోట్ల ప్రభుత్వ భూమిని కట్టబెట్టిండు రేవంత్‌రెడ్డి!
-బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్
(స్పెషల్ టాస్క్ బ్యూరో) : సరిగ్గా మూడేండ్ల కిందట.. ఓ వ్యక్తి హౌసింగ్ లోన్ చెల్లించకపోవడంతో బ్యాంకు నోటీసు జారీ చేసింది. రూ.2.69 కోట్ల రుణం చెల్లించాలని స్పష్టం చేసింది. అయినా.. అతను చెల్లించకపోవడంతో రెండు నెలల్లోగా సమాధానం ఇవ్వాలంటూ సదరు బ్యాంకు ఏకంగా పత్రికలో బహిరంగ ప్రకటన ఇచ్చింది. ఇది చదవగానే.. ‘అయ్యో పాపం.. అతడు ఎన్ని కష్టాల్లో ఉన్నాడో’ అని అనిపిస్తున్నది కదా?. కాస్త ఓపిక పట్టండి. అప్పుడే అంత సానుభూతి వ్యక్తం చేయొద్దు.
మూడేండ్ల తర్వాత.. కాలచక్రం గిర్రున తిరిగింది. నాడు బ్యాంకు నోటీసులు అందుకొన్న అదే వ్యక్తికి ఇప్పుడు డిఫెన్స్, ఫార్మా, ఇన్ఫ్రాకు సంబంధించిన పలు కంపెనీలు ఉన్నాయి. వందల ఎకరాల భూములూ ఉన్నాయి. అంతేకాదు, కోకాపేట వంటి అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో 50 అంతస్తుల భారీ ఆకాశ హర్మ్యాలు, మాల్స్ నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతున్నది. మూడేండ్లలోనే ఇంత మార్పా? అని ఆశ్చర్యపోతున్నారా? సినిమాల్లో తప్ప నిజ జీవితంలో సాధ్యం కాదని కొట్టిపారేస్తున్నారా? కానీ.. ఇదే పచ్చి నిజం.
నాడు ఈఎంఐలు కట్టలేక నోటీసులు అందుకున్నది, నేడు మూడేండ్లలోనే రూ.వేల కోట్లకు అధిపతి అయ్యింది ఎవరో కాదు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి. అదెలా సాధ్యమైందో తెలియాలంటే మొత్తం కథనం చదవాల్సిందే. అధికారం అండతో ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడు అనుముల కొండల్ రెడ్డి అండ్ కో యథేచ్చగా దోపిడీకి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన తెలంగాణభవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించారు. ‘అనుముల’ కుటుంబం, బంధుగణం విచ్చలవిడి అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. మూడేండ్లలోనే అనేక కంపెనీలు ప్రారంభించిందని, రూ.వేల కోట్లు కూడబెట్టిందని పేర్కొన్నారు. బ్యాంకు రుణం చెల్లించలేక దివాలా తీసిన స్థాయి నుంచి మూడేండ్లలోనే అనేక కంపెనీలు, వందల ఎకరాల భూములు, భారీ ఆకాశహర్మ్యాల నిర్మాణాల స్థాయికి ఎలా ఎదిగారో వివరించారు. పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను మించిపోయిన ‘అనుముల వారి సకుటుంబ సపరివార స‘మేత’!’కు సంబంధించి క్రిశాంక్ తెలిపిన వివరాల మేరకు..
ఆర్ఆర్ కార్ప్ విస్తరిస్తున్నదిలా..
- ఆర్ఆర్ వన్ డౌన్‌టౌన్, కోకాపేట
- ఆర్ఆర్ రివర్స్కేప్, టీఎస్పీఏ-హైదరాబాద్
- ఆర్ఆర్ ఎకో-నెస్ట్, శామీర్‌పేట
- ఆర్ఆర్ ఎకో-ప్రావిన్స్, శామీర్‌పేట
- ఆర్ఆర్ ఎకో-ప్రావిన్స్ పీ-2, శామీర్‌పేట
- ఆర్ఆర్ సీఎన్-50, నార్సింగి
- ఆర్ఆర్ స్టూడియో వన్, నార్సింగి
- ఆర్ఆర్ వెస్టెర్న్ మెడోస్, కోకాపేట
- ఆర్ఆర్ ఆర్9, కోకాపేట
- ఆర్ఆర్ ఇన్ ది ఎలిమెంట్స్, చిక్మగలూర్, రంగారెడ్డి
నాడు బికారీగా..
సీఎం రేవంత్ సోదరుడు అనుముల కొండల్‌రెడ్డి గచ్చిబౌలిలో తన ఇంటి కోసమని మాదాపూర్‌లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి రూ.2,69,45,968 రుణంగా తీసుకున్నారు. అయితే, ఈఎంఐలు సరిగా కట్టలేదు. దీంతో 2023 సెప్టెంబర్ 25న కొండల్‌రెడ్డికి బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. అంతేకాదు, 60 రోజుల్లోగా తమ నోటీసులకు సరైన సమాధానం ఇవ్వాలంటూ 2023 అక్టోబర్ 14న ఓ పత్రికా ప్రకటనను కూడా ఇచ్చారు. అంటే, కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి బ్యాంకు రుణాన్ని కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నాడని, ఒక రకంగా దివాలా స్థితిలో ఉన్నాడని అర్థమవుతున్నది.
నేడు కుబేరగా..
