KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో నిర్వహించనున్న TALHealthFest 2026కు విశిష్ట అతిథిగా ఆహ్వానం వచ్చింది. అక్టోబర్ 30న యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో (UC San Diego)లో జరగనున్న అంతర్జాతీయ ఆరోగ్య సదస్సుకు కేటీఆర్‌ను ఆహ్వానించినట్లు నిర్వాహకులు తెలిపారు.
టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్ సీఈవో సాయి గుండవెల్లి కేటీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం పంపినట్లు పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, భవిష్యత్ వైద్య విధానాలు, ఆవిష్కరణలపై సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు. సదస్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ హెల్త్, పర్సనలైజ్డ్ మెడిసిన్, మెడికల్ టూరిజం తదితర అంశాలపై అంతర్జాతీయ నిపుణులు చర్చించనున్నారు. వైద్యం, సాంకేతికత, ఆవిష్కరణల రంగాల్లో చోటుచేసుకుంటున్న మార్పులపై వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ కూడా ఆరోగ్య రంగంలో సాంకేతికత వినియోగం, ఆవిష్కరణలు, డిజిటల్ హెల్త్ తదితర అంశాలపై తన ఆలోచనలను అంతర్జాతీయ వేదికపై పంచుకోనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.