హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : శ్రీశైలం రిజర్వాయర్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) ఆదేశాలివ్వడం తెలంగాణకు గొడ్డలిపెట్టు వంటిదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ పరిణామం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఎల్ నినో పరిస్థితులను సాకుగా చూపుతూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని ఆక్షేపించారు. ఏ నిబంధనల ప్రకారం, ఏ హకుల మేరకు శ్రీశైలం నుంచి వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని తరలిస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ఏపీ సర్కార్ కృష్ణా జలాలను యథేచ్ఛగా తరలిస్తున్నా కేఆర్ఎంబీకి ఎందుకు స్పందించడం లేదని శనివారం ఒక ప్రకటనలో నిలదీశారు. ఏపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టుకు సాగునీటిని తరలిస్తుంటే, ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పంపులను బంద్ చేసి సహకరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. విభజన చట్టంలోని 11వ షెడ్యూల్ నిబంధనలు ఒక తెలంగాణకే వర్తిస్తాయా? అని ఆయన ప్రశ్నించారు. నీటి విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
అసమర్థ పాలనతో సీఎం రేవంత్రెడ్డి శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లను ఏపీకి ధారాదత్తం చేశారని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలోని రైతులతోపాటు జూరాల, నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా ఎత్తిపోతల పథకాల కింద ఉన్న రైతుల పొలాలను ఎండబెడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తిని కూడా నిలిపివేస్తే బోర్ల కింద సాగు చేస్తున్న రైతులకు కరెంట్ అందే పరిస్థితి కూడా ఉండదని ఆందోళన వ్యక్తంచేశారు. ఆగస్టు 21న శ్రీశైలం రిజర్వాయర్లో 169 టీఎంసీల నీరు ఉండగా, ప్రస్తుతం 139 టీఎంసీలకు పడిపోయిందని తెలిపారు. కేవలం 15 రోజుల్లోనే 30 టీఎంసీల నీరు తగ్గిపోయిందని పేరొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల మోటర్లు అన్ని పనిచేసినా రోజుకు 2,400 క్యూసెకుల నీటిని మాత్రమే ఎత్తిపోసే అవకాశం ఉన్నదని, ప్రస్తుతం అకడ కేవలం మూడు మోటర్లు పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో శ్రీశైలం నీటి నిల్వలు తగ్గడానికి తెలంగాణ ఎత్తిపోతల పథకాలే కారణమన్న వాదన సరికాదని స్పష్టంచేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో విఫలమైన ఈ అసమర్థ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.