బ్యాంకు నోటీసులు ఇచ్చిన మూడు నెలల్లోనే ‘అనుముల’ కుటుంబం జీవితం అనూహ్య మలుపు తిరిగింది. అబద్ధపు గ్యారెంటీలతో 2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అంతే.. అప్పటి నుంచి అనుముల కుటుంబానికి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. హౌసింగ్ లోన్ ఈఎంఐ కూడా చెల్లించలేని దుస్థితిలో కొండల్‌రెడ్డి, అతితక్కువ కాలంలోనే రూ.కోట్లకు పడగలెత్తారు. టెస్సెరాక్ట్ అనే డిఫెన్స్ కంపెనీకి ఛైర్మన్‌గా మారారు.
అంతేకాదు అరుణ్‌జ్యోతి బయో వెంచర్స్, భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గోల్కొండ ఫార్మా అండ్ కెమికల్ తదితర కంపెనీలకు బాస్ అయ్యారు. రావిర్యాల సహా రాజధాని శివారుల్లోని వందల ఎకరాల భూములు ఆయన కంపెనీల పేరిట రికార్డుల్లోకెక్కాయి. అన్నింటికీ మించి.. రూ. వందల కోట్ల వ్యయంతో నార్సింగి-కోకోపేటలో ఆర్ఆర్ కార్ప్, ఆర్ఆర్9 బిల్డర్స్ పేరిట 50 అంతస్తులతో పలు ఆకాశాహర్మ్యాలు, మాల్స్‌లను శరవేగంగా నిర్మిస్తున్నారు. రేవంత్ రెడ్డి మరో సోదరుడు అనుముల కృష్ణారెడ్డి ఆర్ఆర్ కార్ప్‌కు చెందిన ఆర్9 సంస్థలో భాగస్వామిగా ఉండటం గమనార్హం. దీనినిబట్టే ఒకప్పుడు బ్యాంకు రుణాలను కూడా చెల్లించడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడిన అనుముల పరివారం.. మూడేండ్లలోనే రూ.వేల కోట్ల ఆస్తులను కూడబెట్టినట్టు అర్థమవుతున్నది.
తమ భూముల విలువ పెంచుకోవడానికి..
అధికారం అండతో అక్రమంగా ఆస్తులను కూడబెట్టడమే కాదు, తాము నిర్మిస్తున్న లగ్జరీ అపార్ట్మెంట్లతోపాటు సొంత భూముల ధరలను అమాంతం పెంచడానికి కూడా ‘అనుముల’ ఫ్యామిలీ బిగ్ స్కెచ్ వేసినట్టు తెలుస్తున్నది. నార్సింగిలో వంద ఫీట్ల రోడ్డు అలైన్మెంట్ మార్పు ఈ కుట్రలో భాగమేనని అర్థమవుతున్నది. ఈ అలైన్మెంట్ మార్పుతో సర్వేనెంబర్ 121లో అనుముల కొండల్‌రెడ్డి పేరిట ఉన్న 500 గజాల భూమి రేటుతోపాటు, ఆర్ఆర్ సంస్థ నిర్మిస్తున్న 50 అంతస్తుల టవర్స్, మాల్స్ విలువ అమాంతం పెరుగనున్నట్టు సమాచారం. ఈ ప్రాంతాల పక్కనుంచే అలైన్మెంట్ మార్చిన రోడ్డు వెళ్లడమే దీనికి కారణమని స్థానికులు చెప్తున్నారు. కాగా, ప్రభుత్వ పెద్దల స్వప్రయోజనాల కోసం మార్చిన రోడ్డు అలైన్మెంట్తో సెవెన్ హిల్స్ అపార్ట్‌మెంట్‌తోపాటు దాదాపు 1,000 కుటుంబాలు రోడ్డుమీద పడే ప్రమాదం ఉన్నదని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
మూడేండ్లలో ఎన్ని సిత్రాలో
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన మూడేండ్లలోనే అనుముల కుటుంబ ఆస్తులు అమాంతం పెరిగిపోయినట్టు బలమైన ఆరోపణలు ఉన్నాయి. స్వచ్ఛ్‌బయో పేరిట అనుముల జగదీశ్‌రెడ్డి, ఆర్9 కంపెనీల పేరిట అనుముల కృష్ణారెడ్డి రూ.వేల కోట్లకు పడగలెత్తగా, టెస్సెరాక్ట్, అరుణ్‌జ్యోతి బయో వెంచర్స్, భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గోల్కొండ ఫార్మా అండ్ కెమికల్ కంపెనీలతో పాటు రావిర్యాలలో పెద్దయెత్తున భూములను రిజిస్టర్ చేసుకొన్న అనుముల కొండల్‌రెడ్డి ఆస్తులు కూడా అమాంతం పెరిగిపోయినట్టు చెప్తున్నారు. సీఎం బామ్మర్ది సృజన్‌రెడ్డికి అమృత్ టెండర్లతోపాటు రూ.వేల కోట్ల కాంట్రాక్టులు దక్కుతుండగా, అల్లుడు సత్యనారాయణరెడ్డికి చెందిన మెడికవర్ హాస్పిటల్స్, మ్యాక్స్‌బీన్ ఫార్మాకు రూ.వేల కోట్ల విలువైన లగచర్ల భూములు దక్కినట్టు గుర్తుచేస్తున్నారు. మరో సోదరుడు అనుముల తిరుపతిరెడ్డి కొడంగల్‌లో అనధికార ఎమ్మెల్యేగా ఒకవైపు పెత్తనం సాగిస్తూనే, మరోవైపు భారీగా భూముల కొనుగోళ్లు కూడా జరుపుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వీటితోపాటు కారు షోరూమ్‌లు, అంతర్జాతీయ పాఠశాలలను కూడా గణిస్తే.. అనుముల ఫ్యామిలీ సపరివార స‘మేత’ చిట్టా మరింత పెరుగుతుందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

