Life Science University | హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సాంకేతిక విద్య, వృత్తి నైపుణ్యం, భాషా ప్రావీణ్యం పెంచేందుకు వేర్వేరుగా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో రాష్ట్రంతోపాటు దేశ,విదేశీ విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఒక్కో రంగానికి ఒక్కో యూనివర్సిటీ ఉండటంతో హైదరాబాద్‌లో అభ్యసించేందుకు బారులు తీరుతున్నారు. దేశంలోనే తొలి అటవీ వర్సిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. త్వరలో లైఫ్‌సైన్సెస్ యూనివర్సిటీని నెలకొల్పేందుకు చకచకా అడుగులేస్తున్నది. లైఫ్‌సైన్సెస్ వర్సిటీలు ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రెండు చోట్ల ఉండగా, హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయేది మూడోది.
నిరుడు కోఠి మహిళా కళాశాలను ప్రభుత్వం తెలంగాణ మహిళా వర్సిటీగా అప్‌గ్రేడ్ చేసింది. కొత్తగా లైఫ్‌సైన్సెస్ వర్సిటీని ఏర్పాటు చేసే అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తున్నది. రాష్ట్రంలో వందలాది ఫార్మా, బయోటెక్నాలజీ కంపెనీలు ఉండగా, కొత్తగా మరికొన్ని ఏర్పాటు అవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్లలో ఫార్మాసిటీ ఏర్పాటు అవుతున్నది. ఇక్కడ నెలకొల్పే జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు మానవ వనరులను సమకూర్చడంలో భాగంగా దేశంలో మొదటిది, ప్రపంచంలో మూడో వర్సిటీని నగరంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.
ఫార్మాసిటీకి సమీపంలోనే దీన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే జేఎన్టీయూ సుల్తాన్పూర్ క్యాంపస్‌ను ఫార్మా హబ్‌గా అప్‌గ్రేడ్ చేసే ప్రక్రియ ప్రారంభమైందని ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో కూకట్‌పల్లిలో ఫార్మసీ కోర్సులను సుల్తాన్‌పూర్‌కు తరలించాలని జేఎన్టీయూ నిర్ణయించింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ క్యాంపస్‌లోనే ఫార్మా-డీ కోర్సును కూడా ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.
దేశంలోనే తొలి సాంకేతిక విశ్వవిద్యాలయం జేఎన్టీయూను ఎంతో ముందుచూపుతో ఏర్పాటు చేశారు. దూరవిద్యను అందించేందుకు బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎన్నో కోర్సులను బోధిస్తున్నారు. వీటితోపాటు ఉర్దూ, తెలుగు, ఇంగ్లిష్ సహా ఇతర విదేశీ భాషల కోసం రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు అయ్యాయి. రాష్ట్రంలో మొత్తంగా 31 వర్సిటీలు ఉండగా, వీటిలో 3 సెంట్రల్ యూనివర్సిటీలు, జాతీయస్థాయిలో ప్రాధాన్యం గల విద్యాసంస్థలు 4 ఉన్నాయి. మరో 15 రాష్ట్రస్థాయి వర్సిటీలు, అసెంబ్లీ చట్టం ద్వారా ఏర్పాటైన మరో విద్యాసంస్థ, ఒక ఓపెన్ వర్సిటీ, నాలుగు ప్రైవేట్ వర్సిటీలు, ఒక ప్రభుత్వ డీమ్డ్ వర్సిటీ, 2 ప్రైవేట్ డీమ్డ్ వర్సిటీలు ఉన్నాయి. వీటన్నింటిలో విభిన్న కోర్సులు అందుబాటులో ఉండగా, అనేక రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు తెలంగాణలో చదువుకొనేందుకు ముందుకొస్తున్నారు.
1. జేఎన్టీయూ, ఐఐటీ హైదరాబాద్, ట్రిపుల్ ఐటీ – సాంకేతిక విద్య
2. కొండా లక్ష్మణ్‌బాపూజీ ఉద్యాన వర్సిటీ- పంటలు, పండ్లతోటలు
3. జయశంకర్ వ్యవసాయ వర్సిటీ – పంటలు, వంగడాల ఉత్పత్తి
4. పీవీ నర్సింహారావు వెటర్నరీ యూనివర్సిటీ – పశు వైద్యం
5. తెలంగాణ మహిళా వర్సిటీ – మహిళా విద్య
6. జవహర్లాల్ నెహ్రూ ఫైనార్ట్స్ వర్సిటీ – ఆర్ట్ అండ్ కల్చర్
7. ఫారెస్ట్ యూనివర్సిటీ, ఫారెస్ట్ కాలేజీ -అడవుల పెంపకం, అటవీ సంపద వృద్ధి
8. తెలుగు విశ్వవిద్యాలయం – తెలుగుభాష పరిరక్షణ
9. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ – దూరవిద్య
10.కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ – వైద్యవిద్య
11. జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం – ఉర్దూ భాష కోసం
12. నల్సార్ యూనివర్సిటీ – న్యాయ విద్య
13. ఇప్లూ – విదేశీ భాషల కోసం
14. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ – మేనేజ్మెంట్, బిజినెస్ సంబంధ కోర్సులు